తల్లులారా... ఎంత కష్టం! | Biometric issues faced by the mentally challenged | Sakshi
Sakshi News home page

తల్లులారా... ఎంత కష్టం!

Sep 22 2026 2:00 AM | Updated on Sep 22 2026 2:00 AM

Biometric issues faced by the mentally challenged

ఆగిన పింఛన్‌ కోసం పేగుబంధం తపన 

మానసిక వికలాంగులైన పిల్లల్ని భుజాలపై మోస్తూ బల్దియాకు.. 

బయో మెట్రిక్‌లో వివరాలు అప్‌డేట్‌ కాకపోవడంతో సమస్య

కోల్‌ సిటీ: ఓ తల్లి నడవలేని తన కూతుర్ని భుజాలపై ఎత్తుకుని పరుగులు పెట్టింది. మరోతల్లి.. తన 29 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకుని వచ్చింది. ఇద్దరు బిడ్డలూ మానసిక వికలాంగులే. ఒకరికి 3 నెలలుగా, మరొకరికి 2 నెలలుగా పింఛన్లు నిలిచిపోయాయి. ఇలాగే కొనసాగితే తమ బిడ్డల అవసరాలు ఎలా తీరతాయోనని ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పిల్లల వివరాలు అప్‌డేట్‌ చేయించాలన్న ఆత్రుతతో నడవలేని బిడ్డలను భుజాలపై మోసుకుంటూనే బల్దియా మెట్లు ఎక్కారు. అక్కడి గణేశ్‌ మండపం వద్ద అన్నప్రసాదం వితరణ చేయగా.. పసిపిల్లల్లా వారికి తల్లులు గోరుముద్దలు తినిపించడం అందరినీ కదిలించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం వారిని ‘సాక్షి’పలుకరించింది. 

పింఛన్‌ ఆగిందని.. 
రామగుండంలోని ఎన్టీపీసీ మేడిపల్లి నివాసి 19 ఏళ్ల యేల్లూరి శ్రీహర్షితకు 3 నెలలుగా దివ్యాంగుల పింఛన్‌ రావడంలేదు. బయోమెట్రిక్‌లో పింఛన్‌ వివరాలు అప్‌డేట్‌ కాకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. తుంటిలోని బాల్‌ తొలగడంతో శ్రీహర్షితకు ఆపరేషన్‌ జరిగింది. నడవలేసి స్థితిలోఉంది. ఆ బిడ్డను భుజాలపై మోసుకుంటూ తల్లి కవిత హైదరాబాద్‌ నుంచి రైల్లో ఆమెను తీసుకొచ్చింది. అక్కడి నుంచి తీసుకురావడం ఒక ఎత్తయితే.. రామగుండం బల్దియాకు తీసుకెళ్లడం మరోఎత్తుగా మారింది. అయినా తల్లి వెనుకడుగు వేయలేదు. 

ఇక గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల బిల్లుకంటి విన్ను కూడా మానసిక వికలాంగుడు. రెండు నెలలుగా పింఛన్‌ రావడంలేదు. తల్లి స్వరూప కుమారుడిని వెంటబెట్టుకుని బల్దియాకు చేరుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందికి బయోమెట్రిక్‌ లాగిన్‌ లేక మరోఇబ్బంది ఎదురైంది. ఏం చేయాలో అర్థంకాక సుమారు రెండు గంటలపాటు అక్కడే నిరీక్షించింది. చివరకు మరోవార్డు ఆఫీసర్‌ లాగిన్‌ ద్వారా బయోమెట్రిక్‌ నమోదు చేసి అప్‌లోడ్‌ చేశారు.

ఇలా బయోమెట్రిక్‌ ప్రక్రియలో ఆలస్యం కావడంతో.. ఇద్దరు తల్లులూ బల్దియాలోని గణేశ్‌ మండపం ఎదుట చేపట్టిన అన్నవితరణ కోసం క్యూలో నిల్చొని తమ బిడ్డల ఆకలి తీర్చారు. అయితే కవిత పరుగు అంతటితో ఆగలేదు. శ్రీహర్షితను మళ్లీ హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. రైలు సమయం దగ్గరపడుతోంది. దీంతో కూతురిని మళ్లీ భుజాలపై ఎత్తుకుంది. ఆటో కోసం రోడ్డుపై పరుగులు తీస్తున్న ఆమెను చూసి తల్లి ప్రేమ అంటే ఇదే కదా..అంటూ సానుభూతిని వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement