నగరంలో ఏజెంట్ల మాయాజాలం
నేపాల్ వరదల నేపథ్యంలో అప్రమత్తత అవసరం
కనీస ప్రమాణాలు లేకుండానే ప్యాకేజీలు
సోషల్ మీడియాతో ఆకట్టుకుని నిర్వహణ
కేంద్ర ప్రభుత్వం, ఎంఎస్‌ఎంఈ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థల గుర్తింపు ఉన్న టూరిస్ట్ ఏజెంట్‌లు: 10,000
ఎలాంటి గుర్తింపు లేని ఏజెంట్‌లు: 25,000
ప్రతిరోజు నగరం నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకులు : 5,000
దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు: 50,000 నుంచి 80,000
నగరానికి వచ్చే విదేశీ పర్యాటకులు: 3,000
‘ఆకాశపు అంచుల్లో విహరిస్తూ.. మేఘాల్లో తేలిపోవాలని ఉందా? అయితే.. మీకు ఇదే మా స్వాగతం’ అంటూ ఓ అందమైన యువతి హిమాలయాల్లో నిల్చుని రీల్స్‌తో ఆకట్టుకుంది. ఆమె వెనక పిల్లలు, పెద్దలు, మహిళలు బారులు తీరి కనిపిస్తారు. సుందర మంచుకొండలు, పర్యాటకుల సందడితో ఆ రీల్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. మరో ఆలోచనకు తావు లేకుండా పర్యాటక ప్రియులు ఆ రీల్స్‌తో పాటు కనిపించే మొబైల్ నంబర్‌లను సంప్రదిస్తారు.
ఆ తర్వాత బుకింగ్‌ల పర్వం మొదలవుతుంది. క్షణాల్లో చెల్లింపులు.. ఆ వెంటనే పర్యటన తేదీల ఖరారు. మరోవైపు ఆధ్యాత్మిక టూర్ల పేరిట మహిళలు, వయోధికులను ఆకట్టుకొనే ప్రకటనలు. టూర్ ఏజెంట్‌లు ఏఐ ఆధారిత రీల్స్‌తో మాయాజాలం సృష్టిస్తున్నారు. పర్యాటకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాణాలు, అధికారిక గుర్తింపు లేకుండా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్‌లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులను దోచుకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్
గ్రూప్ టూర్లపై ఆసక్తి..
కొంతకాలంగా గ్రూప్ టూర్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున ఇలాంటి టూర్‌లకు తరలి వెళ్తున్నారు. కిట్టీపారీ్టల పేరిట డబ్బులు పొదుపు చేసే మహిళలు, ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వయోధికులైన భార్యాభర్తలు, ఇంటిల్లిపాది కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని భావించే వాళ్లు గ్రూప్ టూర్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఈ తరహా టూర్లు అందుబాటులో ఉండడంతో క్షణాల్లో బుకింగ్‌లు భర్తీ అవుతున్నాయి.
మరోవైపు విదేశాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్‌లోని తమ తల్లిదండ్రులకు ఈ ప్యాకేజీలను బహుమతులుగా అందజేస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా ఇలాంటి ప్యాకేజీలను రూపొందిస్తున్న టూరిస్ట్ సంస్థలు నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను తరలిస్తున్నాయి. కేవలం ఏజెంట్‌లను నమ్ముకొని వెళ్లే ఇలాంటి పర్యాటకులు ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేపాల్, భూటాన్ వంటి ప్రాంతాల భౌగోళిక, వాతావరణంపై కనీస అవగాహన లేకుండానే విమానంలో తరలి వెళ్తున్నారని పర్యాటకరంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాయమాటలు నమ్మి..
టిబెట్, నేపాల్ తదితర ప్రాంతాల్లో వందలాది సరస్సులు ఉన్నాయి. కానీ.. చాలామంది కైలాస మానస సరోవరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు లేనివాళ్లు మాత్రమే అక్కడి వరకు వెళ్లగలరు. ఇటీవల కాలంలో 65 ఏళ్లు దాటిన వాళ్లు, గుండెజబ్బులు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు కూడా ఏజెంట్‌ల మాయ మాటలు నమ్మి వెళ్తున్నారు.
ఈ నిబంధనలు తప్పనిసరి..
కొండలు, ఎత్తైన పర్వతాల్లో విహరించేందుకు వెళ్లే పర్యాటకులకు శిక్షణ అవసరం. పాస్‌పోర్ట్, చైనా, టిబెట్ వీసాలు తప్పనిసరిగా తీసుకోవాలని మన విదేశాంగశాఖ ఈ ఏడాది జూన్ 27న స్పష్టంగా ప్రకటించింది.
ఈసీజీ, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువీకరణ ఉండాలి.
విదేశాంగశాఖ నిబంధనల మేరకు బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 లోపు ఉంటే మంచిది.
ఆర్ధోపెడిక్‌గా ఫిట్‌నెస్ లేనివాళ్లు, ఆస్తమా బాధితులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి టూర్‌లకు వెళ్లొద్దు.
రీల్స్ చూసి మోసపోవద్దు
కొంతమంది నకిలీ ఏజెంట్‌లు సృష్టించే కృత్రిమ రీల్స్‌ను చూసి మోసపోవద్దు. గ్రూప్ టూరిజం జోలికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లే ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి. కనీస సదుపాయాలు, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
– కె.రంగారెడ్డి, చైర్మన్ ఐఏటీఓ
ఇవీ చదవండి: కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు


