హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అభిమానుల మధ్య కూర్చొని చూడాలని ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో సెప్టెంబర్ 23న జరిగే ప్రీమియర్ షోను ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీస్ అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నాని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి తాజాగా స్పందించారు.
సినిమా అంటే చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఇష్టమని నాని పేర్కొన్నారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటంలోనే తనకు ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అక్కడ ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలని ఉందని కోరారు.
సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని నాని పేర్కొన్నారు. అదే సమయంలో అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటిస్తామని.. భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
నాని అప్పీల్‌కు సీఎం రిప్లై..
నాని విజ్ఞప్తిపై ఈ ఉదయం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు, అలాగే ప్రతిభావంతుడైన యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమా(The Paradise) పట్ల చూపించిన నిబద్ధతకుగానూ నానికి అభినందనలు తెలియజేశారు.
అభిమానుల రద్దీని సజావుగా నిర్వహించడంతో పాటు ప్రజల భద్రతను నిర్ధారించేందుకు.. సంబంధిత స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ క్రమంలో డీజీపీకి ఆయన ట్యాగ్ చేశారు.
We appreciate your respect for safety guidelines, @NameisNani, and your commitment for the film directed by our talented young Telangana director, @odela_srikanth.
To ensure seamless crowd management and public safety, please submit an official application to the designated… https://t.co/w8NAZOBzsd— Revanth Reddy (@revanth_anumula) September 23, 2026
ముందే పర్మిషన్.. అయినా ప్రత్యేక విజ్ఞప్తి
‘ది ప్యారడైజ్’కు తెలంగాణలో సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గత అనుభవాల దృష్ట్యా.. స్టార్ హీరోలు స్వయంగా సినిమా చూసే సంప్రదాయానికి కొన్నాళ్లుగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రేక్షకులతో కలిసి తాను కూడా ది ప్యారడైజ్ ప్రీమియర్ చూడాలన్నది నాని కోరిక చర్చనీయాంశమైంది. సీఎం సూచన మేరకు నాని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుంటారా?.. తర్వాత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ది ప్యారడైజ్‌లో ఆ దేవత గురించి తెలుసా?


