దానం అనర్హత పిటిషన్‌పై.... రేపు సుప్రీంలో విచారణ | Supreme Court To Hear Danam Nagender's Disqualification Petition On September 23 | Sakshi
Sakshi News home page

దానం అనర్హత పిటిషన్‌పై.... రేపు సుప్రీంలో విచారణ

Sep 22 2026 2:25 AM | Updated on Sep 22 2026 2:25 AM

Supreme Court To Hear Danam Nagender's Disqualification Petition On September 23

అత్యవసరంగా మంగళవారం విచారించాలని కోరిన దానం తరఫు న్యాయవాది 

ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని వాదన 

బుధవారం విచారణ చేపట్టాలన్న ప్రతివాదుల న్యాయవాది  

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్‌ చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలన్న దానం తరఫు న్యాయవాది విజ్ఞప్తి, విచారణను బుధవారం చేపట్టాలన్న ప్రతివాదుల అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం దానం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ఈ వ్యవహారాన్ని ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. 

సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని, వాస్తవానికి స్పీకర్‌ ఆ పిటిషన్‌ను ముందే తిరస్కరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ తరఫున కాకుండా వేరొకరి ఫిర్యాదు మేరకు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని, కాబట్టి మంగళవారమే ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే, ప్రతివాదుల తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ విచారణను మంగళవారం కాకుండా బుధవారం చేపట్టాలని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణ బుధవారం చేపడతామని స్పష్టం చేసింది.  

కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లా? 
హైకోర్టు తీర్పుపై శనివారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదన్నది ఆయన ప్రధాన వాదన. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందులో ఆర్టీకల్‌ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అప్పీలులో పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకోలేదని, కాంగ్రెస్‌ సభ్యత్వం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం మెడలో మూడు రంగుల కండువా వేసుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌లో చేరినట్లు కాదన్నారు. దానం పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరుతూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement