డెడ్‌డ్రాప్ లొకేషన్‌లో పడేసిన గంజాయి
హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి దందా
ఐదుగురు ముఠా సభ్యుల అరెస్టు..అదుపులో మరో ఆరుగురు
సోదాల సమయంలో పోలీసులపై కుక్కలను వదిలిన ముఠా
స్క్రూడ్రైవర్‌తో ఓ ఎస్‌ఐపై దాడి..సినిమాను తలపించేలా ఆపరేషన్
వివరాలు వెల్లడించిన ఈగల్ ఎస్పీ గిరిధర్
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్‌లో ఆర్డర్ తీసుకుంటారు. మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్టు నిర్ధారణ అయిన తర్వాత కస్టమర్‌కు ‘సరుకు’అన్న ప్రాంతం లొకేషన్, ఫొటో షేర్ చేస్తారు..ఇలా వాట్సాప్‌లో గ్రూపులు కట్టి అందులోనే ఆర్డర్స్ తీసుకుని డెడ్‌డ్రాప్ (ఎవరూ చూడకుండా ఒక ప్రదేశంలో ప్యాకెట్ పడేసి ఆ లొకేషన్ కస్టమర్‌కు ఇస్తారు) విధానంలో గంజాయి సప్లయ్ చేస్తున్న ఒక డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. గతంలో ఇతర నగరాలకే పరిమితమైన ఈ కొత్త తరహా గంజాయి సరఫరా ముఠాను నగరంలోనూ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. బాలానగర్ రాజీవ్ కాలనీ కేంద్రంగా నిర్వహిస్తున్న గంజాయి స్థావరంపై ఈగల్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు.
హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా గంజాయి సప్లయ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో ఈ ముఠా పోలీసులపై కుక్కలను వదిలి భయపెట్టేందుకు ప్రయత్నించింది. అయినా ఈగల్‌ఫోర్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో స్క్రూడ్రైవర్‌తో ఓ ఎస్‌ఐపై దాడి చేశారు. చివరకు ఈగల్ నుంచి తప్పించుకోలేమని తెలిసి ఈ గ్యాంగ్‌లో ఒకరు బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తుపై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
అంతా సినిమా సీన్ తలపించేలా ఉన్న ఈ స్పెషల్ ఆపరేషన్‌లో ఈగల్ అధికారులు 14 కిలోల గంజాయి, ఎయిర్ గన్, కారు, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వాట్సాప్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఈ ముఠా వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న 203 మంది గంజాయి వినియోగదారులను ఈగల్ అధికారులు గుర్తించారు. వీరిలో 100 మంది కోసం దాదాపు 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి టెస్టులు నిర్వహించారు. అందులో 81 మందికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్ వివరాలను ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ గురువారం మీడియాకు వెల్లడించారు.
అదుపులోకి అనుమానిత వ్యక్తి...
వాట్సాప్ గ్రూప్ ద్వారా నగరంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో అప్రమత్తమైనట్టు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ‘బేగంపేట్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్ వద్ద ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద 50 గ్రాముల గంజాయి దొరికింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కిరణ్, దుర్గా ప్రసాద్, కమలాకర్ అనే నిందితులు ఈ సప్లై వెనుక ఉన్నట్లు తెలిసింది. బాలానగర్ రాజీవ్ కాలనీలో నిందితులు నివాసం ఉంటున్నట్టు సమాచారం అందింది. నార్కోటీమ్స్, మల్కాజ్‌గిరి నార్కోటిక్ టీమ్స్ దాడులు చేశాయి.
అధికారులపై కుక్కలను వదలడంతోపాటు నిందితుడు బొల్లా కిరణ్ .. మల్లేష్ అనే ఇన్‌స్పెక్టర్ పైన స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశాడు. కిరణ్ అనే నిందితుడు నాలుగో ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య డ్రామా ఆడాడు. దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్, మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాం. స్పాట్‌లో 14 కేజీల గంజాయి సీజ్ చేశాం. వీరంతా ఒడిశా నుంచి గాంజా సప్లై చేస్తున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు 203 మందికి గంజాయి సరఫరా చేశారు. హెచ్‌న్యూ, బాలానగర్ పోలీసుల సహకారంతో నిందితులను త్వరగా పట్టుకోగలిగాం’ అని తెలిపారు. నిందితుల సమాచారంతో ఒడిశా గంజాయి సరఫరా గ్యాంగ్‌కు చెందిన మరో ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.


