భారత డీఎన్‌ఏలోనే ఏకత్వం: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ | Unity in Diversity is in Indias DNA RSS Chief Mohan Bhagwat in New York | Sakshi
Sakshi News home page

భారత డీఎన్‌ఏలోనే ఏకత్వం: న్యూయార్క్‌లో మోహన్ భగవత్

Aug 30 2026 7:45 AM | Updated on Aug 30 2026 7:45 AM

Unity in Diversity is in Indias DNA RSS Chief Mohan Bhagwat in New York

న్యూయార్క్: భారతదేశపు డీఎన్‌ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ (ఏహెచ్‌ఈఏడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్’ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. అమెరికా అనగానే ‘బహుళత్వం’ (ప్లూరలిజం) గుర్తొస్తుందని, భారత్ అనగానే ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫురిస్తుందని, ఈ రెండూ భారతీయుల జన్యువుల్లోనే ఉన్నాయని భగవత్ పేర్కొన్నారు.

జీవనశైలి, భౌతిక అవసరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అంతర్గత ఏకత్వమే అందరినీ కలుపుతుందని వివరించారు. మానవతా దృక్పథం, సానుభూతిని వివరించేందుకు ఆయన ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఆకలితో ఉన్న వ్యక్తి మన ముందు నిలబడి ఆహారం వైపు చూస్తున్నప్పుడు, అతడిని గమనిస్తూ, ఒక్క మెతుకు కూడా ఇవ్వకుండా ఎవరూ భోజనం చేయలేరని, అదే మనుషుల్లోని అంతర్గత మానవత్వమని అన్నారు. జంతువులు కేవలం మనుగడ, తిండి వరకే ఆలోచిస్తాయని, కానీ మంచి చెడులను గుర్తించి ఆలోచించే విచక్షణా జ్ఞానం ఒక్క మానవులకే ఉందని భగవత్‌ అన్నారు.

ఈ సందర్భంగా ‘ధర్మం’ గురించి మాట్లాడుతూ.. ధర్మం అనేది కేవలం పూజ లేదా మతం కాదని, విశ్వాన్ని నిలబెట్టే మూల సూత్రమని భగవత్ వివరించారు. సత్యాన్వేషణ ద్వారా మోక్షం పొందడమే మానవ జన్మ అంతిమ లక్ష్యమని, మానవ జీవితం అనేది కేవలం ఒక యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. దాదాపు 5,000 మందికి పైగా హాజరైన ఈ సభలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక నేతలు, కొన్ని సంస్థల నుంచి వచ్చిన వ్యతిరేకతల నడుమ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఇది కూడా చదవండి: నేపాల్‌: సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు సమాధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement