అగడం.. బగడం..
ఉగాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.
ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.
అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.
ఈ బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?


