రంగారెడ్డి జిల్లా, మహల్ ఏలికట్ట గ్రామంలో పిట్టల రాజు పొలంలోని చిన్న ఇంకుడు గుంత ఆయన జీవితాన్ని మార్చివేసింది. అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసే రాజు, ఇప్పుడు రెండు పంటల నుంచి నాలుగు పంటలు వేయగలుగుతున్నారు. ఆదాయం 20 శాతం పెరిగింది. వరి, టమాటా, మిరపతో పాటు ఇతర కూరగాయలను కూడా పండించగలుగుతున్నారు.
రాజు ఒక్కడే కాదు. ఏలికట్ట గ్రామంలో పిట్టల బాలయ్య (70), శేఖరయ్య లాంటి మరికొందరు రైతులు కూడా ఇలాంటి మార్పులను చవిచూస్తున్నారు. వీరి పొలాల్లో అమలు చేసిన భూగర్భ జలాల పునరుజ్జీవన ప్రాజెక్టులు, గ్రామ భవిష్యత్తును భద్రపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
నీటి కొరత ముందుగానే గుర్తించి చర్యలు
2024 చివర నుంచి 2025 ఆరంభం వరకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (UWH) ఆధ్వర్యంలో గ్రామవ్యాప్తంగా నిర్వహించిన భూగర్భ జలాల అధ్యయనంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. నీటి లభ్యత కాలానుగుణంగా మారిపోతోంది. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా నీరు లేదు.
“నీటి కొరత ఎల్లప్పుడూ ఒకేలా కనిపించదు. బోర్‌వెల్స్ ఇంకా పనిచేస్తూనే ఉండవచ్చు. కానీ, భూగర్భ జలాల లభ్యత కాలానుగుణంగా మారిపోతుందని, నమ్మశక్యం కానిదిగా, ఆధారపడలేని రీతిలో మారుతోందని డేటా వెల్లడించింది,” అని UWHలోని స్ట్రాటజీ అండ్ ఇంపాక్ట్ లీడ్ అదితి ఖండేకర్ అన్నారు.
మైక్రోసాఫ్ట్ మద్దతుతో నీటి భద్రత
మైక్రోసాఫ్ట్ ఇండియా సౌత్ సెంట్రల్ డేటాసెంటర్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చేపడుతున్న భూగర్భ జలాల పరిరక్షణ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది. నీటి కొరత స్పష్టంగా కనిపించకముందే దాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు అండగా నిలుస్తోంది.
2030 నాటికి ‘వాటర్ పాజిటివ్’గా మారే తన ప్రయాణంలో భాగంగా, ఆర్థిక సంవత్సరం 2025లో మైక్రోసాఫ్ట్ తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలలో వినియోగించుకున్న నీటి కంటే ఎక్కువ నీటిని మొదటిసారిగా తిరిగి నింపింది.
రైతుల అనుభవాలే ప్రచారం
మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ భాగస్వామి అయిన UWH, ఆరు నిర్మాణ వలయాలతో కూడిన ఇంకుడు గుంతలను ప్రతిపాదించినప్పుడు, రాజు మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించుకుని, అదనంగా మరో నాలుగు వలయాలను జోడించాడు. ఫలితంగా ఏర్పడిన ఈ 10 అడుగుల నిర్మాణం, వర్షాకాలంలో వర్షపు నీటిని నిల్వ చేసి, అది భూగర్భంలోకి ఇంకిపోయేలా చేస్తుంది.
బాలయ్య వంటి రైతులు ఈ ప్రయత్నాలను ముందుగా స్వీకరించారు. 70 ఏళ్ల వయసు కలిగిన బాలయ్య, తన ఎకరానికి పైగా భూమిలో వరి, మొక్కజొన్న పండిస్తారు. “గ్రామంలో పెద్దవాడిగా, యువ రైతులు నా మాట వింటారు,” అని ఆయన చెప్పారు. ఆయన నిర్ణయం ఇతరులకు ప్రయత్నించేందుకు విశ్వాసాన్ని ఇచ్చింది.
ఫలితాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతం, ఏలికట్టలో ఈ కార్యక్రమం మొదటి దశలో భాగంగా 16 బోర్ ఛార్జర్‌లను, 10 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. జూన్ 2026 నాటికి ఈ చర్యల వల్ల ఏలికట్ట అంతటా సుమారు ఐదు మిలియన్ లీటర్ల భూగర్భ జలాల రీఛార్జ్ సామర్థ్యం పెరిగిందని UWH అంచనా వేస్తోంది.
ఏలికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ నరసింహ, రీఛార్జ్ నిర్మాణాలను ‘చాలా ఉపయోగకరమైన కార్యక్రమం’ గా అభివర్ణించారు. కొన్ని బోర్‌వెల్స్‌లో నీటిమట్టాలు పెరగడం గమనించామని కూడా పేర్కొన్నారు.
“తుది అంచనా ఇంకా చేపట్టలేదు, దీనిని 2027లో రుతుపవనాలకు ముందు కాలంలో నిర్వహించాలని యోచిస్తున్నాము,” అని ఖండేకర్ అన్నారు. “భూగర్భ జలాలు అనేవి ఒక ఉమ్మడి వనరు, సమాజ భాగస్వామ్యం మొదటి నుంచే దానిపై యాజమాన్య భావాన్ని సృష్టిస్తుంది. స్థానిక నీటి సంరక్షణ, శాస్త్రీయ పద్దతులలో నీటి నిర్వహణతో భవిష్యత్ తరాలకు భరోసా కల్పించవచ్చని చూపించేలా, ఏలికట్టను మరిన్ని ప్రాంతాల్లోనూ అమలు చేయగల నీటి భద్రత కలిగిన గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం,” అని ఆమె తెలిపారు.
రాజు వంటి రైతులకు ఆ ఆశయాలు చాలా సరళమైన అంశాల ద్వారా కొలవబడతాయి; అంటే, మరో పంట కాలానికి సరిపడా నీరు భూగర్భంలో ఉందా లేదా అనేదే వారి ప్రధాన కొలమానం. ఒక పొలంలో కనిపించిన ఫలితం... మరో రైతు కూడా ముందడుగు వేయడానికి కారణమవుతుంది. మార్పు ఎలా మొదలవుతుందో అది చూపిస్తుంది.


