సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని అన్ని చరణాలు తప్పనిసరిగా పాడాలనే నిబంధనపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అన్ని చరణాలు పాడని వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
వందేమాతరం గీతంలోని ఆరు చరణాల ఆలాపనను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
వ్యక్తిగత నిర్ణయమే..
వందేమాతరంలో ఎన్ని చరణాలు పాడాలనేది పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది. అన్ని చరణాలు ఆలపించని వారిపై క్రిమినల్ కేసులు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం తగదని తేల్చిచెప్పింది.
ఈ అంశానికి సంబంధించి వందేమాతరం సవరణ చట్టం, అలాగే దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాతపూర్వక సమాధానం సమర్పించడానికి కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది.


