అన్నీ కొట్టుకుపోతుంటే.. కూలుతుంటే.. | Victims recall the moments of the Nepal floods with fear | Sakshi
Sakshi News home page

అన్నీ కొట్టుకుపోతుంటే.. కూలుతుంటే..

Aug 30 2026 6:28 AM | Updated on Aug 30 2026 6:28 AM

Victims recall the moments of the Nepal floods with fear

జలఖడ్గం దూసుకొచ్చిన క్షణాలను భయంతో గుర్తుచేసుకున్న బాధితులు

కఠ్మాండు: ప్రశాంత వాతావరణంపై ప్రకృతి పగబట్టి జలఖడ్గం విసిరిన వేళ దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగెత్తిన దృశ్యాలు ఇంకా వాళ్ల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తిమూర్‌లో కస్టమ్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజు బుద్ధాథోకీ బుధవారం ఉదయం ఎప్పట్లాగే తన గదిలో ఉండగా ఒక్కసారిగా వరదనీరు దూసుకొచ్చింది. 

‘‘భూకంపం వచ్చినట్లుగా చుట్టుపక్కల ప్రాంతమంది కదిలింది. వెంటనే భయంతో బయటికొచ్చి చూస్తే అప్పటికే పోలీసులు పారిపోతున్నారు. అర్థంకాక వెనక్కి తిరిగిచూస్తే వరద నీరు అంతెత్తున దూసుకొస్తోంది. వెంటనే పరుగెత్తబోతే ఎదురుగా ఉన్న ముళ్లకంచెకు తగిలి గాయపడ్డా. పరుగెడుతుంటే భీకర వరద నీరు తిమూర్‌ మార్కెట్‌లో ఒక్కో దుకాణాన్ని మింగేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణభయంతో ఎగువ ప్రాంతానికి పరుగెత్తా’’ అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. 

‘‘వరద ఉధృతిని చూసి వెంటనే ఎగువ అడవిలోకి పరుగెత్తా. ఎడమ బొటనవేలుకు పెద్దగాయమై రక్తంకారుతున్నా పరుగు ఆపలేదు. క్షణాల్లో మార్కెట్‌ ప్రాంతం జలమయమైంది. పారిపోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలు కొట్టుకుపోవడం చూశా. అడవిలో హెలికాప్టర్‌ నుంచి ఆర్మీ పడేసి నూడుల్స్‌ ప్యాకెట్లను తిన్నాం’’ అని మరో కస్టమ్స్‌ ఏజెంట్‌ గౌతమ్‌ తెలిపారు. ‘‘కొట్టుకొచ్చిన బుదర అదృష్టవశాత్తు నన్ను ఒడ్డు వైపు విసిరికొట్టింది. 

దీంతో బతికిపోయా. లేదంటే అప్పుడే చచ్చిపోయేవాడిని’’ అని తులసీ బహదూర్‌ బంఢారీ చెప్పారు. ‘‘రసువాలో బంగారం వ్యాపారం చేసే మామ రాజ్‌కమార్‌ దియాలీ ఇంటికి భార్య, నాలుగేళ్ల కుమారుడితో వచ్చా. పని మీద ఇంటి నుంచి బయటికెళ్లా. వరద వార్త తెలిసి తిరిగొచ్చేసరికి అందరూ వరదలో కొట్టుకుపోయారు’’ అని 38 ఏళ్ల సచిన్‌ ఖాతి వాపోయారు. ‘‘నిద్రలో ఉండగానే వరద నన్ను ముంచెత్తింది. కాలు, తలకు గాయాలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చి స్పృహతప్పి పడిపోయా. ఆర్మీ వాళ్లు నన్ను చూసి కాపాడారు’’ అని 21 ఏళ్ల కార్మికుడు సుజల్‌ థాపా తెలిపారు.

చనిపోవడం ఖాయమనుకున్నా..
సింధుపాల్‌చౌక్‌ జిల్లావాసి దీపక్‌ తమాంగ్‌ తనకు ఇవే చివరి క్షణాలను భావించానని భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇంటి నుంచి బయటికొచ్చి చూస్తే అంతెత్తున వరదనీరు దూసుకొస్తోంది. తప్పించుకునే దారే లేదు. అన్ని వైపుల నుంచి వరద ఉధృతి ఎదురొచ్చింది. బతకాలంటే కొండ ఎక్కడం ఒకటే దారి. కొండ వాలుపై మొత్తం ముళ్ల చెట్లే ఉన్నాయి. చేతులకు గుచ్చుకుంటున్నాసరే ముళ్లచెట్లను పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా పట్టు చిక్కలేదు. ఎట్టకేలకు పట్టు దొరకడంతో ఎక్కేశా. చావుకు, బతుక్కు మధ్య సన్నగీతను చూశా. అడవిలో రాత్రంగా ఎడతెరపి వర్షం కురుస్తుంటే అక్కడే దుంగల్ని నిల్వచేసే పాత గోడౌన్‌లో తలదాచుకున్నా. 24 గంటల తర్వాత నన్ను ఆర్మీ కాపాడింది’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement