సాక్షి, న్యూఢిల్లీ: సీజేపీ ఉద్యమంతో మోదీ సర్కార్‌పై పెరిగిన ఒత్తిడిని పార్లమెంట్‌లోనూ కొనసాగించాలని విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు నిర్ణయించాయి. చలో సంసద్ ర్యాలీలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన, పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తూ కొనసాగిన పోలీస్ చర్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు ఉద్దేశించి కొత్త ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై సోమవారం పార్లమెంట్‌లో ఖర్గే చాంబర్‌లో సమావేశమై ‘ఇండియా’ కూటమి నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉభయసభల్లో మరోమారు వాగ్వాదాల వేడి రాజుకోనుందని స్పష్టమవుతోంది. మరోవైపు నీట్ అంశంపై ఆందోళనలు సాగిస్తున్న విద్యార్థుల పట్ల భద్రతా బలగాలు అతిగా వ్యవహరించాయని, దీనిపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని కోరుతూ టీఎంసీ రాజ్యసభ ఉప నేత సాగరికా ఘోష్ ఆదివారం నోటీసు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం సభలో ఆరోజు జరగాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి, ఈ అంశంపై చర్చను చేపట్టాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పంపిన నోటీస్‌లో సాగరిక పేర్కొన్నారు.
నేటి నుంచి సభలో బిల్లులు
→ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు.
→ ఇదివరకే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘వందేమాతరం’బిల్లుపై చర్చ జరుగనుంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సమాధానం ఇవ్వనున్నారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో చర్చ ఆసక్తికరంగా మారనుంది.
→ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు–2026 కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. సుప్రీంకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ఈ సవరణ బిల్లు చర్చల జాబితాలో ఉంది.


