చిన్న వయసులోనే వ్యాపారంపై ఆసక్తి.. చదువుకుంటూనే తొలి అడుగులు.. అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత వివిధ రంగాల్లో వ్యాపార ప్రస్థానం. తెలంగాణకు చెందిన యువ పారిశ్రామికవేత్త భరత్ కక్కిరేణి ప్రయాణం యువతకు స్ఫూర్తినిచ్చేలా సాగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలను సృష్టించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగిన ఆయన.. భారత్ నుంచి అమెరికా వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ పట్టణానికి చెందిన కక్కిరేణి భరత్ కుమార్ చిన్న వయసు నుంచే వ్యాపారం, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకున్నారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన, విద్యార్థి దశలోనే ఐటీ రంగంలో తన వ్యాపార ప్రయాణానికి పునాది వేశారు.
ఉన్నత చదువుల కోసం 'యుఎస్' బాట..
గ్రాడ్యుయేషన్ తర్వాత తన కెరీర్ను మరింత విస్తరించుకోవాలనే లక్ష్యంతో భరత్ కుమార్ అమెరికాకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. కొత్త దేశం, కొత్త వాతావరణం, విభిన్నమైన వ్యాపార పరిస్థితులను అర్థం చేసుకుంటూ అక్కడ తన ప్రొఫెషనల్ లైఫ్ కొనసాగించారు. చదువు పూర్తయ్యాక కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యాపార అవకాశాలను గుర్తించడం, కొత్త సంస్థలను నిర్మించడం, వివిధ రంగాల్లో కార్యకలాపాలను విస్తరించడం పట్ల దృష్టిసారించారు.
టెక్ ప్రపంచం నుంచి.. బ్యూటీ సామ్రాజ్యం దాకా!
సాఫ్ట్ వేర్ రంగంలో విశేష పరిజ్ఞానం సంపాదించిన భరత్ కుమార్ మొదట కేబీకే బిజినెస్ సోల్యూషన్స్ పేరుతో ఐటీ కంపెనీ స్థాపించారు. అనతి కాలంలోనే డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, బ్యూటీ రంగాల్లో తన కంపెనీలు విస్తరించి కేబీకే గ్రూప్ గా రూపాంతరం చెందించారు. ప్రస్తుతం కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్, కేబీకే బిజినెస్ సొల్యూషన్స్, కేబీకే రియల్టర్స్, కేబీకే హాస్పిటల్, బ్యూటీ బే లాంజ్, గ్లోబల్ పల్స్, కేబీకే ప్రొడక్షన్స్ అనే కంపెనీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇలా కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా ప్రస్తుత సమాజానికి అవసరం అయ్యే ప్రతి విభాగంలో సేవలు అందిస్తోంది కేబీకే గ్రూప్.
అంతర్జాతీయ వేదికపై తెలుగు విద్యార్థులకు దిక్సూచిగా..
అమెరికాలో తన వ్యాపార కార్యకలాపాల విస్తరణతో పాటు ఏటా అక్కడికి వెళ్లే భారతీయులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తున్నారు భరత్ కుమార్. కొత్తగా అమెరికాకు వెళ్లే విద్యార్థులకు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయం చేయడంతోపాటు ఉపాధి, ఉద్యోగాన్వేషణలాంటి అవసరమైన సందర్భాల్లో మార్గనిర్దేశం చేస్తున్నారు.
సేవారంగంలోనూ తనదైన ముద్ర..
కేబీకే గ్రూప్ ద్వారా వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉండే భరత్ కుమార్ సామాజిక సేవకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు చదువు నిమిత్తం ధన, వస్తు రూపేణా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ, వృద్ధాశ్రమాల్లో తరచూ అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
అమెరికా నేలపై ఆధ్యాత్మిక సేవ..
వ్యాపారం, సామాజిక సేవతో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను విదేశాల్లోనూ కొనసాగించాలనే ఉద్దేశంతో కీలక ముందడుగు వేశారు భరత్ కుమార్. టెక్సాస్లోని ఆస్టిన్–జార్జ్ టౌన్ ప్రాంతంలో హరిహర క్షేత్రం పేరుతో ఓ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదికగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
సాధించిన విజయాలకు వరించిన అవార్డులు..
వ్యాపార, సామాజిక కార్యక్రమాలకు సంబంధించి భరత్ కుమార్ పలు విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఆయా రంగాల్లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం, వందే భారత్ ఫౌండేషన్ సౌజన్యంతో 'సంజీవ రత్న పురస్కార్', 'రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్' అందుకొన్నారు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ 2024' ప్రాతినిధ్య జాబితాలో స్థానం సంపాదించారు. అయితే ఈ అవార్డులు, గుర్తింపుల కంటే తాను నిర్మించే సంస్థలు, వాటి ద్వారా సృష్టించే అవకాశాలు, సమాజానికి అందించే సేవే తన ప్రయాణంలో ముఖ్యమనే దృక్పథంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
యువతకు మార్గదర్శిగా.. భావితరాలకు దిక్సూచిగా..
చిన్న పట్టణం లేదా సాధారణ నేపథ్యం మన లక్ష్యాలకు ఏమాత్రం పరిమితి కావని నిరూపించారు ఈ యువ ఆంత్రప్రెన్యూర్ భరత్ కుమార్. విద్యార్థి దశలో మొదలైన వ్యాపార ఆసక్తిని అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు విస్తరించేందుకు చేసిన భరత్ కక్కిరేణి ప్రయత్నం యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తోంది.
తెలంగాణ నుంచి అమెరికా వరకు సాగిన ఆయన ప్రయాణం కేవలం ఒక వ్యాపారవేత్త కథగా కాకుండా.. అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలనుకునే యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మారుతున్న టెక్నాలజీ, వ్యాపార ప్రపంచంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, భారత్–అమెరికా మధ్య తన వ్యాపార, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు భరత్ కుమార్ కక్కిరేణి.
ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..


