ఫండే
పిల్లల కథ
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా తుంటరిది. ఎప్పుడూ చెట్ల మీద గంతులు వేస్తూ అడవిలో ఉన్న జంతువులను వెక్కిరిస్తూ ఉండేది. ఏవైనా జంతువులు కష్టంలో ఉంటే సహాయం చేయకపోగా, వాటిని ఎగతాళి చేస్తూ కాలక్షేపం చేసేది.
ఒకరోజు కోతి విహారానికి నడుచుకుంటూ వెళుతుండగా, దారిలో ఒక ఎలుగుబంటికి కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడుతూ కనిపించింది. ఎలుగుబంటి ఆ ముల్లును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అది చూసిన కోతి, ‘ఛీ! ఇంత చిన్న ముల్లుకి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చాలా పిరికిదానివి!’ అని ఎలుగుబంటిని చూసి ఎగతాళి చేసింది.
ఎలుగుబంటి బాధగా, ‘ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే ఇలా అనవు!’ అని అక్కడి నుండి కుంటుతూ వెళ్లిపోయింది. కోతి మాత్రం నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.
దారిలో ఒక ఏనుగు గుండ్రంగా తిరుగుతూ, తొండాన్ని ఊపుతూ కనిపించింది. తొండానికి తేలు కుట్టడంతో ఏనుగు నొప్పిని భరించలేక అల్లాడిపోతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి, ‘ఏంటీ? ఒక చిన్న తేలు కుడితేనే కొండలా ఉన్న నువ్వు ఇంతలా విలవిల్లాడిపోతున్నావా? నేనైతే అస్సలు పట్టించుకోను. నువ్వు ఎంత పిరికి దానివి!’ అని ఏనుగును కూడా వెక్కిరించింది.
కోతి మాటలకు ఏనుగు ఎంతో బాధపడింది. ఏనుగు బాధను చూసి కోతి ఏమాత్రం కనికరించకుండా తన దారిలో వెళ్ళిపోయింది.
మరో రోజు, ఒక నెమలి వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కడంతో ఎగరలేక కిందపడి ఇబ్బంది పడుతుంటే, కోతి చెట్టు మీద నుండి పండ్లు విసురుతూ, ‘పురివిప్పి నాట్యం చేయలేని నెమలి దేనికీ పనికిరాదు. రెక్కలు మొద్దుబారిన నువ్వు అడవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని వెక్కిరించింది. ఇలా ఎదుటివారి బాధను చూసి కోతి ప్రతిసారీ నవ్వుకుంటూనే ఉండేది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు కోతి చెట్టు మీద నుండి కిందకు దూకుతుండగా, ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వలలో ఉన్న పదునైన ఇనుప ముళ్లు కోతి కాలికి, తోకకు బలంగా గుచ్చుకున్నాయి. కోతి నొప్పి తట్టుకోలేక, ‘అమ్మో! ఎంత నొప్పి! ఎవరైనా నన్ను కాపాడండి! నేను భరించలేకపోతున్నాను!’ అని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.
కోతి అరుపులు దూరంగా ఉన్న ఏనుగుకి, ఎలుగుబంటికి, నెమలికి వినిపించాయి. అవి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కోతి తన కాలికి ముళ్లు గుచ్చుకుని, విలవిల్లాడుతుండటం చూశాయి.
అప్పుడు కోతికి అర్థమైంది, ఎదుటివారి బాధను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అని. ఎలుగుబంటి, ఏనుగు, నెమలి అన్నీ కలిసి కోతి దగ్గరకు వచ్చాయి. ఆ జంతువులన్నింటినీ చూసి కోతి కళ్లు చెమ్మగిల్లాయి. ఎలుగుబంటి, ఏనుగు జాగ్రత్తగా వల నుండి కోతిని విడిపించి, ఆ ముళ్లను తొలగించి దానికి సహాయం చేశాయి.
తను చేసిన తప్పుకు చాలా సిగ్గుపడింది కోతి. ‘మిమ్మల్ని ఇంతకుముందు నేను ఎంతగానో ఆటపట్టించాను. కానీ, మీరు ఇప్పుడు నాకు సహాయం చేశారు. ఎవరి బాధ ఎంతటిదో, అది మనదాకా వస్తేనే తెలుస్తుంది!’ కన్నీళ్లతో అంది కోతి. అప్పటి నుండి కోతి ఏ జంతువునూ తక్కువ చేసి మాట్లాడలేదు. ‘ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం కంటే, ఆదుకోవడం మిన్న!’ అని తెలుసుకుంది.
హితవచనం..
అపకృత్య బుద్ధిమతో దూరస్థోస్మీతి నాశ్వసేత్
దీర్ఘా బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః
- బుద్ధిమంతుడికి అపకారం చేసి, దూరంగా పారిపోయి, ‘అతడికి దూరంగానే ఉన్నాను కదా, నాకేం భయంలేదు’ అనుకోవడం బుద్ధితక్కువ పని. బుద్ధిమంతుడు తనను హింసించినవాడు ఎక్కడున్నా పట్టుకుని, ప్రతీకారం తీర్చుకోగలడు.
- శోభా సురేష్


