కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మెరుగ్గా ఉండటంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ 17 నాటికి 12.12 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఈ వ్యవధితో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 16 శాతం పెరిగి రూ. 5.22 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ చెల్లింపులు 18 శాతం వృద్ధితో రూ. 4.16 లక్షల కోట్లుగా, కార్పొరేట్‌యేతర చెల్లింపులు 9 శాతం వృద్ధితో రూ. 1.06 లక్షల కోట్లుగా ఉన్నాయి.
మరోవైపు రిఫండ్‌ల జారీ 29 శాతం పెరిగి రూ. 2.20 లక్షల కోట్లకు చేరింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 14.32 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్‌లకు సర్దుబాటు చేయగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్, నాన్ కార్పొరేట్, ఎస్‌టీటీ సహా) 12.96 శాతం పెరిగి రూ. 12.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో సెక్యూరిటీ లావాదేవీల పన్నుల (ఎస్‌టీటీ) వసూళ్లు 53 శాతం పెరిగి రూ. 40,214 కోట్లకు చేరాయి. దీనికి కారణం బడ్జెట్లో ఎస్‌టీటీ రేట్లను 150 శాతం మేర పెంచడమే తప్ప, టర్నోవరు పెరగడం కాదని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ రోహింటన్ సిద్వా తెలిపారు. కార్పొరేట్, అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరుగుతుండటమనేది, వ్యాపార కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతుండటాన్ని సూచిస్తోందని ఏకేఎం గ్లోబల్ మేనేజింగ్ పార్ట్‌నర్ అమిత్ మహేశ్వరి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 23.40 లక్షల కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా రూ. 26.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను కేంద్రం నిర్దేశించుకుంది.
ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!


