ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు | mohan bhagwat lgbtq homosexuality rss chief community deserves dignity | Sakshi
Sakshi News home page

ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు

Jul 27 2026 4:58 AM | Updated on Jul 27 2026 5:04 AM

mohan bhagwat lgbtq homosexuality rss chief community deserves dignity

సాక్షి, హైదరాబాద్‌: ఎల్జీబీటీక్యూపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎల్జీబీటీక్యూ  వ్యక్తులు ఎప్పుడూ భారతీయ సమాజంలో అంతర్భాగంగానే ఉన్నారని, వారిని బహిష్కరించడం కాకుండా గౌరవం, ఆమోదం తెలపాలని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ విధంగా మాట్లాడారు.  భారతీయ సంప్రదాయాలు  చాలాకాలం క్రితమే వీరిని గుర్తించాయని సమాజంలో వాటికి తగిన స్థానం కల్పించాయని ఆయన పేర్కొన్నారు.

మోహన్ భగవత్ మాట్లాడుతూ.."ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలన్నీ సమాజంలో ఉన్నాయి. ఇటువంటి స్వభావాలు సమాజంలో సహజంగానే కనిపిస్తాయి. కొన్ని పుట్టుకతోనే ప్రకృతిసిద్ధంగా వస్తే, మరికొన్ని మనుషుల ఆలోచనా విధానం లేదా శారీరక ధోరణుల కారణంగా ఏర్పడతాయి.కమ్యూనిటీ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలివేయకూడదని ఆయన స్పష్టం చేశారు. మన సంప్రదాయం వారి ఉనికిని అంగీకరిస్తుంది. వారు కూడా మనుషులే, వారికి జీవించే హక్కు ఉంది. వారిని సమాజం నుంచి బహిష్కరించలేదు; విశాలమైన మన సామాజిక జీవన విధానంలో వారికి కూడా ఒక స్థానం ఉంది" అని తెలిపారు.

భారతీయ సమాజం అటువంటి వర్గాల పట్ల పక్షపాతంతో వ్యవహరించకుండా చారిత్రాత్మకంగా మానవతా దృక్పథాన్నే అనుసరించిందని ఆయన తెలిపారు. నేటికీ వారికి స్వంత దేవతలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని కుంభమేళాలో పాల్గొనే మహామండలేశ్వరులు కూడా వీరున్నారని  ఆయన గుర్తుచేశారు. భారతీయ సమాజం సాంప్రదాయబద్ధంగా ఈ అంశాన్ని ఎప్పుడూ నిశ్శబ్దంగా, అత్యంత సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటూ వారిని సమాజంలో అంతర్భాగంగానే చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.

గతంలోనూ ఇలా 

సమలింగ సంపర్కం, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి మోహన్ భగవత్ బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 2023 జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు ఇతరులలాగే జీవించే హక్కు ఉన్న మనుషులు కాబట్టి, వారికి సొంత వ్యక్తిగత, సామాజిక స్థలం ఉండాలి" అని పేర్కొన్నారు. హిందూ గ్రంథాలు, పురాణాలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ నాగరికత వారిని సామాజికంగా వెలివేయకుండా చారిత్రాత్మకంగా ఆమోదించిందని ఆయన వాదించారు.

పెద్దల అంగీకారంతో కూడిన స్వలింగ సంబంధాలను 2018లో భారత సుప్రీంకోర్టు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377ను కొట్టివేసి నేరరహితం చేసింది. అయితే, స్వలింగ వివాహాలు, ఎల్జీబీటీక్యూ+ వర్గాలు కోరుతున్న అనేక ఇతర హక్కులు ఇప్పటికీ చట్టపరమైన గుర్తింపు పొందలేదు. స్వలింగ సంపర్కాన్ని సంచలనాత్మకంగా మార్చకూడదని, అది సమాజంలో ఒక సహజ వాస్తవమని భగవత్ గతంలో కూడా చెప్పారు. 

2019 అక్టోషన్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహాభారతంలోని శిఖండి వంటి పాత్రలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ సమాజంలో లైంగిక వైవిధ్యం చాలా కాలంగా ఉందని ఆయన వాదించారు. "దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయడం సహాయపడదు" అని, కాలంతో పాటు సమాజం కూడా పరిణామం చెందాలని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement