2027లో దేశంలోకి తొలి డెంగీ టీకా | First dengue vaccine to enter the country in 2027 | Sakshi
Sakshi News home page

2027లో దేశంలోకి తొలి డెంగీ టీకా

Sep 23 2026 5:51 AM | Updated on Sep 23 2026 5:51 AM

First dengue vaccine to enter the country in 2027

వచ్చే ఏడాది ప్రైవేటు మార్కెట్‌లో అందుబాటులోకి జపాన్‌ వ్యాక్సిన్‌ క్యూడెంగా... నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి రక్షణ 

భారత్‌లో పంపిణీ కోసం హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌తో తకేడా ఫార్మా ఒప్పందం 

భారీగా టీకాల తయారీకి హైదరాబాద్‌కే చెందిన బయోలాజికల్‌–ఈతో జట్టు

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ వ్యాధి నివారణకు దేశంలో తొలిసారిగా టీకా అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన ‘క్యూడెంగా’కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఈ ఏడాది జూలైలో అనుమతి ఇచ్చింది. 2027 తొలి ఆరు నెలల్లో ఈ టీకా భారత ప్రైవేటు మార్కెట్‌లోకి రానుంది. దీని పంపిణీ, మార్కెటింగ్‌ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లే»ొరేటరీస్‌ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. టీకా తయారీని భారీగా పెంచేందుకు ‘తకేడా’2024లోనే హైదరాబాద్‌కే చెందిన ‘బయోలాజికల్‌–ఈ’తో ఒప్పందం చేసుకుంది. మరోవైపు దేశంలో తయారవుతున్న డెంగీఆల్‌ టీకా కూడా కీలక దశలో ఉంది. ఐసీఎంఆర్‌–ఎన్‌ఐటీవీఏఆర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. 

తొలుత జర్మనీ నుంచి టీకా 
భారత్‌లో క్యూడెంగా టీకాను 4 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఇవ్వడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్‌కు వచ్చే తొలి డోసులు జర్మనీలోని తకేడా తయారీ కేంద్రం నుంచి దిగుమతి కానున్నాయి. దిగుమతి అయిన టీకాను దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు, ఫార్మసీల ద్వారా అందుబాటులోకి తీసుకురావడంలో డాక్టర్‌ రెడ్డీస్‌ కీలకపాత్ర పోషించనుంది. పబ్లిక్‌ మార్కెట్‌లో వాణిజ్య హక్కులు మాత్రం తకేడా వద్దే ఉంటాయి. మరోవైపు బయోలాజికల్‌–ఈ ఏటా 5 కోట్ల డోసుల వరకు క్యూడెంగా టీకాలను తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏడాదికి 10 కోట్ల డోసుల సరఫరా సామర్థ్యాన్ని సాధించాలని తకేడా లక్ష్యంగా పెట్టుకుంది. 

నాలుగు రకాల వైరస్‌లపై రక్షణ 
క్యూడెంగా టీకా డీఈఎన్‌వీ–1, 2, 3, 4 అనే నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణ కల్పించనుంది. ఇది లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టెట్రావాలెంట్‌ వ్యాక్సిన్‌. గతంలో డెంగీ వచి్చందా లేదా అనే దానితో సంబంధం లేకుండా టీకా ఇవ్వవచ్చని భారత నియంత్రణ సంస్థ అనుమతి ఇచి్చంది. 4–60 ఏళ్ల వయసు వారికి రెండు డోసులు ఇవ్వాలి. వాటి మధ్య మూడు నెలల వ్యవధి ఉండాలి. తకేడా వెల్లడించిన మూడో దశ దీర్ఘకాలిక అధ్యయన ఫలితాల ప్రకారం రెండు డోసుల తర్వాత డెంగీ ఇన్ఫెక్షన్, ఆస్పత్రిలో చేరే ముప్పును తగ్గించడంలో టీకా రక్షణ కల్పించినట్లు కంపెనీ తెలిపింది. 

తెలంగాణకు ఊరట 
తెలంగాణలో డెంగీ రోగుల సంఖ్య గత ఐదారేళ్లలో సగటున 8 వేల వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2021లో 7,135, 2022లో 8,972, 2023లో 8,016, 2024లో 10,077, 2025లో 8,412 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో 2024లో 2,806, 2025లో 1,983 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 13 వరకు 266 కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో డెంగీ టీకా అందుబాటులోకి రావడం తెలంగాణకు కూడా ఊరటనివ్వనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement