వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి! | Tata Sons Leadership Row: How Chandrasekaran Reclaimed Crown in Weeks | Sakshi
Sakshi News home page

వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!

Sep 21 2026 11:21 AM | Updated on Sep 21 2026 11:34 AM

Tata Sons Leadership Row: How Chandrasekaran Reclaimed Crown in Weeks

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన ‘టాటా సన్స్‌’ బోర్డురూమ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్‌. చంద్రశేఖరన్‌ పదవీకాలం పొడిగింపు, స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ అంశాల చుట్టూ జరుగుతున్న వివాదం ఇప్పుడు కార్పొరేట్‌ రంగాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది.

వివాదానికి దారితీసిన పరిణామాల క్రమం

ఫిబ్రవరి 2017 - 2022: సైరస్‌ మిస్త్రీ తొలగింపు తర్వాత చంద్రశేఖరన్‌ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టాటా కుటుంబానికి చెందని వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. 2022లో ఆయన రెండో విడత పదవీకాలం ప్రారంభమైంది.

జులై 2025 – ఫిబ్రవరి 2026: సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు చంద్రశేఖరన్‌కు మరొక ఐదేళ్ల కాల పరిమితి ఇవ్వడానికి మద్దతుగా తీర్మానం చేశాయి. అయితే, ఫిబ్రవరి 2026లో బోర్డు ముందుకు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు బోర్డు సభ్యుడొకరి నుంచి ఆమోదం లభించలేదు.

ఆగస్టు 12, 2026: ఏకగ్రీవ మద్దతు లభించకపోవడంతో ఫిబ్రవరి 2027తో ముగిసే తన ప్రస్తుత పదవీకాలం తర్వాత ముగింపు పలకాలని, మరొక దఫా ఛైర్మన్‌గా కొనసాగకూడదని చంద్రశేఖరన్‌ నిర్ణయించుకుని ఆ విషయాన్ని బోర్డుకు లేఖ ద్వారా తెలిపారు.

సెప్టెంబరు 3, 2026: టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) చంద్రశేఖరన్‌ను తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఏకగ్రీవంగా అభ్యర్థించింది.

సెప్టెంబరు 11, 2026: టాటా సన్స్‌ను నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అప్పర్ లేయర్ జాబితా నుంచి మినహాయించాలని చేసిన అభ్యర్థనను ఆర్‌బీఐ నిరాకరించింది. దీనితో టాటా సన్స్‌ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడం నిబంధనల ప్రకారం అనివార్యమైంది.

సెప్టెంబరు 17, 2026: బోర్డు విజ్ఞప్తి మేరకు చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ బోర్డు తీర్మానం ఆమోదించింది. అయితే, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా ఈ పునర్నియామకాన్ని, అలాగే కంపెనీ ఐపీఓకి వెళ్లే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సెప్టెంబరు 20, 2026 (తాజా పరిణామం): చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని చట్టపరంగా సవాలు చేస్తూ టాటా ట్రస్ట్స్ ప్రకటన విడుదల చేసింది. టాటా సన్స్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ ప్రకారం ట్రస్ట్ నామినేటెడ్ డైరెక్టర్ల మెజారిటీ మద్దతు అవసరమని, నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేసినందున ఈ తీర్మానం మొదటినుంచీ చెల్లదని ట్రస్ట్ పేర్కొంది. టాటా గ్రూప్‌లోని 66% వాటా ఉన్న టాటా ట్రస్ట్స్, బోర్డు నిర్ణయాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ నాయకత్వ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని భారత కార్పొరేట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇదీ చదవండి: తండ్రి ఆస్తిలో వాటా ఎవరికి? కూతురికా? కొడుక్కా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement