సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి మరికొద్ది గంటలే మిగిలాయి. నేడు అర్ధరాత్రితో భక్తులకు దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో.. చివరి రోజు గణనాథుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఈసారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు. ఇప్పటివరకు( సెప్టెంబర్ 22, మంగళవారం దాకా) 18 లక్షల మందికిపైగా దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజైన మంగళవారం కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి నేడు ఆఖరి రోజు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చివరి రోజు కావడంతో లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రేపటి నుంచి నిమజ్జన ఏర్పాట్లు
అర్ధరాత్రితో దర్శనం ముగిసిన తర్వాత బుధవారం ఉదయం నుంచి మహాగణపతి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. భారీ విగ్రహాన్ని తరలించే మార్గం, క్రేన్, వాహనాలు, భద్రత తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
ఎల్లుండి నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎల్లుండి జరగనుంది. నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే.. మధ్యాహ్నాం కల్లా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన బైంసా గణేశుడి శోభాయాత్ర


