తొలి రోజే దుమారం  | Both Houses of Parliament Adjourned for the Day Amid Opposition Protest | Sakshi
Sakshi News home page

తొలి రోజే దుమారం 

Jul 21 2026 2:03 AM | Updated on Jul 21 2026 2:04 AM

Both Houses of Parliament Adjourned for the Day Amid Opposition Protest

నీట్, అయోధ్యలో విరాళాల చోరీ, విద్యార్థుల నిరసనలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనలు

 పలుమార్లు వాయిదాపడిన ఉభయ సభలు

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజు సమావేశాలు విపక్షాల నినాదాల హోరులో కొట్టుకుపోయాయి. ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం అర్ధా్ధంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడ్డాయి.

 ప్రతిష్టాత్మక నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల విరాళాల చోరీ, జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌ తదితర కీలకాంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌ ఉభయసభల్లో తొలిరోజే ప్రతిష్టంభన నెలకొంది.

 ‘ఇండియా’కూటమి నేతల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉభయసభలు హోరెత్తిపోయాయి. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ కు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సమయం వృథాగా ఖర్చయిపో యాయి. సభాకార్యకలాపాలకు విపక్ష సభ్యులు అడ్డుతగలడంతో లోక్‌సభ, రాజ్యసభలు తలో ఆరుసార్లు వాయిదాపడ్డాయి. ఉభయ సభాపతులు ఇరుసభలను మంగళవారానికి వాయిదావేశారు.  

ఆరంభం నుంచే అట్టుడికిన లోక్‌సభ.. 
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే మరణించిన మాజీ ఎంపీలకు నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలపై చర్చ కోరుతూ వెంటనే నినాదాలు చేశారు. సభ నినాదాలతో నడవదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్‌ బిర్లా విజ్ఞప్తి చేశారు.

 అయినప్పటికీ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీసహా పలు ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ముందుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నినాదాలతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను శాంతించాలని మరోమారు కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభం అయ్యాక విపక్షాల ఆందోళన కొనసాగడంతో  వాయిదాల పర్వం కొనసాగి, చివరికి సభ మంగళవారానికి వాయిదా పడింది. 

రాజ్యసభలోనూ వాయిదాల పర్వం.. 
రాజ్యసభలో పత్రాల సమర్పణ, నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, మృతిచెందిన సభ్యులకు సంబంధించిన సంతాప తీర్మానాల అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతు ప్రభుత్వం నొక్కేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై చర్చ జరగాల్సిందే. జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం బలప్రయోగం, లాఠీఛార్జి చేస్తోంది.

 వారి గొంతును అణచివేస్తోంది’’అని ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై అధికార కూటమి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా పరిస్థితి అలాగే కొనసాగింది. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయోధ్యలోని రామమందిరంలో కోట్ల రూపాయల విరాళాలను చోరీచేసిన ఉదంతంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్లు, నినాదాల నడుమ సభ మంగళవారానికి వాయిదా పడింది. 

లోక్‌సభ ముందుకు జడ్జీల బిల్లు.. 
ఇంతటి నినాదాల హోరులోనూ ప్రభుత్వం లోక్‌సభలో ఒక బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో రూపొందించిన బిల్లును లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement