పంటి మెరుపులకు ఏఐ నిఘా! | Dyson CameraJet AI Toothbrush know the features | Sakshi
Sakshi News home page

పంటి మెరుపులకు ఏఐ నిఘా!

Sep 3 2026 9:10 AM | Updated on Sep 3 2026 9:10 AM

Dyson CameraJet AI Toothbrush know the features

హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్‌ కేర్‌) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ స్మార్ట్ టూత్‌బ్రష్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను 499 డాలర్లు(సుమారు రూ.47,000)గా నిర్ణయించారు.

ఈ డివైజ్ కేవలం బ్రష్ చేయడానికే పరిమితం కాకుండా ఒకే సమయంలో బ్రషింగ్, ఫ్లాసింగ్ (Flossing) రెండింటినీ పూర్తిచేసేలా రూపుదిద్దుకుంది. అంటే.. నోటి శుభ్రతలో పంటి సందుల నడుమ పేరుకుపోయే ప్లాక్, ఆహార వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా డైసన్ ఇంజినీర్లు దీనిని డిజైన్ చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం – పనితీరు

ఈ టూత్‌బ్రష్‌లోని ఏఐ సిస్టమ్‌కు దాదాపు 4,70,000 డెంటల్ ఇమేజెస్‌తో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది దంతాల నిర్మాణం, పళ్ళ మధ్య ఉండే ఖాళీలను కచ్చితత్వంతో గుర్తించగలదు. బ్రష్ హెడ్‌లో అమర్చిన మైక్రో కెమెరా పళ్ళ సందులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తుంది. దంతాల మధ్య ఖాళీలను కెమెరా గుర్తించిన మరుక్షణమే బ్రష్ నుంచి మౌత్‌వాష్ స్ప్రే సరిపడా ప్రెషర్‌తో పళ్లపై చిమ్ముతుంది. దీనివల్ల వాటి మధ్య పేరుకున్న వ్యర్థాలు తక్షణమే తొలగిపోతాయి.

సాధారణంగా బ్రషింగ్ తర్వాత విడిగా ఫ్లాసింగ్ చేయడం లేదా మౌత్‌వాష్ ఉపయోగించడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ కెమెరాజెట్ పరికరం ఈ రెండు ప్రక్రియలను ఒక్కటిగా మార్చి వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. దాంతోపాటు దంత సమస్యలైన చిగుళ్ళ వ్యాధులు, పిప్పిపళ్ళు వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement