చూస్తే నోరూరే.. తింటే బేజారే! | - | Sakshi
Sakshi News home page

చూస్తే నోరూరే.. తింటే బేజారే!

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

● హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు ● కిచెన్లలో అపరిశుభ్రత తాండవం ● మరిగించిన నూనెతో వంటకాలు ● జరిమానా విధిస్తున్నా మారని తీరు

సాక్షి, పెద్దపల్లి:

ఘుమఘుమలాడే సువాసన.. ఆకట్టుకునే రంగులు.. నోరూరించే రుచి.. తక్కువ ధర. ఆహారాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు పోటీపడుతున్నాయి. కానీ దానివెనుక పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నాసిరకం ముడిసరుకులు, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల తయారీ, పదేపదే వేడిచేసిన నూనె వినియోగంతో వాటిని తి ని ప్రజలు అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఆహార భద్రత అధికారులు జిల్లాలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 127 తనిఖీలు చేసి 45 నమూనాలను సేకరించారు. వాటిలో 16 నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేల్చారు. బాధ్యులపై రూ.3 లక్షల వరకు జరిమానా కూడా విధించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పాలు, పెరుగు, వంటనూనె, బాదం మిల్క్‌ తదితరాల్లో నిబంధనల ఉల్లంఘనలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కిచెన్‌లోనే అసలు కథ..

వినియోగదారులకు కనిపించేది హోటల్‌ ముందు భాగమే. వంటగదిలో పరిశుభ్రత పాటించడంలేదు. ముడి పదార్థాలను సరిగా నిల్వ చేయడంలేదు. నాసి రకం మసాలాలు వినియోగిస్తున్నారు. ఇలాంటి లో పాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీ, కర్రీ పాయింట్లలో ఉపయోగించే మసాలా లు, వంటనూనెల నాణ్యతపై నిర్వాహకులు అలస త్వం ప్రదర్శిస్తున్నారు. తక్కువ ధరకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో నాణ్యత విస్మరించడం వినికస్టమర్ల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది.

నల్లగా మారినా..

జిల్లాలోని కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదేపదే వేడిచేసి వినియోగిస్తున్నట్లు ఆహార భద్రత అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా నూనె లో రసాయన మార్పులు చోటుచేసుకుని నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

జరిమానాలకే పరిమితం

జిల్లాలో మూడు నెలల్లో అధికారులు 127 తనిఖీలు చేసి 45 నమూనాలు సేకరించారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, పాల విక్రయ కేంద్రాల సంఖ్యతో పోలిస్తే ఈ తనిఖీల పరిధి ఇంకా విస్తరించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత కూడా పర్యవేక్షణకు ఇబ్బందిగా మారుతోంది. జిల్లాలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నెలకు కనీసం 10 నమూనాలు సేకరించాలి. నమూనాలను పరీక్ష కోసం హైదరాబాద్‌ పంపించాలి. సురక్షితం కానీ ఆహారమని నిర్ధారిస్తే యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి, లేదా నోటీసులు ఇచ్చి జరిమానా విధించాలి. తప్పు సరిదిద్దుకున్నారా? లేదా అని పదిరోజుల్లో మరోసారి తనిఖీ చేయాలి. సిబ్బంది కొరతతో తనిఖీలు నామమాత్రమే అవుతున్నాయనే విమర్శలున్నాయి.

గోదావరిఖనిలో ఓ చిప్స్‌ తయారీ యూనిట్‌లో అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. పదేపదే వినియోగిస్తున్న వంటనూనె గుర్తించారు. నాణ్యత పరీక్షించగా, నిర్దేశిత ప్రమాణాల కన్నా రీడింగ్‌ అధికంగా సూచించడంతో 25కిలోలు స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల సమాచారం

మొత్తం తనిఖీలు 127

సేకరించిన శాంపిళ్లు 45

ఫెయిలైనవి 16

జరిమానా(రూ.లక్షల్లో) 3

ఇది కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌. ఇరుకు గదిలోనే ఆహార పదార్థాల తయారీ, ప్లేట్లు, వంట సామగ్రి శుభ్రం చేస్తున్నా రు. ఇందులోనే ఉల్లిగడ్డలు, కూరగాయల వ్య ర్థాలు, కోడిగుడ్డు పెంకులు పడివున్నాయి. దో మలు, ఈగలూ స్వైరవిహారం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement