breaking news
Kailash Mountain
-
టూర్ వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి!
‘ఆకాశపు అంచుల్లో విహరిస్తూ.. మేఘాల్లో తేలిపోవాలని ఉందా? అయితే.. మీకు ఇదే మా స్వాగతం’ అంటూ ఓ అందమైన యువతి హిమాలయాల్లో నిల్చుని రీల్స్‌తో ఆకట్టుకుంది. ఆమె వెనక పిల్లలు, పెద్దలు, మహిళలు బారులు తీరి కనిపిస్తారు. సుందర మంచుకొండలు, పర్యాటకుల సందడితో ఆ రీల్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. మరో ఆలోచనకు తావు లేకుండా పర్యాటక ప్రియులు ఆ రీల్స్‌తో పాటు కనిపించే మొబైల్ నంబర్లను సంప్రదిస్తారు.ఆ తర్వాత బుకింగ్‌ల పర్వం మొదలవుతుంది. క్షణాల్లో చెల్లింపులు.. ఆ వెంటనే పర్యటన తేదీల ఖరారు. మరోవైపు ఆధ్యాత్మిక టూర్ల పేరిట మహిళలు, వయోధికులను ఆకట్టుకొనే ప్రకటనలు. టూర్ ఏజెంట్లు ఏఐ ఆధారిత రీల్స్‌తో మాయాజాలం సృష్టిస్తున్నారు. పర్యాటకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాణాలు, అధికారిక గుర్తింపు లేకుండా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులను దోచుకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్గ్రూప్ టూర్లపై ఆసక్తి.. కొంతకాలంగా గ్రూప్ టూర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున ఇలాంటి టూర్లకు తరలి వెళ్తున్నారు. కిట్టీపారీ్టల పేరిట డబ్బులు పొదుపు చేసే మహిళలు, ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వయోధికులైన భార్యాభర్తలు, ఇంటిల్లిపాది కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని భావించే వాళ్లు గ్రూప్ టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ బడ్జెట్లో ఈ తరహా టూర్లు అందుబాటులో ఉండడంతో క్షణాల్లో బుకింగ్‌లు భర్తీ అవుతున్నాయి.మరోవైపు విదేశాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్‌లోని తమ తల్లిదండ్రులకు ఈ ప్యాకేజీలను బహుమతులుగా అందజేస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా ఇలాంటి ప్యాకేజీలను రూపొందిస్తున్న టూరిస్ట్ సంస్థలు నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను తరలిస్తున్నాయి. కేవలం ఏజెంట్లను నమ్ముకొని వెళ్లే ఇలాంటి పర్యాటకులు ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేపాల్, భూటాన్ వంటి ప్రాంతాల భౌగోళిక, వాతావరణంపై కనీస అవగాహన లేకుండానే విమానంలో తరలి వెళ్తున్నారని పర్యాటకరంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాయమాటలు నమ్మి.. టిబెట్, నేపాల్ తదితర ప్రాంతాల్లో వందలాది సరస్సులు ఉన్నాయి. కానీ.. చాలామంది కైలాస మానస సరోవరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు లేనివాళ్లు మాత్రమే అక్కడి వరకు వెళ్లగలరు. ఇటీవల కాలంలో 65 ఏళ్లు దాటిన వాళ్లు, గుండెజబ్బులు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు కూడా ఏజెంట్ల మాయ మాటలు నమ్మి వెళ్తున్నారు.ఈ నిబంధనలు తప్పనిసరి..కొండలు, ఎత్తైన పర్వతాల్లో విహరించేందుకు వెళ్లే పర్యాటకులకు శిక్షణ అవసరం. పాస్‌పోర్ట్, చైనా, టిబెట్ వీసాలు తప్పనిసరిగా తీసుకోవాలని మన విదేశాంగశాఖ ఈ ఏడాది జూన్ 27న స్పష్టంగా ప్రకటించింది.ఈసీజీ, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువీకరణ ఉండాలి.విదేశాంగశాఖ నిబంధనల మేరకు బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 లోపు ఉంటే మంచిది.ఆర్ధోపెడిక్గా ఫిట్నెస్ లేనివాళ్లు, ఆస్తమా బాధితులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి టూర్లకు వెళ్లొద్దు.రీల్స్ చూసి మోసపోవద్దుకొంతమంది నకిలీ ఏజెంట్లు సృష్టించే కృత్రిమ రీల్స్‌ను చూసి మోసపోవద్దు. గ్రూప్ టూరిజం జోలికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లే ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి. కనీస సదుపాయాలు, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.– కె.రంగారెడ్డి, చైర్మన్ ఐఏటీఓఇవీ చదవండి: కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
కైలాస పర్వతం రహస్యాలను బయటపెట్టిన టిబెటన్ సన్యాసులు
-
హిమగిరి నుంచి బ్రహ్మఝరి
గమనం : నదుల స్వగత కథనం మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం. ‘యార్లాంగ్ గ్జాంగ్పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్‌లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు. బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. మంచు కరిగే రోజుల్లో... హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి. నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి. కజిరంగాలో... ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి. ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు, జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు. నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్‌సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే. భూతాన్ని దాచుకున్నానని... సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే సుందర్బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను. ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్‌పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com


