ఓటీటీలోకి అప్పడప్పుడు థ్రిల్లర్సే కాకుండా కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా వస్తుంటాయి. ఇవి ఎమోషనల్‌గా సాగుతూ చాలామందికి కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మూవీనే 'అడ్కిట్టా'. రీసెంట్‌గానే నేరుగా జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి?
గౌతం, కస్తూరి భార్యాభర్తలు. ఒకే కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా పనిచేస్తుంటారు. ఓరోజు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలుసుకుని ఇది తమ ప్లానింగ్‌లో లేకపోయినప్పటికీ.. ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టాక మేనేజ్ చేయగలం అనుకుంటారు. కానీ నెలలు నిండకముందే కస్తూరికి డెలివరీ అవుతుంది. ఓ బిడ్డ, గర్భంలోనే చనిపోతాడు. మరో మగబిడ్డ పుడతాడు. ఆరు నెలలు అలా అలా గడిచిపోతాయి. కస్తూరి, ఆఫీస్‌కి వెళ్ళాలి అనేసరికి పిల్లాడిని చూసుకోవడం ఎలా అనే ప్రశ్న వస్తుంది. దీంతో నానీ (కేర్ టేకర్) కోసం వెతుకుతారు. అలా మంగళ్.. వీళ్లకు పరిచయమవుతుంది. ఈమె నచ్చి.. నానీగా చేర్చుకుంటారు. తర్వాత ఏమైంది? మంగళ్ విషయంలో కస్తూరి మనసులో ఎలాంటి అపార్ధాలు వచ్చాయి? అవి ఎంతవరకు వెళ్లాయి? చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉంది?
ఒకప్పుడు మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. ఓ పిల్లాడో/పిల్ల ఇంట్లో ఉంటే చూసుకోవడానికి తాత, నానమ్మ, బాబాయ్, పిన్ని, అన్న, చెల్లి అని చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు/అత్తమామలు నుంచి దూరంగా వచ్చి సిటీలో ఉద్యోగాలు చేసుకునే భార్యాభర్తలని చూసే ఉంటారు. పొద్దున అనగా ఆఫీస్‌కి వెళ్తే రాత్రయితే గానీ ఇంటికి రారు. అలాంటి ఓ జంటకు ఓ బిడ్డ పుడితే ఏమైందనేదే ఈ సినిమా.
ప్లానింగ్ చేయకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందని కస్తూరి ,గౌతం ఓ వైపు కన్ఫ్యూజ్ అవుతూ మరోవైపు సంతోషపడే సీన్‌తో సినిమా మొదలవుతోంది. బిడ్డ పుడితే మేనేజ్ చేయగలం అనుకుంటారు. అంత బాగానే ఉంటది గానీ బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత కస్తూరి.. ఆఫీస్‌కి వెళ్ళాలనేసరికి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కస్తూరి ఏమో ఉద్యోగం మానేస్తా, కొడుకుని చూసుకుంటా అంటుంది. గౌతం మాత్రం నువ్వు కలలుగన్న ప్రాజెక్ట్.. మధ్యలో వదిలేస్తే ఎలా? అని భార్యని కన్విన్స్ చేసి ఆఫీస్‌కి వచ్చేలా చేస్తాడు. కానీ పిల్లాడిని చూసుకోవటానికి నానీని వెతికితే మంగళ్ వీళ్లకు నచ్చుతుంది.
మంగళ్ వీళ్ళ జీవితాల్లోకి వచ్చిన తర్వాత బిడ్డ విషయంలో కస్తూరికి అన్ని పనులు ఈజీ అయిపోతాయి. కానీ బిడ్డ విషయంలో కొన్ని పరిస్థితుల వల్ల మంగళ్ - కస్తూరి మధ్య అపార్ధాలు తలెత్తుతాయి. ఇంతకీ అవేంటి? కస్తూరి చివరకు ఏం రియలైజ్ అయింది? కస్తూరి బిడ్డ వల్ల మంగళ్ జీవితం ఎలా తలకిందులు అయింది? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

సినిమా స్టోరీ చాలా సింపుల్. కానీ దాన్ని రిలేటబుల్‌గా అదే టైంలో ఎమోషనల్‌గా తీశారు. మంగళ్ క్యారెక్టర్ ఫ్యామిలీతో ఉండే ఎమోషన్స్‌ని ఇంకా డెప్త్‌గా చూపించొచ్చు కానీ పైపైనే చూపించి సరిపెట్టేశారు. కానీ కాకితో ఈమెకు ఉండే ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. ఇంత సీరియస్ మూవీలో 'ఇన్నర్ వేర్' జోక్ భలే పేలింది. కస్తూరి పాత్రకు చాలామంది చిన్న పిల్లలు ఉన్న వర్కింగ్ మదర్స్ కచ్చితంగా రిలేట్ అవుతారు. క్లైమాక్స్ అయితే అర్థం అయి కానట్టు ఉంటది. నటీనటులు అందరూ బాగా చేశారు. టెక్నికల్‌గానూ అన్ని సహజంగా అనిపించాయి. ఓవరాల్‌గా బాగుంది.
ఇదో మరాఠీ సినిమా. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ ఏదైనా మంచి ఎమోషనల్ మూవీ చూద్దామనుకుంటే ఓటీటీలో దీనిని ట్రై చేయండి. అస్సలు డిస్సపాయింట్ చేయదు.
- చందు డొంకన, సాక్షి వెబ్ డెస్క్


