ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం శిల్ప, వాస్తు కళను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆయా నిర్మాణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎస్‌ఎన్‌ఎల్ లైన్లు, తాగు నీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.
రహదారులు అనుసంధానించాలి
విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, ఆ రహదారులను సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. విద్యుత్, ఆర్ అండ్ బీ, తాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో చర్చించి, ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని సూచించారు. ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని పనులు ముందుకు సాగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే, విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడి నుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలని చెప్పారు.
పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పలు ఆకృతుల్లో మార్పులను సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, సీఎస్ సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, పవర్ గ్రిడ్ ఈడీ డొమన్ యాదవ్, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎయిర్ కమోడొర్ రాహుల్ శుక్లా, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, స్థపతి ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


