ది ప్యారడైజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, రా స్టేట్‌మెంట్.. ఇలా ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన ప్రతి చిన్న అంశాన్ని అభిమానులు, నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’లోని కాకులు, ‘ఆయా షేర్’ పాటలో వినిపించే ఓ మిస్టీరియస్ బీజీఎం మధ్య ఉన్న లింక్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ఒక్క బీజీఎంతో కథపై కొత్త చర్చ..
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 23న ప్రీమియర్స్ జరగనున్నాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ‘ఆయా షేర్’ పాట ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు మంచి స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అదే పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘ధూం ధూం తఃతః’.. ధూమావతి మంత్రమేనా?
‘ఆయా షేర్’ పాటలో వినిపించే ‘ధూం ధూం తఃతః’ అనే బీజీఎం.. ‘ధూం ధూం ధూమావతి తఃతః’ అనే మంత్రాన్ని పోలి ఉందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ బీజీఎంకు, సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఏదైనా సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది.సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో మొదటి నుంచీ కాకులు పదేపదే కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన రా స్టేట్‌మెంట్‌లోనూ కాకుల ప్రస్తావనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశిర్రు గానీ.. గదే జాతిల పుట్టిన కాకుల గురించి బైంగన్ బి రాయలే.. గిది కడుపుమండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రత్తం పోసి పెంచిన ఓ జాతి కథ..’ అనే డైలాగ్‌తో విడుదలైన ఈ రా స్టేట్‌మెంట్.. సినిమాలో కాకులకు ఉన్న ప్రాధాన్యంపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను ‘ఆయా షేర్’లోని ‘ధూం ధూం తఃతః’ బీజీఎంతో లింక్ చేస్తూ నెటిజన్లు తమదైన రీతిలో కథను అంచనా వేస్తున్నారు.
ధూమావతి దేవికి.. కాకులకు ఉన్న సంబంధమేంటి?
హిందూ తాంత్రిక సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ధూమావతి దేవిని ఏడో మహావిద్యగా పరిగణిస్తారు. ‘ధూమావతి’ అనే పేరు పొగతో కూడినది, పొగమయమైనది అనే అర్థాలను సూచిస్తుంది. ఇతర దేవతలతో పోలిస్తే ఆమె రూపం కూడా భిన్నంగా ఉంటుంది.సాధారణంగా ధూమావతి దేవిని వృద్ధ వితంతువు రూపంలో, అలంకారాలు లేకుండా, చేతిలో చాటతో ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమెకు సంబంధించిన ప్రతీకల్లో కాకికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ధూమావతి దేవి ప్రస్తావన వచ్చినప్పుడు కాకి ప్రతీక కూడా గుర్తుకు వస్తుంది.
‘ప్యారడైజ్’లోనూ అదే థీమ్‌నా?
ఇక్కడే నెటిజన్ల థియరీ ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు సినిమాలో కాకులకు ఇస్తున్న ప్రాధాన్యం.. మరోవైపు ‘కడుపుమండిన కాకుల కథ’ అంటూ వచ్చిన రా స్టేట్‌మెంట్.. దీనికి తోడు ‘ఆయా షేర్’లో వినిపించే ‘ధూం ధూం తఃతః’ బీజీఎం.. ఇవన్నీ కలిపి చూస్తే ధూమావతి దేవికి సంబంధించిన ఏదైనా ప్రతీకాత్మక అంశం సినిమాలో ఉండొచ్చా? అనే చర్చ జరుగుతోంది.
ఇది నిజమైన క్లూనా?
అయితే ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా నెటిజన్ల విశ్లేషణ, అభిమానుల థియరీగానే చూడాలి. సినిమా విడుదలైన తర్వాతే కాకులు, ధూమావతి దేవి, ‘ధూం ధూం తఃతః’ బీజీఎం మధ్య అసలు కనెక్షన్ ఏంటి? అనేది స్పష్టమవుతుంది.అయితే విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌లోని చిన్న చిన్న అంశాలను పట్టుకుని ప్రేక్షకులు ఇంతలా విశ్లేషణలు చేయడం మాత్రం ‘ది ప్యారడైజ్’పై ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. నిజంగానే ఇవన్నీ కథలో భాగమా? లేక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కావాలనే ఇలాంటి క్లూస్ వదిలారా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ధూమావతి దేవి ఎవరు?
ధూమావతి దేవి హిందూ శాక్త సంప్రదాయంలోని దశ మహావిద్యల్లో ఏడో మహావిద్యగా ప్రసిద్ధి. సాధారణంగా ఆమెను వృద్ధురాలైన, వితంతువు రూపంలో, గుర్రాలు లేని రథంపై కూర్చున్న దేవతగా చిత్రిస్తారు. రథంపై కాకి చిహ్నం ఉండటం లేదా కొన్ని సంప్రదాయాల్లో ఆమె కాకిపై కూర్చున్నట్లుగా చూపించడం ప్రత్యేకత.
‘ధూమావతి’ అనే పేరు ఎలా వచ్చింది?
సంస్కృతంలోని ‘ధూమ’ అంటే పొగ. అందుకే ధూమావతిని సాధారణంగా ‘పొగతో కూడినది’ లేదా ‘పొగ స్వరూపిణి’గా అర్థం చేసుకుంటారు. అగ్ని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిగిలే పొగ, బూడిద వంటి భావనలకు ఆమె రూపం ప్రతీకగా భావించబడుతుంది. ఇది క్షయం, శూన్యత, అంతం, వైరాగ్యం వంటి భావాలను సూచిస్తుందని తాంత్రిక సంప్రదాయంలో వివరణలు ఉన్నాయి.
ధూమావతి ఎలా ఆవిర్భవించింది?
ధూమావతి ఆవిర్భావానికి సంబంధించిన కథనాలు ఒకే విధంగా లేవు. ముఖ్యంగా రెండు ప్రసిద్ధ పురాణ-తాంత్రిక కథనాలు కనిపిస్తాయి.
సతి దహనం నుంచి ధూమావతి: దక్ష యజ్ఞంలో సతి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నప్పుడు, ఆ దహన ప్రక్రియ నుంచి వెలువడిన పొగలోంచి ధూమావతి అవతరించిందని ఒక కథనం చెబుతుంది. అందుకే ఆమెకు ‘ధూమావతి’ అనే పేరు వచ్చిందని వివరణ.
శివుడిని మింగిన సతి కథ: మరో కథనం ప్రకారం సతికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. శివుడు ఆహారం ఇవ్వకపోవడంతో కోపంతో ఆమె శివుడినే మింగుతుంది. అనంతరం శివుడిని బయటకు విడుదల చేసిన తర్వాత, ఆమె వితంతువు రూపమైన ధూమావతిగా మారుతుందని ఈ కథనం వివరిస్తుంది.
🤯మీకు తెలుసా?#MovieSecretsWithAnjiShette - Day 1#TheParadise మూవీ థీమ్ సాంగ్‌లో మారుమోగే పవర్ఫుల్ మంత్రం వెనుక అసలు కథ ఇదే
దశ మహావిద్యల్లో ఐదవ రూపమైన "ధూమావతి" అమ్మవారి మంత్రం🔥
శత్రు సంహారానికి ప్రతీకగా నిలిచే అమ్మవారి మంత్రం వింటే గూస్ బంప్స్🔥#Nani #Paradise pic.twitter.com/Plz4yiK02I— Anji Shette (@AnjiShette) September 21, 2026


