1986 నాటి సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకోవాలి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
టి.ఎం.కృష్ణ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచన
లౌకికవాదం సంకుచితంగా ఉండకూడదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
చట్టాల రూపకల్పన రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని వెల్లడి
నక్సలైట్ల ఆలోచనలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన ఉండకూడదని స్పష్టికరణ
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది మురళీధర్‌రావు
సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: వందేమాతరం పాడడానికి నిరాకరించినందుకు శిక్షించకూడదని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘మనఃసాక్షి కారణాల’వల్ల జాతీయ గీతం పాడడానికి నిరాకరించిన పిల్లలకు రక్షణ కల్పించిన 1986 నాటి తీర్పును దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. మతపరమైన కారణాలతో జాతీయ గీతం పాడేందుకు నిరాకరించే వ్యక్తులకు క్రిమినల్ శిక్షలు విధించరాదని మౌఖికంగా తేల్చిచెప్పింది. జాతీయ గీతం ఏది? దాని చరణాలు ఎన్ని? వంటి అంశాలను నిర్ణయించడం కోర్టు పరిధిలో లేదని తెలిపింది. ప్రజల మనఃసాక్షికి సంబంధించిన అభ్యంతరాలను, ముఖ్యంగా మత విశ్వాసాల కారణంగా గీతాన్ని పాడలేని వ్యక్తుల హక్కులను పరిశీలిస్తామని పేర్కొంది.
వందేమాతరం పూర్తి గీతాన్ని పాడడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ దాఖలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 1971 నాటి ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టూ నేషనల్ హానర్ యాక్ట్’కు 2026లో చేసిన సవరణను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్’ తీర్పును పాటించాలి
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 1986లో ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మనఃస్సాక్షి కారణాలతో జాతీయ గీతాన్ని పాడని విద్యార్థుల హక్కులను రక్షించడాన్ని గుర్తుచేసింది. అదే సూత్రం ప్రస్తుత వ్యవహారంలోనూ వర్తిస్తుందని పేర్కొంది. మతపరమైన కారణాలతో వందేమాతరాన్ని పాడని వ్యక్తిపై క్రిమినల్ చర్యలు ఉండకూడదని వెల్లడించింది. ‘జాతీయ గీతం ఏది? ఎన్ని చరణాలు ఉండాలి? అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలియజేసింది. తమ హక్కులకు విఘాతం కలుగుతోందని భావించే వ్యక్తి లేదా మనఃసాక్షి కారణంగా జాతీయ గీతం పాడేందుకు నిరాకరించే వారిని శిక్షించకూడదని స్పష్టంచేసింది. 1986 నాటి తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
చివరి నాలుగు చరణాలపైనే అభ్యంతరం
కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రధానంగా వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చరణాల్లో దుర్గ, లక్షి్మ, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావనలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అలాంటి చరణాలను పౌరులు తప్పనిసరిగా పాడేలా చేయడం అంటే ఒక నిర్దిష్ట మతపరమైన లేదా భావజాలపరమైన విశ్వాసాన్ని వ్యక్తం చేయాల్సిందిగా బలవంతం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రానికి విరుద్ధమని పేర్కొన్నారు.
‘నేషనల్ సాంగ్’ అంటే ఏమిటో చట్టంలో స్పష్టత లేదు
‘‘2026 నాటి సవరణ చట్టంలో ‘నేషనల్ సాంగ్’అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదు. దీనివల్ల చట్టాన్ని దుర్వీనియోగం చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్ర హోంశాఖ జారీ చేసిన మెమోరాండం గెజిట్‌లో ప్రచురించలేదు’’అని పిటిషనర్ కృష్ణ తరపు న్యాయవాది డాక్టర్ ఎస్.మురళీధర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వందేమాతరం విషయంలో ఇంతకాలం రెండు చరణాలకే ఉన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఒక్కసారిగా ఆరు చరణాలకు మార్చిందని వాదించారు. దీనిపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించకుండా సవరణను తొందరగా తీసుకొచ్చారని పేర్కొన్నారు.
‘డిస్టర్బెన్స్’అనే పదం అస్పష్టం
2026 జనవరి 28, జూలై 9 తేదీల్లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను కూడా కృష్ణ సవాలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను అధికారిక వెర్షన్‌గా పేర్కొని, ప్రభుత్వ, అధికారిక, సాంస్కృతిక, వేడుకల్లో సామూహికంగా ఆలపించేందుకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలకు 2026 సవరణ చట్టంలోని శిక్షా నిబంధనలను కలిపి చూస్తే.. ఆరు చరణాలను పాడటం తప్పనిసరి చేసినట్లవుతుందని కృష్ణ వాదించారు. సవరించిన చట్టంలోని డిస్టర్బెన్స్ (అంతరాయం) అనే పదం స్పష్టత లేకుండా ఉందని కృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
నక్సలైట్ల ఆలోచనల ప్రకారం కాదు
అమెరికా జాతీయ గీతంలో ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’వంటి పదాలు ఉన్నాయని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ప్రస్తావించారు. అమెరికాను సానుకూల లౌకికవాదానికి ఉదాహరణగా పేర్కొంటారని గుర్తుచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను వ్యతిరేకించారు. ‘‘లౌకికవాదం ఇంత సంకుచితంగా ఉండకూడదు. చట్టాల రూపకల్పన అనేది రా జ్యాంగం ప్రకారమే జరుగుతుంది. నక్సలైట్ల ఆలోచనలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన ఉండకూడదు’’అని వ్యాఖ్యానించారు.
తుషార్ మెహతా వ్యాఖ్యలతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది. మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని తుషార్ మెహతాను కోరారు. ప్రభుత్వ న్యాయాధికారి అలా మాట్లాడడం సరైంది కాదన్నారు. అయితే, సొలిసిటర్ జనరల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. చట్టాన్ని గౌరవించని వారి గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పినదాన్నే మళ్లీ చెప్పగలను. ఎవరైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలి. నేను అన్నదానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అది రాజ్యాంగబద్ధమైన మార్గమని చెప్పాను.
నక్సలైట్లు కోరుకునేది కాదని చెప్పాను. అందుకు నాకు ఎలాంటి విచారం లేదు’’అని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకున్నారు. ‘‘మనం రాజ్యాంగ వ్యాఖ్యానికి సంబంధించిన న్యాయపరమైన అంశానికే పరిమితం అవుదాం’’అని సూచించారు. ఆ తర్వాత కూడా మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘‘ఆ వ్యాఖ్య లను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాజ్యాంగ అంశానికే పరిమితం అవుతున్నాం’’అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు.


