జనవరి–జూలైలో రూ.49,915 కోట్ల నికర పెట్టుబడులు
ఏడాదిలో 50 లక్షలు పెరిగిన ఫోలియోలు
రూ.6 లక్షల కోట్లకు చేరిన నిర్వహణ ఆస్తులు
మొత్తం ఈక్విటీ ప్రవాహాల్లో 27 శాతానికి చేరిన వాటా
ఫ్లెక్సీక్యాప్ విభాగంలో క్వాంటమ్ కొత్త పథకం
ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఈ ఏడాది జనవరి–జూలై మధ్య రూ.49,915 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.39,187 కోట్లతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ షేర్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే వెసులుబాటు ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ ఫండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్లలో ఫోలియోల సంఖ్య, నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) కూడా గణనీయంగా పెరిగాయి. జూలై 2026 నాటికి ఈ కేటగిరీ ఫోలియోలు 2.44 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 1.94 కోట్లుగా ఉన్నాయి. అంటే సుమారు 50 లక్షల ఫోలియోలు పెరిగాయి.
ఇదే సమయంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్ల ఏయూఎం రూ.4.94 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెరిగింది. జూలైలో నెలవారీ పెట్టుబడులు స్వల్పంగా నెమ్మదించినప్పటికీ.. జూన్‌లో రూ.5,231 కోట్లు రాగా, జూలైలో రూ.4,709 కోట్లు వచ్చాయి. మొత్తం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ప్రవాహాల్లో ఈ కేటగిరీ తన బలమైన వాటాను నిలబెట్టుకుంది. మార్చి త్రైమాసికంలో రూ.24,651 కోట్లు, జూన్ త్రైమాసికంలో రూ.20,555 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
ఫండ్ మేనేజర్ ఆధారిత వ్యూహాలకు ఆదరణ
ఫ్లెక్సీక్యాప్ కేటగిరీ ఫోలియోలు, ఆస్తుల పరంగా బలమైన వృద్ధిని నమోదు చేసిందని క్వాంటమ్ ఏఎంసీ సీఐవో చిరాగ్ మెహతా తెలిపారు. గత 12 నెలల్లో మొత్తం ఈక్విటీ నికర పెట్టుబడి ప్రవాహంలో 27 శాతం వాటాను, గత నెలలో 19 శాతం వాటాను ఫ్లెక్సీక్యాప్ ఫండ్లు దక్కించుకున్నాయని పేర్కొన్నారు. కేవలం రాబడుల కోసం మాత్రమే కాకుండా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను మార్చుకునే ఫండ్ మేనేజర్ ఆధారిత వ్యూహాల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, కంపెనీల ఆదాయాల్లో వ్యత్యాసాలు, అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల మధ్య పెట్టుబడులను మార్చుకునే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ ఫండ్లకు ప్రధాన బలంగా మారిందని మెహతా వివరించారు.
ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి క్వాంటమ్
క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ‘క్వాంటమ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ను ప్రారంభించింది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడులు పెట్టే ఓపెన్–ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ పథకం ఇది. సాంప్రదాయ పెట్టుబడి విధానాలతో పాటు ‘ప్రాఫిట్–పూల్ మైగ్రేషన్’ అనే విధానాన్ని కూడా అనుసరిస్తుంది. వివిధ పరిశ్రమల్లో లాభాల వాటా ఏ విభాగాల వైపు మారుతుందో గుర్తించి, అందుకు అనుగుణంగా పెట్టుబడులను మళ్లించడం ఈ విధానం ఉద్దేశం. దీనికి జీఏఆర్‌పీ (గ్రోత్ అట్ ఏ రీజనబుల్ ప్రైస్), బాటమ్–అప్ స్టాక్ ఎంపిక విధానాలను జోడించారు. క్వాంటమ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) ఆగస్టు 21న ప్రారంభమైంది. రేపు (సెపె్టంబర్ 4న) ముగియనుంది. సెపె్టంబర్ 11 నుంచి ఈ పథకంలో కొనుగోలు, విక్రయాలకు అవకాశం ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల కార్యకలాపాల అనంతరం క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న పథకాల సంఖ్య 14కు చేరింది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్!


