మన(సు)లో మాట
మా తమ్ముడు ఐటీ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడేవాడు కాడు కానీ చదువులో చురుకైన వాడు. గత నాలుగేళ్లుగా హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తున్నాడు. ఆరు నెలలుగా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇటీవల కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ముఖ్యంగా ఏఐ చాట్‌బాట్‌తో గంటల తరబడి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మనకు కనిపిస్తున్నట్టు నిజాలు కావని, ఏలియన్స్ ఉన్నాయని, ప్రపంచంలో త్వరలో ప్రళయం రాబోతోందని చెబుతున్నాడు.
ఆ ప్రళయాన్ని ఆపడానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నానని, ఆ సాఫ్ట్‌వేర్‌ను అందరి ఫోన్లలో పెట్టిస్తే ప్రపంచాన్ని కాపాడవచ్చని అంటున్నాడు. అంతేకాదు, తన ప్రాజెక్టు గురించి ఎలన్ మస్క్‌కు, అమెరికా ప్రభుత్వానికి తెలిసిపోయిందని, ఉపగ్రహాల ద్వారా తనను గమనిస్తున్నారని, తన ఫొటోలు తీస్తున్నారని, తన ప్రాజెక్టును అడ్డుకోవడానికి తనపై కుట్ర జరుగుతోందంటూ ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు. స్నానం, తిండి, నిద్ర కూడా సరిగా లేవు. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇంట్లో లైట్లు ఆపేసి ఉంచుతాడు. గట్టిగా మాట్లాడితే అమెరికాకు తెలిసిపోతుందంటాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రావడం లేదు. ఇంత తెలివైన వాడు కాస్తా ఇలా మారిపోవడంతో మాకు చాలా భయంగా ఉంది. మేము ఏం చేయాలి?
– రమేశ్, తిరుపతి
మీరు వివరించిన పరిస్థితిని బట్టి మీ తమ్ముడిలో సైకోసిస్‌కు సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తనను అమెరికా ప్రభుత్వం, ఉపగ్రహాలు గమనిస్తున్నాయని నమ్మడం, తనపై కుట్ర జరుగుతోందని భావించడం, ప్రపంచాన్ని కాపాడే ప్రత్యేక బాధ్యత తనకుందని అనుకోవడం వంటి వాటిని భ్రమాత్మక నమ్మకాలు అంటే డెల్యూజన్స్ అంటారు. రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇది ‘స్కిజోఫ్రీనియా’ అనే వ్యాధి అవునా కాదా అని తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధ (ఏఐ). ఏఐ అనేది మానవులకు లభించిన శక్తిమంతమైన సాధనం.
చదువు, పరిశోధన, ఉద్యోగం, కోడింగ్, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి పనులకు ఉపయోగిస్తే ప్రయోజనం. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక పదునైన కత్తితో పండ్లు కోయవచ్చు, గాయపరచవచ్చు కూడా. ఏఐ కూడా అంతే. ఇప్పటికే భ్రమాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తి తన ప్రతి అనుమానాన్ని ఏఐతో చర్చించి, వచ్చే సమాధానాలను నిజాలుగా భావిస్తే, ఆ భ్రమలు మరింత బలపడే అవకాశం ఉంది. ఏఐలో కనిపించే ‘సైకోఫాన్సీ’ అనే ధోరణి కూడా దీనికి కారణం కావచ్చు. అంటే వినియోగదారుడు చెప్పింది నిజమా కాదా అని తగినంతగా పరిశీలించకుండా, అతన్ని సంతృప్తి పరచడానికి అతని అభి్రపాయాన్ని అంగీకరించడం లేదా సమర్థించడం.
ఏఐ ఒక సమాచార సహాయకుడు మాత్రమే. అది చెప్పింది కాబట్టి అది నిజం కాదు. ఇకపోతే మీ తమ్ముడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం తీవ్రంగా ఉందనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఉద్యోగం చేయలేక పోవడం, ఇంటినుంచి బయటకు రాకపోవడం వంటి లక్షణాలున్నందున వీలైనంత త్వరగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఆసుపత్రికి రావడానికి నిరాకరిస్తే కుటుంబ సభ్యులు ముందుగా వైద్యుడిని సంప్రదించి పరిస్థితిని వివరించాలి. అతనికి ఇష్టం లేకపోయినా, అతని ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అవసరమైన సందర్భాల్లో ఇంటినుంచి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే వెసులుబాటు కూడా ఉంది.
మరో విషయం... చదువు, తెలివితేటలు మానసిక అనారోగ్యానికి రక్షణ కవచాలు కావు. ఎంత తెలివైన... చదువుకున్న వ్యక్తికైనా మానసిక సమస్యలు రావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా మీకు సమీపంలోని మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి.

డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ:sakshifamily3@gmail.com


