భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని హారణి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఇంటి వెనుక భాగంలోని బాత్‌రూమ్ సమీపంలో ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హారణి మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయి. అలాగే మెడకు చున్నీ బిగించిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇది హత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో ఇంటి ముందు తలుపులు మూసి ఉండగా.. వెనుక తలుపు తెరిచి ఉండటంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశీలించిన పోలీసులు ఆధారాల కోసం క్లూస్‌టీమ్‌ను రంగంలోకి దించారు.
సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై జినత్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. హారణి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


