కేన్సర్‌ టైమ్‌బాంబ్‌! | Alarming increase in cancer cases in Telangana | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ టైమ్‌బాంబ్‌!

Sep 23 2026 2:33 AM | Updated on Sep 23 2026 2:33 AM

Alarming increase in cancer cases in Telangana

10 నిమిషాలకో కేసు.. 20 నిమిషాలకో మరణం!

తెలంగాణలో ఆందోళనకర స్థాయిలో కేన్సర్‌ కేసుల పెరుగుదల

2025లో 53 వేలకుపైగా కొత్త కేసులు, 29 వేలకుపైగా మరణాలు నమోదు 

మొత్తం కేసుల్లో 60 శాతం కేన్సర్‌ బాధితులు మహిళలే 

ప్రతి లక్ష జనాభాకు అత్యధికంగా హనుమకొండలో 79 కేసులు 

రాష్ట్ర తొలి కేన్సర్‌ అట్లాస్‌ ఆధారంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’గ్రౌండ్‌ రిపోర్ట్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కె.రాహుల్‌/బి.అనిల్‌కుమార్‌
తెలంగాణపై కేన్సర్‌ టైమ్‌బాంబు పేలేందుకు సిద్ధమవుతోంది. కేన్సర్‌ ముప్పు నగరాలు, పట్టణాలను దాటి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో కేన్సర్‌ అనుమానిత కేసుల పెరుగుదల కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కేన్సర్‌ కేసుల వ్యాప్తి ఆందోళన కలిగిస్తుండగా తెలంగాణలో ఈ కేసుల పెరుగుదల వేగం జాతీయ సగటు కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. గతంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు కేన్సర్‌ ముప్పు 1,165 కేసులుగా ఉంటే తెలంగాణలో అది 1,338 కేసులుగా నమోదవుతోంది. ప్రస్తుతం అందుతున్న క్షేత్రస్థాయి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఏటా కొత్తగా దాదాపు 46,762కిపైగా కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఐసీఎంఆర్, నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ అంచనాల ప్రకారం 2025లో తెలంగాణలో 53,565 కొత్త కేన్సర్‌ కేసులు నమోదవగా 29,300 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదైన వార్షిక డేటాను రోజువారీ గంటలవారీగా విశ్లేషిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త కేన్సర్‌ కేసు నమోదవుతోంది. ప్రతి 18 నుంచి 20 నిమిషాలకు ఒకరు కేన్సర్‌ చికిత్స పొందుతూ లేదా వ్యాధి తీవ్రత వల్ల మరణిస్తున్నారు. ప్రతిరోజూ సగటున 147 మంది కొత్తగా కేన్సర్‌ బారిన పడుతున్నారు. గంటకు సగటున ఆరుగురు కేన్సర్‌ బారిన పడుతుండగా రోజుకు సగటున 80 మంది మరణిస్తున్నారు.  

ఇదీ నివేదిక... 
రాష్ట్రంలో కేన్సర్‌ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రముఖ కేన్సర్‌ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రూపొందించిన తొలి కేన్సర్‌ అట్లాస్‌ ఆఫ్‌ తెలంగాణ నివేదికలోని అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2020 నుంచి 2025 వరకు సేకరించిన గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. రాష్ట్రంలో సగటున ప్రతి లక్ష మంది జనాభాకు ఏడాదికి 52 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం 33 జిల్లాలలో 25 జిల్లాల్లో కేన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. చికిత్స పొందిన బాధితుల వివరాలను విశ్లేషించి కేన్సర్‌ ఇన్సిడెన్స్‌ అండ్‌ ప్రివలెన్స్‌ మ్యాపింగ్‌ అక్రాస్‌ తెలంగాణ పేరిట ఈ నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక ప్రకారం బాధితుల్లో 60% మంది మహిళలే ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా పెళ్లిళ్లు/సంతానం కలగడం వల్ల రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ వంటివి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


గాలి నాణ్యత క్షీణిస్తే ఆరోగ్యంపై ప్రభావం 
గాలిలో ధూళికణాలు, పొగ, ఇతర కాలుష్య కారకాలు పెరిగితే వాయు నాణ్యత క్షీణిస్తుంది. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురికావడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు మాసు్కలు ధరించడం, దుమ్ము, పొగకు దూరంగా ఉండటం ద్వారా కొంత రక్షణ పొందవచ్చు. 
– డాక్టర్‌ నరేందర్, పల్మనాలజిస్ట్, కరీంనగర్‌ 

‘సాక్షి’పరిశీలనలో వెలుగులోకి వచ్చిన కేన్సర్‌ ఉదంతాలు ఇలా.. 
– కరీంనగర్‌ పక్కనే ఉండే సదాశివపల్లి గ్రామంలోనే 25 మంది కేన్సర్‌ రోగులున్నారు. ఈ ఏడాది ముగ్గురు గ్రామస్తులు కేన్సర్‌తో మరణించారు. గ్రామ శివార్లలోని రైస్‌ మిల్లుల నుంచి వచ్చే కాలుష్యం వల్లే తాము కేన్సర్‌కు గురవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. 
– కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న కోతిరాంపూర్, పరిసరాల్లో డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే పొగ వల్ల స్థానికంగా కేన్సర్‌ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అందులోనూ గృహిణులు అధికంగా రోగం బారిన పడుతున్నారు. డంపింగ్‌ యార్డు తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 
– పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పరిసర ప్రాంతాలన్నీ కేన్సర్‌ జోన్లుగా మారుతున్నాయి. ఎన్టీపీసీ, గోదావరిఖని, ఎల్కలపల్లి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి కార్బన్, సల్ఫర్‌ గాలిలో కలుస్తుండటంతో ప్రజలు కేన్సర్‌ సహా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. రామగుండం మండలం కుందన్‌పల్లి, మల్యాలపల్లి, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపూర్, విఠల్‌నగర్, ఎల్‌కపల్లి, అంతర్గాం, నరసలపల్లి పరిసర గ్రామాల్లో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా 5 వేల మంది నుంచి రక్తనమూనాలను సేకరించగా వారిలో 183 మందికి ప్రీ–కేన్సర్‌ లక్షణాలు, 20 మందిలో కేన్సర్‌ అనుమానిత లక్షణాలను గుర్తించారు. అనుమానిత కేసులను తదుపరి పరీక్షల నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఆ తర్వాత వాటి వివరాలు బహిర్గతం కాలేదు. 

ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు..  
ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే బొగ్గు దుమ్ము, బూడిద కాలుష్యం వల్ల రోజూ మా ఇళ్ల ముందు బొగ్గు పొర చేరుతోంది. మంచి నీటిలోనూ దుమ్ము కలుస్తోంది. ఎంత మొరపెట్టుకున్నా అధికారులు, ప్లాంట్‌ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కనీసం రోడ్లపై నీళ్లు చల్లట్లేదు. 
– పెంబర్తి ప్రదీప్, మాతంగి కాలనీ, 24వ డివిజన్, రామగుండం కార్పొరేషన్‌ 

పవర్‌ ప్లాంట్‌తో మా జీవితాలు నాశనం.. 
మా 23వ డివిజన్‌లో ఇళ్లలోని గిన్నెలు, సామగ్రిపైనా బూడిద పడుతోంది. పిల్లలు అనారోగ్యం పాలవుతుంటే ఆస్పత్రుల చుట్టూ తిరగడానికే డబ్బంతా ఖరై్చపోతోంది. పవర్‌ ప్లాంట్‌ వల్ల మా ఆరోగ్యం, జీవితాలు నాశనమవుతున్నాయి. బూడిద గాలిలో కలవకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 
– లక్ష్మి, మాతంగి కాలనీ (గృహిణి) 

మా గ్రామంలో రోజూ ఇళ్లపై సమీప రైస్‌మిల్లుల ద్వారా వస్తున్న ఊక పడుతోంది. మానేరు వాగు మొత్తం కరీంనగర్‌ నుంచి వస్తున్న మురుగునీటితో గరళంగా మారింది. మా అమ్మానాన్న సుశీల, రాజిరెడ్డి కేన్సర్‌ బారినపడి మరణించారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. 
– నల్ల శ్రావణ్, సదాశివపల్లి, మానకొండూర్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా 

రామగుండంలో వాయు నాణ్యత క్షీణించింది... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత 5 యూనిట్లుగా ఉండాలి. కానీ రామగుండంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా వాయు నాణ్యత క్షీణించి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 70 యూనిట్లుగా చూపిస్తోంది. దీనివల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. 
– ఉమామహేశ్వర్, పర్యావరణ కార్యకర్త, రామగుండం  

అత్యధిక ప్రభావిత జిల్లాలు
హనుమకొండ జిల్లా: రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ప్రతి లక్ష మందికి 79 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. 
⇒ హైదరాబాద్‌ జిల్లా: రాష్ట్ర రాజధానిలో ప్రతి లక్ష మందికి 72 కేసులు నమోదవుతూ తీవ్రతలో రెండో స్థానంలో ఉంది. 
⇒ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: కరీంనగర్‌లో ప్రతి లక్షకు 65, పెద్దపల్లిలో 63, రాజన్న సిరిసిల్లలో 63, జగిత్యాలలో 60 కేసులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 
⇒ మొత్తం బాధితుల సంఖ్యాపరంగా చూస్తే హైదరాబాద్‌ జిల్లాలోనే అత్యధికంగా 12,517 మంది చికిత్స పొందారు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో 6,372, మేడ్చల్‌ జిల్లాలో 5,483 కేసులు ఉన్నాయి.  
⇒ జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో కూడా ప్రతి లక్ష మందికి 55 నుంచి 59 కేసులు నమోదవుతూ కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్న జాబితాలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement