'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో తెలుగులోనూ కొందరు అభిమానుల్ని సంపాదించుకున్న యంగ్ హీరో అశోక్ సెల్వన్.. తర్వాత 'నిన్నిలా నిన్నిలా' అనే స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ కూడా చేశాడు. గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ADHD అనే రోగం తనకు వచ్చిందనే సంగతి బయటపెట్టాడు. దాని గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ రుగ్మత వస్తే ఉన్నట్టుండి హైపర్ అయిపోతుంటారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్..ఈ జబ్బు తనకు ఉందని బయటపెట్టాడు. ఇప్పుడు తమిళ హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ.. ఇది నిర్ధారణ అయిన తర్వాత నా ఆలోచనా విధానం, రోజువారీ అలవాట్లని మరింతగా అర్థం చేసుకునే విషయంలో స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చాడు.
'నాకు మొదటినుంచీ సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం చేతకాదు. చెప్పాలంటే కొంత కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఈ సమస్యని అధిగమించేందుకు నాకు నేను ఎక్కువగా రిమైండర్లు పెట్టుకుంటున్నాను. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించే అలవాటు నాకు ఉంది. అందుకే రాత్రిపూట నాతో తీవ్రమైన లేదా ఎక్కువగా ఆలోచించేలా చేసే విషయాలని మాట్లాడొద్దని నా భార్య కీర్తికి చెప్పాను. మన మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని, దాన్ని అంగీకరించడం మంచిది అని ఇప్పుడు తెలుసుకున్నాను' అని అశోక్ సెల్వన్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలామందికి ఇలాంటి రుగ్మతలు ఉండి ఉండొచ్చు. కానీ తమకున్న జబ్బు గురించి బయటకు చెప్పుకోరు. కానీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఇలాంటి వాటి బారిన పడినవాళ్లకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మనసు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా రోజువారీ పనులు చేసుకోవడం ముఖ్యమని అశోక్ సెల్వన్ మాటలబట్టి అర్థమవుతోంది.
అశోక్ సెల్వన్.. తోటి హీరోయిన్ కీర్తి పాండియన్‌ని ప్రేమించి 2023లో పెళ్లి చేసుకున్నాడు. ఇతడు నటించిన అన్బిల్ అవన్ అనే తమిళ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే ఈ రుగ్మత బారినపడ్డ సంగతి బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం)


