4 గంటలు కరెంటు కోత! | Pressure on grid due to a massive surge in electricity demand | Sakshi
Sakshi News home page

4 గంటలు కరెంటు కోత!

Sep 22 2026 1:41 AM | Updated on Sep 22 2026 1:41 AM

Pressure on grid due to a massive surge in electricity demand

జిల్లా అధికారులకు అనధికారిక ఉత్తర్వులు

విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరగడంతో గ్రిడ్‌పై ఒత్తిడి 

లోడ్‌కు తగ్గట్టుగా లైన్లు లేని పరిస్థితి 

జల విద్యుత్‌ నిల్‌.. థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత 

బహిరంగ మార్కెట్‌లో దొరకని కరెంటు 

సాంకేతిక కారణాల పేరుతో కోతలకు ఆదేశాలు! 

వేసవి తరహా వాతావరణంతో ఉక్కపోత

పంటలు ఎండిపోతుండటంతో రైతుల గుండెకోత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తీవ్రమవుతోంది. రోజుకు కనీసం 4 గంటల పాటు విద్యుత్‌ కోత అనివార్యమైన పరిస్థితి నెలకొంది. ఈ దిశగా ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. దీంతో అధికారులు పలు సాంకేతిక కారణాలు చెబుతూ అనధికారిక విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా పలుజిల్లాల్లో విద్యుత్‌ కోతలు జరుగుతున్నట్టు సమాచారం. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్‌ .. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయంపై ప్రజలు మండిపడుతుండటం కోతలను ధ్రువీకరిస్తుంది. అనేక చోట్ల రైతులు సైతం ఆందోళనలకు దిగుతున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుకెక్కారు. ఒకవైపు వర్షాలు, చలి లేక వేసవిని తలపిస్తున్న వాతావరణం. ఇళ్లలో ఉక్కపోత..పొలాల్లో ఎండిపోతున్న పంటలు.. తాగునీటికీ కటకట. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు ‘మూలిగే నక్కపై తాటిపండు..’అన్న చందంగా మారాయి. 

గ్రిడ్‌కు కష్టమే.. 
రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. వాస్తవానికి ఈ సీజన్‌లో గరిష్టంగా 10 నుంచి 12 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరం. కానీ రెండేళ్ళుగా విద్యుత్‌ వాడకం ఈ లెక్క దాటిపోతోంది. గత ఏడాది 15 వేల మెగావాట్లకు వెళ్తే.. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఏకంగా 18,500 మెగావాట్లు దాటింది. బంగాళాఖాతంలో వాయుగుండం, ఇతరత్రా పరిస్థితుల్లో ఉక్కపోత కాస్త తగ్గడంతో సోమవారం ఇది 15,464 మెగావాట్లుగా నమోదైంది. వాయుగుండం ప్రభావం తగ్గితే మళ్ళీ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే గ్రిడ్‌ తట్టుకోవడం కష్టమని అధికారులు అంటున్నారు. విద్యుత్‌లోడ్‌కు తగ్గట్టుగా లైన్లు వేసుకోవడంలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం దీనికి కారణంగా పేర్కొంటున్నారు.  

డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ ఎలా? 
ఈ పరిస్థితి ఇలా ఉంటే.. పెరిగే డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సరఫరా చేసే పరిస్థితి కన్పించడం లేదు. రోజుకు దాదాపు 305 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటే వీలుందని అధికారులు అంటున్నారు. అయితే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల్లో నీళ్ళ లేవు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. మిగిలింది కేవలం థర్మల్‌ విద్యుత్‌ మాత్రమే. 6,300 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రధాన థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు నడిస్తేనే కనీసం 200 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యం. దీనికి తోడు సోలార్‌ పీపీఏలు, కేంద్ర నుంచి అందే విద్యుత్‌ కలిపితే గరిష్ట డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ అందుతుంది. కానీ రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత సమస్యగా మారింది. ఇంకోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు సైతం కష్టంగా ఉందని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ప్రభుత్వానికి తెలిపింది. పగటిపూట సోలార్‌ విద్యుత్‌ లభించినా, సాయంత్రానికి అదీ తగ్గిపోతోంది. దీంతో సాయంత్రం 6 నుంచి 12 గంటల మధ్య విద్యుత్‌ పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనధికార కోతలకు ఆదేశాలు వెళ్ళినట్టు సమాచారం. 

బొగ్గు ఇవ్వండి ..ఇప్పుడు అడిగితే ఎలా? 
రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 80 నుంచి లక్ష టన్నుల బొగ్గు అవసరం. ప్రతి ప్లాంట్‌లోనూ కనీసం మూడు వారాలకు సరిపడా బొగ్గు నిల్వ ఉండాలి. కానీ ఎక్కడా ఈ పరిస్థితి కన్పించడం లేదు. బీటీపీఎస్‌లో కేవలం 7 రోజులకు, కేటీపీఎస్‌లో ఆరు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. అత్యంత కీలకమైన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కేవలం 4 రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు సింగరేణికి బకాయిలు చెల్లించని కారణంగా బొగ్గు సరఫరాలో ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమకు మహానది కోల్‌ బ్లాక్‌ నుంచి బొగ్గు ఇవ్వమని తెలంగాణా జెన్‌కో ఇప్పటికే మూడుసార్లు లేఖలు రాసింది. అయితే ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే కావడంతో, అన్నిచోట్లా బొగ్గు డిమాండ్‌ ఉన్నప్పుడు ఇవ్వడం ఎలా సాధ్యమని మహానది కోల్‌ బ్లాక్‌ నుంచి సమాధానం వస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నా ఇంతవరకు స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కోతలు తప్ప మరోమార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

అడిగితే సాంకేతిక కారణాలు చెప్పాలి 
అనధికార కోతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు పగలు, రాత్రి ఏదో ఒక సమయంలో 4 గంటల పాటు కోత పెట్టమని ఆదేశించినట్టు తెలిసింది. గృహ విద్యుత్‌ వినియోగదారులకు మాత్రం పీక్‌ అవర్స్‌లో కోత పెట్టాలనే ఆదేశాలు వెళ్ళాయి. ప్రజలు ఫోన్లు చేసినా, సబ్‌ స్టేషన్లకు వచ్చినా లైన్లు బ్రేక్‌ అయ్యాయని, లేదా 220 కేవీ (ట్రాన్స్‌కో) లైన్లు బ్రేక్‌ డౌన్‌ అయ్యాయని, కొంత సమయం పడుతుందనే సమాధానాలు చెప్పాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. హెవీ లోడ్‌ను రాష్ట్ర గ్రిడ్‌ తట్టుకునే పరిస్థితి లేదనేది వాస్తవమేనని అధికారులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగా లైన్లు వేయాలని రెండేళ్ళుగా ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం స్పందించలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.  

సాంకేతిక సమస్యలు వస్తేనే కోతలు 
విద్యుత్‌ కోతలు ఎక్కడా అమలు చేయడం లేదు. స్థానికంగా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు కొన్ని గంటలు విద్యుత్‌ నిలిపివేయడం సహజం. ఎక్కడైనా కోత విధిస్తున్నారని చెబితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 
– నవీన్‌ మిత్తల్‌ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) 

ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియదు 
పత్తి, వరికి రోజూ నీళ్ళు ఇవ్వాలి. బోరు ఉందని పంటలను వేస్తే కరెంట్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో విద్యుత్‌ కోతలతో ప్రస్తుతం పంటలు ఎండిపోయే పరిస్థితి కని్పస్తోంది. రైతుల బాధను గుర్తించి కరెంట్‌ కోతలు లేకుండా చూడాలి.  
– చల్లా నాగరాజు (రైతు, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం) 

వరికి అందని నీళ్లు 
నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి అనే రైతు పది ఎకరాల్లో వరి సాగు చేశాడు. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే రోజుకు కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే కరెంటు ఉంటుండటంతో పంటకు తగిన స్థాయిలో నీళ్లు అందడం లేదు. దీంతో ఇప్పటికే 8 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, రూ.3 లక్షల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి తలెత్తిందని రాజేశ్వర్‌రెడ్డి వాపోతున్నాడు. 

ఇళ్లకు కోతలు తగ్గించాలి 
వేళా పాళా లేకుండా కరెంటు పోతోంది. రాత్రివేళ కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నాం. దోమల బెడదతో నిద్ర కరువవుతోంది. విద్యుత్‌ కోతలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 
– ఇమ్మడి రాధమ్మ, కేసిరెడ్డిపల్లి, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా 

జనరేటర్‌తో పంటకు ప్రాణం.. రైతుకు భారం! 
ఎండిపోయిన వరి పొలాన్ని చూపిస్తున్న ఈ రైతు పేరు గుగులోత్‌ నాగు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం యల్లప్పకుంట తండాకు చెందిన ఈయన గాజుల మొల్కాపురం గ్రామానికి చెందిన రైతు వద్ద పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వర్షాభావంతో పాటు కాలువ నీరు అందక, కరెంటు కోతలతో ఇప్పటికే ఎనిమిది ఎకరాల్లోని పంట పూర్తిగా ఎండిపోయింది. మిగిలిన రెండు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలని నాగు నానాఅవస్థలు పడుతున్నాడు. విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవడంతో కిరాయికి జనరేటర్‌ తీసుకొచ్చి పంటకు నీరందిస్తున్నాడు. జనరేటర్‌ అద్దె కింద రోజుకు రూ.1,000, డీజిల్‌కు మరో రూ.2,000 వెచ్చిస్తున్నానని.. ఇంతచేసినా మరో రెండు నెలలు గడిస్తే కానీ పంట చేతికొచ్చే పరిస్థితి లేదని, అప్పటివరకు ఇంత ఖర్చు ఎలా భరించాలని వాపోతున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement