తెలంగాణకు బిగ్‌ అలర్ట్‌.. మరికాసేపట్లో ఈ జిల్లాల్లో కుంభవృష్టి! | Telangana High Alert as Heavy Rains Lash Hyderabad 8 Districts Red Alert | Sakshi
Sakshi News home page

తెలంగాణకు బిగ్‌ అలర్ట్‌.. మరికాసేపట్లో ఈ జిల్లాల్లో కుంభవృష్టి!

Sep 23 2026 7:26 AM | Updated on Sep 23 2026 7:29 AM

Telangana High Alert as Heavy Rains Lash Hyderabad 8 Districts Red Alert

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం సాయంత్రం లేదంటే రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌–దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే వర్షాలు మొదలవగా.. రానున్న గంటల్లో మరింత ఉద్ధృతం కానున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వాతావరణ శాఖ బుధవారం ఎనిమిది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇటు హైదరాబాద్‌లోనూ మరికాసేపట్లో పిడుగులతో కూడిన వాన కురవొచ్చని హెచ్చరించింది.

మరోవైపు కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ, రేపు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. 

బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సెప్టెంబర్‌ 23 రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కళింగపట్నం సమీపంలో తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉండొచ్చని అంచనా. ఆ తర్వాత దాని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌లో వాన?
తీవ్ర వాయుగుండం ప్రభావం హైదరాబాద్‌పైనా కనిపిస్తోంది. నగరంలో పలుచోట్ల నిన్న సాయంత్రం.. అర్ధరాత్రి దాటాక పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మరికాసేపట్లో నగరంలో పిడుగులతో కూడిన వర్షం మరోసారి పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉరుములు.. పిడుగులతో జాగ్రత్త
వర్షాల సమయంలో పిడుగులు, ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌ అలర్ట్‌ జిల్లాల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం, చెట్ల కింద నిలబడకపోవడం, విద్యుత్‌ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కంటికి నచ్చితేనే కడుపులోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement