ఆమె పాఠమే ఒక వాయుసేన | Shakti Sharma becomes first woman officer in to Air Vice Marshal | Sakshi
Sakshi News home page

ఆమె పాఠమే ఒక వాయుసేన

Sep 3 2026 1:08 AM | Updated on Sep 3 2026 1:08 AM

Shakti Sharma becomes first woman officer in to Air Vice Marshal

న్యూస్‌ మేకర్‌

ఆమె రైఫిల్‌ పట్టలేదు. విమానం నడప లేదు. కాని పాఠాలు చెప్పి దేశానికి సేనను సిద్ధం చేసింది. 1994లో వాయసేనలో అడుగుపెడితే ఐదేళ్ల తర్వాత రిటైర్‌ అవ్వాలన్నారు. కాని 31 ఏళ్ల తర్వాత త్రివిధ దళాల్లో నాన్‌–మెడికల్‌ విభాగంలో ‘ఎయిర్‌ వైస్‌ మార్షల్‌’ అయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. శక్తి శర్మ. సెప్టెంబర్‌ 1న న్యూఢిల్లీ ఎయిర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో భుజాలపై రెండు నక్షత్రాలతో స్త్రీ శక్తి ఖ్యాతిని పెంచింది. దేశంలోని ప్రతి యువతి కలకు పై ర్యాంకు ఇచ్చింది.

‘వాయుసేనలో పని చేయడం ఉద్యోగం కాదు. ఒక జీవన విధానం. నేను నా యూనిఫామ్‌ను ఎప్పుడూ ఒక వస్త్రం అనుకోలేదు. శరీరంతో పాటూ ఉన్న చర్మం అనుకున్నాను. అదే నేను. నేనే అది. వాయుసేనలో కాకుండా నా జీవితాన్ని ఇంకోవిధంగా ఊహించలేను’ అంటారు శక్తి శర్మ.

ఆమె ఇప్పుడు కేవలం వాయుసేన మహిళా అధికారి కాదు. త్రివిధ దళాల్లో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ స్థాయికి ఎదిగి స్త్రీ శక్తిని చాటిన శక్తిశర్మ. ‘టచ్‌ ది స్కై విత్‌ గ్లోరీ’... అనేది వాయుసేన నినాదం. శక్తి శర్మ ఆ నినాదాన్ని నిజం చేశారు. ఆకాశాన్ని చుంబించారు.

పాఠమే పవర్‌
శక్తి శర్మది పంజాబ్‌ ప్రాంతం. బాల్యం నుంచే యూనిఫామ్‌ వేసుకున్న మనుషులను చూస్తుండేవారు. వారిలా తనూ కావాలి. అయితే ఆమె మార్గం ప్రత్యక్ష పోరాటం కాదు. పరోక్ష నిర్మాణం. ఒక్క చాక్‌పీస్‌ ముక్కతో వేయిమంది యోధులను తయారు చేయవచ్చు అని నమ్మిన విద్యామూర్తి ఆమె. అందుకే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయిన వెంటనే 1994లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) విద్యా విభాగంలో మహిళల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ పడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేశారు. చిన్న ఆఫీసర్‌గా అడుగు పెట్టారు.

పోరాడి గెలిచిన తరం
శక్తి శర్మ వాయుసేనలోకి అడుగుపెట్టిన 1994–95 బ్యాచ్‌కు ప్రత్యేకత ఉంది. వాయుసేనలో మహిళలను తొలిసారి తీసుకున్నది ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లోనే. అది కూడా ఐదేళ్ల షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పైనే. ఐదేళ్ల తర్వాత పర్మినెంట్‌ కమిషన్‌ ఇస్తామని చెప్పినా ఆ తర్వాత నిరాకరించారు. అయితే శక్తిశర్మకు మాత్రం ఆరేళ్ల లెక్కన, నాలుగేళ్ల లెక్కన ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ వెళ్లారు. మరోవైపు రిటైరైన తొలి తరం మహిళా అధికారులు తమకు పర్మినెంట్‌ కమిషన్‌ కావాలని 12 ఏళ్లు న్యాయపోరాటం చేసి గెలిచారు. 

దాంతో 2010 పాలసీతో శక్తిశర్మ తిరిగి పర్మినెంట్‌ కమిషన్‌లోకి వచ్చారు. ఆ తర్వాత కెరీర్‌ మొత్తం బోధనలోనే సాగింది. ట్రైనింగ్‌ సంస్థల్లో, ఫీల్డ్‌ స్టేషన్లలో యువసేనకు పాఠాలు చెప్తూ తీర్చిదిద్దారు. నాన్‌ మెడికల్‌లో ‘గ్రూప్‌ కెప్టెన్‌’ హోదా పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ యుద్ధతంత్రాలు మారాలని ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీ వంటి టాప్‌ సంస్థలలో డిఫెన్స్ రీసెర్చ్‌ కోసం ‘ఐ.ఏ.ఎఫ్‌. చైర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ఏర్పాటు చేయడంలో ఆమె వ్యూహాత్మక ఆలోచనలు అద్భుతంగా పని చేశాయి.

సైనిక్‌ స్కూల్‌లో తొలి మహిళ  
సైనిక్‌ స్కూల్‌ అంటే కఠినమైన క్రమశిక్షణ, వందల మంది అబ్బాయిలు, మిలటరీ వాతావరణం. అలాంటి ‘కపుర్థల సైనిక్‌ స్కూల్‌’కు శక్తి శర్మ మహిళా ప్రిన్సిపాల్‌ అయ్యారు. త్రివిధ దళాల చరిత్రలోనే సైనిక్‌ స్కూల్‌ను కమాండ్‌ చేసిన తొలి మహిళ ఆమె. వందలమంది టీనేజ్‌ కుర్రాళ్లకు ఆమె లీడర్‌ అయ్యారు. అక్కడ ఆమె పిల్లలకు చెప్పే మాట ఒకటే– ‘మీరు కేవలం సైనికులు కావద్దు... ఆలోచించే సైనికులు కావాలి’. మగవాళ్ల ప్రపంచంలో ఆమె తెరిచిన గేటు ఆ తర్వాత వచ్చే ఎందరో మహిళా అధికారులకు దారి వేసింది. 

లేడీ అండ్‌ జెంటిల్‌మెన్‌....
శక్తి శర్మ తాను చదువు చెప్పడమే కాదు స్వయంగా చదువునూ కొనసాగించారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హయ్యర్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌’ పూర్తి చేశారు. త్రివిధ దళాల్లో నాన్‌ మెడికల్‌లో ఈ కోర్సు చేసిన తొలి మహిళా అధికారి తానే. అప్పటి వరకూ అక్కడ ‘డియర్‌ జెంటిల్‌మెన్‌’ అంటూ పాఠం సాగేది. శక్తిశర్మ ప్రవేశంతో ‘డియర్‌ లేడీ అండ్‌ జెంటిల్‌మెన్‌’గా సంబోధన మారింది. చివరకు అందరినీ కలిపి ‘ఆఫీసర్స్‌’ అనసాగారు. అలా శక్తి శర్మ స్త్రీ, పురుష సామర్థ్యాలను సమానం చేశారు. 

‘పరిస్థితులు మనల్ని ఆపలేవు, మన ఆలోచనలే మనల్ని ఆపుతాయి. వాటిని జయిస్తే విజేతలమే’ అంటూ ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు శక్తి శర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement