‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ అమలుపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ సంజయ్‌జాజు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అత్యాచార ఘటనలపై మానవీయ కోణంలో స్పందించాలి
సకాలంలో సహాయం, పునరావాసం అందేలా చూడాలి
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిర్మూలన చట్టం అమలుపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం–1989 కింద బాధితులకు నష్ట పరిహారం సత్వరమే చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పారు. బాధితుల వి షయంలో మానవీయ కోణంలో స్పందించాలని, వారికి సకాలంలో నష్టపరిహారం, సహాయం, పునరావాసం అందేలా చూడాలని స్పష్టం చేశారు. షాబాద్ హత్యలు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.
‘ఎస్సీ, ఎస్టీల చట్టం’ అమలుపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమా వేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి సీఎం అధ్యక్షతన ఈ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అండ్ మానిట రింగ్ కమిటీ సమావేశం జరగగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం అధ్యక్షతన సమావేశం కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయ స్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితు లకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలను ఈ సందర్భంగా రేవంత్ సమీక్షించారు. కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్ కోర్టుల పనితీరుతో పాటు చట్టంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
ఐదేళ్లలో తగ్గిన కేసులు
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా రాష్ట్రంలో గత ఐదేళ్లలో క్రమంగా ఎస్సీ ఎస్టీలపై అత్యాచార కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి నిఘా కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జనాభా దామాషా ఆధారంగా నిధులు
దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం అన్నారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో సొంత బిడ్డల్లా ఆదరించిందని, అందుకే పల్లెపల్లెనా ఇప్పటికీ ఇందిరమ్మను తలుచుకుంటున్నారని చెప్పారు. పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల పట్టాలు అందించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్‌సీలే ఉన్నారన్నారు. ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే, వారికి 17 శాతం ఇళ్లను మంజూరు చేశామని వివరించారు.
అందరికీ నాణ్యమైన భోజనం
రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు సహా పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనం అందుతోందని రేవంత్ అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని చెప్పారు. పిల్లలను చదువుతో పాటు క్రీడలవైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీ నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ఎస్‌సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


