మార్కెట్‌ ట్రెండ్స్‌ పట్టుకోవడం కష్టమా? | Smart Way to Ride Big Market Trends Passive Thematic Investing Explained | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ట్రెండ్స్‌ పట్టుకోవడం కష్టమా?

Sep 21 2026 8:46 AM | Updated on Sep 21 2026 8:46 AM

Smart Way to Ride Big Market Trends Passive Thematic Investing Explained

థీమాటిక్‌ పెట్టుబడులకు ప్యాసివ్‌ దన్ను

సర్వసాధారణంగా సంపదను సృష్టించుకోవాలంటే ముందుగా శక్తివంతమైన ట్రెండ్స్‌ను గుర్తించాలంటూ మదుపరులకు సలహాలు వస్తుంటాయి. కానీ ఇది కొంతవరకే నిజం. ఈ ట్రెండ్స్‌లో ఏ కంపెనీలు పాలు పంచుకుంటాయి, వాటి ద్వారా అంతిమంగా ఎవరికి, ఎంత మేరకు ప్రయోజనం లభిస్తుందనేది గుర్తించడం చాలా క్లిష్టమైన పని. గత రెండు దశాబ్దాలుగా మార్కెట్లను శాసించిన కీలక థీమ్‌లను ఒకసారి చూద్దాం. ఇంటర్నెట్‌ అనేది వ్యాపారాలను, వినియోగదారుల ప్రవర్తనను పూర్తిగా మార్చివేసింది.

స్మార్ట్‌ఫోన్లు ప్రజల సమాచార వ్యవస్థను, లావాదేవీల నిర్వహణ తీరుతెన్నులను మార్చాయి. డిజిటల్‌ చెల్లింపులు వాణిజ్య రూపురేఖలని మార్చేశాయి. కానీ, ఈ ప్రతి సెగ్మెంట్లోనూ ఆయా ట్రెండ్స్‌తో లాభపడతాయని ముందుగా అనుకున్న కంపెనీలలో చాలావరకు వెనుకబడిపోయాయి లేదా ఎవరూ ఊహించని కొత్త కంపెనీలు ముందుకు వచ్చి వాటిని అధిగమించాయి. ఇక్కడ థీమ్‌ సరైనదే, కానీ ప్రయోజనం పొందిన కంపెనీలు మారిపోయాయి. రిటైల్‌ పెట్టుబడిదారుల్లో ‘థీమాటిక్‌ ఇన్వెస్టింగ్‌’ (ప్రత్యేక రంగాలు లేదా థీమ్స్‌లో పెట్టుబడులు)కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

విస్తరిస్తున్న థీమాటిక్‌ ఇన్వెస్టింగ్‌

ప్రస్తుతం చాలా మటుకు మదుపరుల పోర్ట్‌ఫోలియోల్లో తయారీ, రక్షణ, క్యాపిటల్‌ మార్కెట్, వినియోగం, డిజిటలైజేషన్, ఇంధనం, మౌలిక వసతుల కల్పన వంటి థీమ్‌లు ఎక్కువగా ఉంటున్నాయ. వీటిపై ఆసక్తి పెరగడానికి బలమైన కారణం ఉంది. స్వల్పకాలిక పరిణామాలు కాకుండా సుదీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు ఈ థీమ్‌లకు దన్నుగా ఉంటాయి. భారత ఇంధన రంగాన్నే ఉదాహరణగా తీసుకుంటే, 2025–26 నాటికి దేశీయంగా మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 530 గిగావాట్ల స్థాయిని దాటింది. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు కూడా రానుండటంతో వచ్చే పదేళ్లలో మరో 589 గిగావాట్లు వస్తాయని అంచనా. ఇందులో అత్యధిక భాగం పునరుత్పాదక ఇంధనం ద్వారానే వస్తుందని భావిస్తున్నారు. దీనితో పాటు శిలాజ ఇంధనాలు కూడా దేశ ఇంధన భద్రతకు కీలకంగా కొనసాగనున్నాయి. ఇదొక గొప్ప దీర్ఘకాలిక అవకాశమని దాదాపు అందరూ అంగీకరిస్తున్నప్పటికీ, దీని ద్వారా ఏయే కంపెనీలు ప్రయోజనం పొందగలవనే విషయంపై మాత్రం ఏకాభిప్రాయం లేదు.  

మారే థీమ్‌లు.. ప్యాసివ్‌ ప్రాధాన్యం..

ఇన్వెస్టర్లకు కొన్ని థీమ్‌లపై గట్టి నమ్మకం ఉన్నప్పటికీ, వాటిలో ఉండే అన్ని షేర్లను గుర్తించడం, ప్రతి దాని పనితీరును నిరంతరం పర్యవేక్షించడం చాలా కష్టమైన పని. ఇండివిడ్యువల్‌ స్టాక్స్‌ను ఎంచుకోవడంలో మానవ ప్రమేయంతో పని లేకుండా, నిర్దిష్ట థీమ్‌లో సులభంగా, పారదర్శకంగా, నిర్దిష్ట నిబంధనలకు కట్టుబడి ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని, ప్రామాణిక సూచీని అనుసరించే ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ అందిస్తుంది. ఈ వ్యూహం,  నిర్దిష్ట థీమ్‌తో ముడిపడే కంపెనీలతో కూడుకున్న పోర్ట్‌ఫోలియోని ఏర్పర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇటువంటి వ్యూహం చాలా తేలికైనదిగానే అనిపించవచ్చు కానీ చాలా కీలకమైనది. థీమాటిక్‌ సూచీలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, మార్కెట్లో వచ్చే మార్పులకు తగ్గట్లుగా రీబ్యాలెన్స్‌ చేస్తుంటారు. ఫలితంగా క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి విధానాన్ని పాటిస్తూనే, థీమ్‌లో వచ్చే మార్పులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్‌ చేసే ప్రయోజనాలను మదుపరులు పొందేందుకు వీలవుతుంది.

కంపెనీల నాయకత్వాలు మారతాయి. సాంకేతికతలు రూపాంతరం చెందుతాయి. పోటీ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ప్రభుత్వ నిబంధనలు మారతాయి.  పూర్తిగా కొత్త వ్యాపార మోడల్స్‌ తెరపైకి వస్తుంటాయి. దీనితో అంతిమంగా అత్యధిక సంపదను సృష్టించే కంపెనీలు, పెట్టుబడిదారులు మొదట్లో ఊహించినవి కాకపోవచ్చు. కేవలం కొన్ని షేర్లలోనే పెట్టుబడిని పరిమితం చేయకుండా, థీమ్‌ మొత్తంలో విస్తృతంగా భాగస్వామ్యం కల్పించడం ద్వారా ప్యాసివ్‌ విధానం ఈ అనిశ్చితిని తగ్గిస్తుంది. అలాగే, థీమాటిక్‌ ఇన్వెస్టింగ్‌లో తరచుగా ఎదురయ్యే భావోద్వేగపరమైన నిర్ణయాలను ఇది నియంత్రిస్తుంది. పెట్టుబడిదారులు సాధారణంగా ఏ రంగంలోనైనా బాగా రాణిస్తున్న కంపెనీల వైపే ఆకర్షితులవుతుంటారు. కానీ, తర్వాతెప్పుడో చూస్తే ఆ థీమ్‌లకు సారథ్యం వహించే కంపెనీలు మారిపోతుంటాయి.  

ఈ నేపథ్యంలో రిటైల్‌ మదుపరులు ఆచరించతగిన అంశం మరొకటి ఉంది. ఒక రంగానికి చెందిన ప్రతి కంపెనీని ట్రాక్‌ చేయడం కంటే, మొత్తం థీమ్‌ను అనుసరించడం చాలా తేలికైన విషయం. చాలా మంది ఇన్వెస్టర్లకు థీమ్‌పరంగా విస్తృతంగా ఉండే ఆర్థిక ధోరణులను అర్థం చేసుకోవాలనే ఆసక్తి, సమయం కూడా ఉండొచ్చు. కానీ, ఆ థీమ్‌నకు సంబంధించి పదుల సంఖ్యలో ఉన్న కంపెనీల నిర్వహణ నాణ్యత, పోటీ పరిస్థితులు, సాంకేతిక మార్పులు, వేల్యుయేషన్లను నిరంతరం పర్యవేక్షించే వనరులు అందరి దగ్గర ఉండవు. ఒక థీమ్‌పై స్పష్టమైన అంచనా ఉండి, ఆ రంగంలోని ప్రతి ఒక్క షేరును వెతికి పట్టుకునే భారం మోయకూడదనుకునే పెట్టుబడిదారులకు ‘థీమాటిక్‌ పాసివ్‌ ఫండ్లు’ ఎంతో ఉపయోగపడతాయి.

ఇదీ చదవండి: తండ్రి ఆస్తిలో వాటా ఎవరికి? కూతురికా? కొడుక్కా?

ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు బడా ఇన్వెస్టర్లు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు ఏదైనా రంగం లేదా థీమ్‌పై స్పష్టమైన అంచనా ఉన్నప్పుడు, వ్యూహాత్మక కేటాయింపుల కోసం థీమాటిక్‌ పాసివ్‌ ఫండ్లతో సహా ఇతర పాసివ్‌ ఫండ్లను ఉపయోగిస్తాయి. ఈ విధానం పారదర్శకంగా, నిబంధనలకు లోబడి, సరైన క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టేందుకు వాటికి సహాయపడుతుంది. థీమాటిక్‌ ఇన్వెస్టింగ్‌లో విజయం సాధించాలంటే, రేపటి గెలుపు గుర్రాలను ముందుగా గుర్తించడమే కీలకం అని చెప్తుంటారు. వాస్తవానికి, వాటికి సంబంధించిన యావత్‌ వ్యవస్థలో ఇన్వెస్ట్‌ చేస్తే, దాన్నుంచి ఆవిర్భవించే విజేతలను ఒడిసి పట్టుకోవడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట థీమ్‌కి చెందిన ఒక్కో సంస్థలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా మొత్తం వ్యవస్థలో ఇన్వెస్ట్‌ చేసే ప్రయోజనాన్ని అందించే ప్యాసివ్‌ విధానం ఇందుకు తోడ్పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement