సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 257వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 119 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 37, బీసీ సంక్షేమ శాఖకు 21, హోం శాఖకు 14, ఇతర శాఖలకు 47 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.సీఎం ప్రజావాణి పనితీరును పరిశీలించేందుకు బీహార్ రాష్ట్రానికి చెందిన శిక్షణ పొందుతున్న ట్రైన్ కలెక్టర్స్ మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను సందర్శించారు.
ప్రజల నుంచి సీఎం ప్రజావాణిలో దరఖాస్తులను తీసుకోవడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాఖల వారి డెస్క్ లను డిప్యూటీ కలెక్టర్స్ స్వయంగా చూశారు. సీఎం ప్రజావాణికి వచ్చే ప్రజలకు దరఖాస్తులను రాసి ఇచ్చేందుకు ప్రత్యేక డెస్క్ ఉండడం, అత్యవసర ఆరోగ్య సమస్యలు ఏర్పడితే ప్రాథమిక చికిత్స అందించేందుకు హెల్త్ డెస్క్ ఉండడం, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను బీహార్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్స్ గమనించారు.
సీఎం ప్రజావాణి పనితీరు అద్భుతంగా ఉందని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలు బాగుందని, తమ రాష్ట్రంలోనూ ఇదే తరహా పద్ధతులు అవలంబించేందుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా డిప్యూటీ కలెక్టర్లు పేర్కొన్నారు.
కాగా ఎనిమిది ఏళ్ల క్రితం 2018 లో ఒమన్ దేశంలోని మస్కట్ కు వెళ్లిన ఒక గల్ఫ్ కార్మికుడు కొందరి తప్పుడు సలహాలతో సరిహద్దులు దాటి యూఏఈ దేశంలోని దుబాయికి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో మస్కట్ నుంచి దుబాయిలోకి అక్రమంగా చొరబడ్డాడని.. జగిత్యాల జిల్లా బీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఏగుర్ల మల్లేశం అనే గల్ఫ్ కార్మికుడిని మార్చి 8న దుబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సంబంధింత బాధితుడి కుటుంబం గద్వాల విజయలక్ష‍్మీని కలిశారు.
దుబాయి లోని ఇండియన్ కాన్సులేట్ ద్వారా ఒక న్యాయవాదిని నియమించి మల్లేశంను జైలు నుంచి విడిపించి, స్వదేశానికి రప్పించాలని అతని భార్య లత విజ్ఞప్తి చేశారు. దీంతో వారి గోడు విన్న విజయలక్ష్మి వారి సమస్యను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.


