డిజిటల్ లావాదేవీలకు ఆదరణ పెరుగుతున్న వేళ పెట్రోల్ బంకుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 16 నుంచి రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల పెట్రోల్ పంప్ డీలర్ల సంఘాలు ప్రకటన చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) భారాన్ని మోయడం తమ వల్ల కాదని డీలర్లు స్పష్టం చేశారు.
లాభాల స్వల్పతేడానే కారణం
మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ కథనం ప్రకారం.. ఇంధన విక్రయాలపై డీలర్లకు లభించే నికర లాభం (ప్రాఫిట్ మార్జిన్) కేవలం 0.5 శాతం మాత్రమే. ఇటువంటి తక్కువ మార్జిన్‌పై 0.4 శాతం ఎండీఆర్ చార్జీ విధిస్తే వ్యాపారం మరింత నష్టాల్లోకి జారుకుంటుంది. సగటున ఒక్కో పెట్రోల్ పంప్‌లో రోజుకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలు చేసే కస్టమర్లు సుమారు 100 మంది వరకు ఉంటారని, దీనివల్ల రోజుకు రూ.590 చొప్పున నెలకు సుమారు రూ.17,700 వరకు డీలర్ నష్టపోవాల్సి వస్తుందని గణాంకాలతో వివరించారు.
కార్డు చెల్లింపులకు మినహాయింపు
రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు నిలిపివేసినప్పటికీ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఎలాంటి పరిమితి లేకుండా కొనసాగుతాయని అసోసియేషన్ స్పష్టం చేసింది. గతంలో కార్డు లావాదేవీలకు ఎండీఆర్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చినట్లే ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని యూపీఐ లావాదేవీలకు కూడా పూర్తి చార్జీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీలర్లు విజ్ఞప్తి చేశారు.
వినియోగదారులపై ప్రభావం
పంజాబ్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపింది. ప్రభుత్వం లేదా ఆయిల్ కంపెనీలు ఎండీఆర్ భారాన్ని ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 16 నుంచి డిజిటల్ కస్టమర్లు బంకుల్లో రూ.2,000 దాటితే కార్డులు లేదా నగదు చెల్లింపులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే..


