పహాడీషరీఫ్ (హైదరాబాద్): మద్యం మత్తులో ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ, అక్కడే నిద్రపోయాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీకి చెందిన మహ్మద్ షోయబ్ అలియాస్ ఫుర్కాన్ (18) ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటాడు.
ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున 5 గంటలకు పొరుగునున్న మహ్మద్ ఎజాజుద్దీన్ ఇంట్లోకి చొరబడి, రెండు సెల్‌ఫోన్లు, ఆరిఫిషియల్ వస్తువులను చోరీ చేసి జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మద్యం తాగిన అతడు మత్తులో అక్కడే నిద్రపోయాడు. అతని జేబులో వస్తువులను గుర్తించిన ఎజాజుద్దీన్.. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నాయి.


