బేగంబజార్‌లోని ఓ దుకాణంలో అతికించిన నోటీస్
ఎండీఆర్ అమలు కాకముందే వెలిసిన బోర్డులు
నగదు లావాదేవీలకే మొగ్గుచూపుతున్న వర్తకులు
ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలన్న వర్తక సంఘాలు
దేశవ్యాప్తంగా తగ్గుతున్న యూపీఐ లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: ‘నో యూపీఐ. ఓన్లీ క్యాష్’.. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మా ర్కెట్లు, కిరాణా షాపుల ముందు కనిపిస్తున్న బోర్డులు ఇవి. ‘డిజిటల్ ఇండియా’ నినాదంతో ప్రతి గల్లీలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్స్‌తో వెలిగిపోయిన వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి మళ్లుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మర్చంట్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కార్చిచ్చు రగిల్చింది. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త చార్జీలు అమలు కాబోతుండగా.. గడువుకు ముందే వ్యాపార వర్గాలు తిరుగుబాటు బావుటా ఎ గురవేశాయి. ఫలితంగా కస్టమర్లను కేవలం నగదు రూపంలోనే చెల్లింపులు చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో యూపీఐ లావాదేవీలు దేశవ్యాప్తంగా తిరోగమన బాట పట్టాయి.
వ్యాపారులపై అదనపు భారం
తెలంగాణలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన బేగం బజార్‌తోపాటు హైదరాబాద్‌లో ప్రధాన మార్కెట్లయిన సుల్తాన్ బజార్, జనరల్ బజార్, అబిడ్స్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, కోఠిలో వ్యాపారులు ఇప్పటికే అధిక లావాదేవీలను నగదు రూపంలోనే సాగిస్తున్నారు. కంపెనీల మధ్య పోటీ, ఆన్‌లైన్ కారణంగా తమకు వచ్చే లాభాలు పరిమితమని, ఇప్పటికే వ్యాపారాలు తగ్గాయని వర్తకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండీఆర్ రూపంలో పడే చార్జీలు తమకు భారమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాలు ఎలా గడవాలని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. అందుకే రూ.2,000 దాటిన లావాదేవీలను నగదు రూపంలోనే జరుపుతున్నట్టు వెల్లడించారు. చార్జీల భారాన్ని స్వీకరించేందుకు కస్టమర్ ముందుకు వస్తే ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అంగీకరిస్తామని అంటున్నారు. ‘కస్టమర్లు చెల్లించే మొత్తాలను విభిన్న ఖాతాలకు మళ్లించడం ద్వారా ఎండీఆర్ నుంచి బయటపడొచ్చు. కానీ ఖాతాలను నిర్వహించడం తలకు మించిన భారం కాబట్టి సులువుగా నగదు వైపే మొగ్గు చూపుతాం’అని వర్తకులు చెబుతున్నారు. 
తగ్గిన లావాదేవీలు..
ఎండీఆర్ విధింపు ప్రకటనను సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా 80.24 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,01,136 కోట్లు. సెప్టెంబర్ 20న లావాదేవీల సంఖ్య 78.4 కోట్లకు పడిపోయింది. విలువ రూ.73,614 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్ 1–20 మధ్య విలువ పరంగా ఇదే కనిష్టం కావడం గమనార్హం. గరిష్టంగా ఈ నెల 2న 85.86 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అత్యధికంగా 1న రూ.1,31,787 కోట్ల విలువైన యూపీఐ చెల్లింపులు జరిగాయి. ఎండీఆర్ అమలులోకి రాకముందే దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నట్టు గణాంకాలనుబట్టి అర్థమవుతోంది. ఇక అమల్లోకి వచ్చాక యూపీఐ లావాదేవీలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారుల ఆందోళనలివీ...
⇒ ఈ–కామర్స్, క్విక్ కామర్స్, కంపెనీల మధ్య పోటీతో హోల్‌సేల్, రిటైల్ రంగంలో నికర లాభాల మార్జిన్ కేవలం 2–4 శాతం మాత్రమే. అందులో 0.4 శాతం బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో పోతే వ్యాపారాల మనుగడ కష్టమవుతుందని వర్తకులు చెబుతున్నారు.
⇒ ఈ చార్జీలను వినియోగదారుల నుంచి విడిగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన నిబంధన పెట్టింది. దీనివల్ల వ్యాపారులే ఈ నష్టాన్ని పూర్తిగా భరించాల్సి వస్తోంది.
⇒ డిజిటల్ పేమెంట్ల వల్ల సెకన్లలో ముగిసే లావాదేవీలు, నగదు లెక్కింపు, చిల్లర సమస్యల కారణంగా ఆలస్యమవుతాయి. మార్కెట్లలో రద్దీ పెరిగి, వ్యాపార వేగం మందగిస్తుంది.
మార్కెట్‌పై తీవ్ర ప్రభావం
⇒ వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్‌లను పక్కనపెట్టి కేవలం నగదు లావాదేవీలకే పరిమితమైతే దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
⇒ కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చిన కరెన్సీ నోట్ల చలామణి మళ్లీ విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు చిన్న, పెద్ద వస్తువుల కొనుగోళ్లకు కూడా జేబుల్లో డబ్బులు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది.
⇒ నగదు లావాదేవీలు ఎక్కువైతే రికార్డుల్లో చూపించని టర్నోవర్ పెరిగి, పరోక్షంగా నల్లధనం చలామణికి, పన్ను ఎగవేతలకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధరలు పెరుగుతాయి..
ఇతర వ్యాపారాల్లో అయితే వర్తకులు తమ లాభాలను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. కా>నీ మా విషయంలో అలా కాదు. పెట్రోల్ పంపులకు వచ్చే మార్జిన్‌ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎండీఆర్ కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేయలేకపోతోంది. ఒక్కో డీలర్‌కు ఎంతలేదన్నా ఎండీఆర్ రూపంలో నెలకు రూ.40వేల అదనపు భారం పడుతుంది. ఈ భారాన్ని డీలర్లపై మోపకుండా చమురు కంపెనీలు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి.
–మర్రి అమరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
వినియోగదారులపైనే భారం
ఎండీఆర్ చార్జీల భారాన్ని చివరకు వినియోగదారులే భరించాల్సి వస్తుంది. చిన్న వ్యాపారులు ఈ ఖర్చులను అనధికారికంగా కస్టమర్లపైనే నెట్టేయడమో లేదా నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపడమో చేస్తారు. పెద్ద రిటైల్ చైన్లు కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లు, ఉచితాలను తగ్గిస్తాయి. రూ.20వేల స్మార్ట్‌ఫోన్‌పై 18 శాతం జీఎస్టీ కలుపుకుని ధర రూ.23,600 అవుతుంది. కస్టమర్ యూపీఐ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లిస్తే వ్యాపారుల నుంచి 0.40 శాతం ఎండీఆర్ వసూలు చేస్తారు. అంటే ప్రభుత్వం విధించిన రూ.3,600 జీఎస్టీపైనా వ్యాపారులు చార్జీలు చెల్లించాలి. పన్నుపై పన్ను మేమెందుకు కట్టాలి? ఒకే రకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పటికీ ఇంధనం, గ్యాస్, బీమా, మొబైల్ రీచార్జి, రైల్వే టికెట్లపై మాత్రం తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు.
–కైలాశ్ లఖ్యానీ, వ్యవస్థాపక చైర్మన్, ఆలిండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్
గిడ్డంగుల నుంచే..
అద్దెలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదు. ఆన్‌లైన్ నుంచి తీవ్ర పోటీ ఉంది. వ్యాపారాలు ఇప్పటికే తగ్గిపోయాయి. దీంతో దుకాణాలను మూసివేసి గిడ్డంగుల నుంచే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాం. ఇప్పుడు ఎండీఆర్ రూపంలో ముప్పు పొంచి ఉంది.
–బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి
మార్జిన్లు తగ్గించుకోలేం..
రూ.2వేల లోపు యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తాం. అంతకుమించి అయితే క్యాష్ ఇవ్వాల్సిందే. ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తానంటే చార్జీలతోసహా కస్టమర్ ఇవ్వాల్సిందే. వ్యాపారాలు బాగా తగ్గిపోవడంతో మార్జిన్లు తగ్గించుకునే పరిస్థితుల్లో వ్యాపారులు లేరు.
–సుల్తాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యాపారి.


