యూపీఐ ఛార్జీలను ఆపండి | Google Pay PhonePe Users UPI Charges Pause demand for Free Services Extended | Sakshi
Sakshi News home page

యూపీఐ ఛార్జీలను ఆపండి

Sep 22 2026 9:10 AM | Updated on Sep 22 2026 9:12 AM

Google Pay PhonePe Users UPI Charges Pause demand for Free Services Extended

యూపీఐని ప్రజా ప్రయోజన వ్యవస్థగా పరిగణించాలి

మర్చంట్‌ ఛార్జీలు విధిస్తే మళ్లీ ‘క్యాష్‌’ వైపు మళ్లే ప్రమాదం

కేంద్రానికి నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచన

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీలపై ఎలాంటి రుసుములను విధించకుండా ఉచిత సేవలను మరికొన్నేళ్ల పాటు కొనసాగించాలని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కరెన్సీ–జీడీపీ నిష్పత్తి తగ్గుముఖం పట్టే వరకు యూపీఐని ‘ప్రజా ప్రయోజన వ్యవస్థ’గానే పరిగణించాలని వ్యాఖ్యానించారు.

‘‘యూపీఐ మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రభుత్వం భరించే రూ. 20,000 కోట్ల వ్యయం కంటే, ఈ యూపీఐ వ్యవస్థ ద్వారా దేశ ఆర్థిక రంగానికి, ప్రజలకు కలిగే ప్రయోజనాలే అత్యంత విలువైనవి’’ అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘పరిమాణం (వాల్యూమ్‌) పరంగా చూస్తే 96 శాతం లావాదేవీలు రూ. 2,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, విలువ (వాల్యూ) పరంగా దాదాపు 66 శాతం లావాదేవీలు రూ. 2,000 కంటే ఎగువనే ఉన్నాయి. వ్యాపారులపై అతి స్వల్ప రుసుము విధించినా.. ప్రజలు డిజిటల్‌ నుంచి మళ్లీ నగదు వైపు మళ్లే అవకాశముంది’’ అని రాజీవ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత యూపీఐ విధానాన్ని కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

అక్టోబర్‌ 15 నుంచి 0.4% ఎండీఆర్‌

దాదాపు ఆరేళ్ల ఉచిత యూపీఐ సేవలకు స్వస్తి పలుకుతూ అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పర్సన్‌–టు–మర్చంట్‌ (పీటుఎం) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) రుసుము విధిస్తున్నట్లు ప్రభుత్వం సెప్టెంబర్‌ 15న ప్రకటించింది. గరిష్టంగా రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపై క్యాపింగ్‌ ఛార్జీని రూ.300గా నిర్ణయించింది. అయితే, రోజువారీ వ్యక్తిగత (పీటుపీ) బదిలీలు, చిన్న మొత్తాల చెల్లింపులతో పాటు వినియోగదారులపై ఎలాంటి రుసుములు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

‘‘యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎండీఆర్‌ అనేది వ్యాపార చెల్లింపుల వ్యవస్థలోని రుసుము మాత్రమే. యూపీఐ చెల్లింపులు చేసే వినియోగదారులపై ఇది పడదు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యక్తులు యూపీఐని అపరిమితంగా ఉచితంగా వినియోగించుకోవచ్చని, నెలవారీ కోటాలు, లావాదేవీల పరిమితులు, ఉచిత వినియోగంపై శ్లాబ్‌లు ఉండవని తెలిపింది. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ రంగాలు వంటి తక్కువ లాభాల మార్జిన్లతో పనిచేసే అత్యవసర విభాగాలకు రూ. 2,000 పైబడిన ప్రతి లావాదేవీపై రూ. 5 చొప్పున ఫ్లాట్‌ ఎమ్‌డీఆర్‌ విధించనున్నారు. ఈ రంగాల లావాదేవీలు మొత్తం పీటుఎం లావాదేవీల్లో 17% వాల్యూమ్‌ను, విలువ పరంగా 46% వాటాని కలిగి ఉన్నాయి.

ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement