భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్‌.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్‌! | Husband Murdered Wife Poison Book Shocking Twist | Sakshi
Sakshi News home page

భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్‌.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్‌!

Aug 30 2026 8:54 AM | Updated on Aug 30 2026 8:54 AM

Husband Murdered Wife Poison Book Shocking Twist

కథాకళి

బ్రిటీష్‌ లైబ్రరీలో నాకు ‘ఫన్నీ లైఫ్‌’ అనే పుస్తకం కనిపించింది. అట్టమీది దృశ్యాన్ని బట్టి అది నాన్‌ ఫిక్షన్‌ అని, ఓ సర్కస్‌ బఫూన్‌ ఆత్మకథని గ్రహించాను. లోపల అక్కడక్కడా చదివితే అది ఇటలీకి చెందిన బీద భర్త, తన సంపన్న భార్యతో పడక పడ్డ అవస్థలు ఉన్నాయి.

ఆమె అతన్ని సరిగ్గా నా భార్య నన్ను చూసేట్లుగా చూస్తోందని కూడా కొన్ని పేజీలు చదివాక తెలుసుకున్నాను. 
పాపం అతను కూడా నాలా టంగ్‌ క్లీనర్‌ కొనడానికి కూడా ఆర్థికంగా భార్య మీద ఆధారపడ్డవాడే.
ఓ చిన్న అధ్యాయంలో ఆ బఫూన్‌ భర్త తన భార్యని చంపే పథకం గురించి ఉంది. భార్య మరణిస్తే మొదటగా పోలీసులు అనుమానించేది భర్తనే. కాబట్టి పట్టుబడని విధంగా భార్యని చంపాలని అనుకున్నాడు. ఆ అధ్యాయంలో దాని గురించి వివరంగా రాశాడు. నేను దాన్ని శ్రద్ధగా చదివాను.

ఆ బఫూన్‌ ఓ లైబ్రరీలో ‘యురోపియన్‌ పాయిజన్స్‌’ అనే  పుస్తకంలో పోస్ట్‌మార్టంలో బయటపడని ఓ విషం గురించి చదివాడు. పద్దెనిమిదో శతాబ్దంలో వెనిస్‌ నగరానికి చెందిన ఓ ఇటాలియన్‌ జిప్సీ మంత్రగత్తె ఎవరూ కనుక్కోలేని విషాన్ని కనిపెట్టి, తమ ఊళ్ళోని భర్తలని చంపాలనుకునే భార్యలకి అమ్మేది. వారు దాన్ని వై¯Œ లో కలిపి తమ భర్తలకి ఇచ్చి చంపేవారు. దాని పేరు ‘వెనీషియన్‌ విషం.’  అలా ఆమె ఆ విషాన్ని నూటముప్ఫై ఏడుమంది ఇల్లాళ్ళకి అమ్మింది! వారిలో వెనిస్‌ బయటి ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా అది బయటకి రాకపోవడానికి కారణం, తమ భర్తని చంపడానికి తాము ఆవిడ నుంచి విషం కొన్నామని ఎవరు చెప్తారు? ఆ విషం గురించి వారంతా రహస్యంగా ఉంచారు. ఆ మంత్రగత్తె మరణానంతరమే ఇది బయటపడింది. ఆవిడ మనవరాలు తన అమ్మమ్మ రాసుకున్న డైరీలని చదివినప్పుడు అందులో ఈ ఉదంతం, ఏ తారీకున ఎవరికి, ఎంతకి ఆ విషాన్ని అమ్మిందో వివరాలు రాసి ఉన్నాయి.

బఫూన్‌ భర్తకి ఆ వివరాలు దొరకడంతో ఆ విషాన్ని తయారుచేసి తన భార్యని చంపాడు. ఆ విషం తయారీ పద్ధతి గురించి కూడా రాశాడు. తేలు విషం, మండ్రగబ్బ మాంసం, కరక్కాయ, తెల్ల ఉమ్మెత్త మొదలైనవి వాడాలి. నేనా పేజీని ఫొటో తీసుకున్నాను. దాన్ని శుభం దాకా జాగ్రత్తగా చదివాను. డాక్టర్స్‌ ఆ విషం గురించి పరిశోధన చేసి, అది పోస్ట్‌మార్టంలో కనుక్కోలేమని నిర్ధారించారని ఆ పుస్తకం చివర్లోని ఎపిలాగ్‌లో రాశారు. భార్య అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు ముందుగా అనుమానించేది భర్తనే అని చెప్పాను కదా. అది చాలా క్రైమ్‌ నవలల్లో చదివాను. అదే నన్ను ఇంతకాలం ఆపింది. ఇప్పుడు నాకో దారి దొరకడంతో ఆ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి ఆనందంగా బయటకి నడిచాను.
∙∙ 
నేను ఆ వస్తువులన్నీ ఒకే షాప్‌లో, ఒకే రోజు, ఒకే ఊళ్ళో కొనలేదు. ఆ పుస్తకం రాసిన బఫూ¯Œ లా అనేక ఊళ్ళల్లోని అనేక షాపుల్లో కొన్నాను. వాటిని ఇంట్లో మా ఆవిడ చూడని రహస్య ప్రదేశంలో దాచాను. వంటగదిలోని పై షెల్ఫ్‌లో. ఆ షెల్ఫ్‌పై అర నేల నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్నవి తీయాలంటే ఐదడుగుల అంగుళం ఎత్తుండే మా ఆవిడ నా మీదే ఆధారపడుతుంది. మా మధ్య ఎత్తులోని అడుగుకి నేను కాంప్రమైజ్‌ అవడానికి కారణం ఆమె సంపదే.
అన్నీ సేకరించాక నేను ఫొటో తీసుకున్న పేజీలోని రెసిపీ ప్రకారం సరైన పాళ్ళల్లో, సరైన పద్ధతిలో, సరైన విరామాల్లో, సరైన టెంపరేచర్లలో వాటిని కలిపాను. తర్వాత దాన్ని డిలీట్‌ చేసేశాను. సంక్రాంతి రోజు తను చేసిన స్వీట్‌ పొంగల్‌లో మా ఆవిడ తినే బౌల్‌లో దాన్ని కలిపాను. అది తిన్న నలభై ఎనిమిది గంటల్లో మా ఆవిడ మరణించింది. అందులో రాసినట్లుగానే మరణానికి మునుపు వివిధ లక్షణాలని గమనించాను.

ఇలాంటి కథల్లో ట్విస్ట్‌ చివర్లో వస్తుంది. నా కథలోని ట్విస్ట్‌ మా మరదలే. తన అక్కని నేను చంపి ఉండచ్చని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమెది తేలు స్వభావం అని తెలుసు కాబట్టి ఇ¯Œ స్పెక్టర్‌ అది చెప్పినప్పుడు నేను పెద్దగా షాక్‌ అవలేదు.
‘‘పరిశోధించండి. ఆమె చెప్పింది తప్పని ఆమెకి దయచేసి ఋజవు చెయ్యండి.’’ కోరాను.
వాళ్ళు నా భార్య దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేశారు. నాకేం కాదనే ధీమాలో ఉన్న నాకు వాళ్ళు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. పోస్ట్‌మార్టంలో నా భార్య విషప్రయోగంతో మరణించిందని తేలిందని పోలీస్‌ డాక్టర్‌ నిర్ధారించాడు! సీసీటీవీ కెమేరాలు పాడుగాను. ఆ విషానికి అవసరమైన పదార్థాలని నేను కొన్నాననే ఋజువులని కూడా సంపాదించారు. నా నేరం ఋజువయ్యాక నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా సెల్‌ గార్డ్‌కి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది.
‘‘నీకు అవసరమైనప్పుడల్లా నన్ను అడిగితే టైం చెప్తాను.’’ నన్ను సెల్‌లోకి పంపాక తాళం వేస్తూ చెప్పాడు.
∙∙ 
ఆ రోజు లైబ్రరీ అవర్లో జైల్‌ లైబ్రరీలో పుస్తకాల కోసం వెదుకుతూంటే నాకు ఆ బఫూన్‌ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమే నన్ను జైలుకి పంపిందని జైలుకి వచ్చిన అక్కడున్న ఓ ఖైదీకి చెప్పాను. అతను దాన్ని చదవడానికి తీసుకున్నాడు.
మర్నాడు లైబ్రరీ అవర్లో ఆ ఖైదీ నవ్వుతూ నాకు ఓ పేజీని చూపించాడు. శుభం తర్వాత నేను చదివిన పుస్తకంలో లేని ఓ కొత్త పేజీ కనిపించింది. అది పబ్లిషర్స్‌ నోట్‌. అందులో ఇలా ఉంది.
హెచ్చరిక: వెనీషియన్‌ విషాన్ని ఎవరూ ప్రయత్నించకండి. అది కల్పితం కాదు. ఇప్పుడు పోస్టుమార్టంలో ఆ విషాన్ని కనుక్కోగలుగుతున్నారు.
బ్రిటీష్‌ లైబ్రరీలో నేను చదివిన ఆ పుస్తకంలోని ఈ ఆఖరు కాగితాన్ని ఎవరు, ఎందుకు చింపారో నాకు తెలీదు. 
వాడివల్ల నేను జీవితఖైదు అనుభవిస్తున్నానని ఆ వెధవకి తెలీదు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఇవి చదవండి: భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్‌ గెలిచిన రచయిత కథ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement