చాట్‌బాట్‌ల 'వలపు' వల | Artificial intelligence has the upper hand in online love scams | Sakshi
Sakshi News home page

చాట్‌బాట్‌ల 'వలపు' వల

Aug 14 2026 2:18 AM | Updated on Aug 14 2026 2:18 AM

Artificial intelligence has the upper hand in online love scams

ఆన్‌లైన్‌ ప్రేమ మోసాల్లో కృత్రిమ మేధదే పైచేయి 

నేరగాళ్లకు వరంగా మారిన ఆధునిక సాంకేతికత 

మనుషుల కంటే వేగంగా బురిడీ కొట్టిస్తున్న వైనం 

అంతర్జాతీయ అధ్యయనంలోదిగ్భ్రాంతికర విషయాలు 

సాక్షి, హైదరాబాద్‌ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్‌లైన్‌ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రవేశించింది. చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్‌ వంటి ఆధునిక చాట్‌బాట్‌లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది.  

ఏఐకే రేటింగ్స్‌
భారత్‌కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్‌బోర్న్‌ వర్సిటీ, ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్‌బాట్‌లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.

చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్‌బాట్‌లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్‌ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్‌బాట్‌ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు.  

విస్తరిస్తున్న మోసాల నెట్‌వర్క్‌ 
సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్‌ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. 

ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్‌వర్క్‌లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.

మానవ అక్రమ రవాణా.. 
ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.

జాగ్రత్త పడటం ఎలా? 
తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్‌ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement