జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులురెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్షణ కల్పించాల్సిన పోలీసుల తీరు ఇలా ఉంటే.. సామాన్య మహిళలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు ఎలా సాహసిస్తారు?‘అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ మాజీ సీఐ యు.శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణ ముగిసే వరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తునకు ఆయన పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, బాధితురాలికి (రెండో ప్రతివాది) నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
కుటుంబ వివాదాల నేపథ్యంలో 2021లో తనను ఆశ్రయించిన ఓ వివాహితను అప్పటి జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి నమ్మించి లోబరుచుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఆమెను బెదిరించి లైంగికంగా వేధించడంతోపాటు రూ.1.80 కోట్లు వసూలు చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతికంగా దాడి చేయడమే కాకుండా, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. స్థానికంగా కేసు నమోదు కాకపోవడంతో ఆమె డీజీపీని ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
లైంగిక దాడి జరగలేదు: సీఐ తరఫు న్యాయవాది
శ్రీనివాసులు రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఇదొక ఆర్థిక లావాదేవీల వివాదమని, బాధితురాలు ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి లైంగిక దాడి జరగలేదని విన్నవించారు. ఐదేళ్లుగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని, పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ కలిసి పర్యటనలకు వెళ్లారని తెలిపారు. బాధితురాలి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీఐ తన హోదాను అడ్డుపెట్టుకుని ఆ మహిళను తీవ్రంగా వేధించాడని, ఇది పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారం కాదని స్పష్టం చేశారు. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


