తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయనను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్‌ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు.
ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయనను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా, దానిని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్నదానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావణుడి వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌటు వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడినని, విపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా!
తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఏమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి రెండున్నర ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్‌ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే.తారక రామారావు, మాజీ మంత్రి హరీష్‌లు చర్చకు సిద్దం అంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
మిడ్జిల్‌లో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్‌రావులను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరు అన్నా, వారు మిమ్మల్ని అన్నా ఇదేదో మీ రెండు పార్టీలకే సంబందించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు కదా! అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా! కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు కదా! పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి.
కేసీఆర్ గెలిస్తే పదివేలే రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15వేలు రూపాయలు వస్తాయని అన్నారా? లేదా? అప్పుడు అది సాధ్యమా? కాదా? అన్నది ఆలోచించలేదా? గతంలో అమెరికా టూర్‌లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఆ మానిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా! ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2500రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే! అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్నిచోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది. దానిని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలుచేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా, బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు.
కేటీఆర్, హరీష్‌రావులకు, అదే టైమ్‌లో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాలకన్నా ప్రభుత్వంలో ఉన్నవారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, కొత్తగా మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసికి సంబంధించి రెండున్నర టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా ఉన్న మూసిని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు.
అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు వ్యయం చేయాలన్న ఆలోచనను కూడా ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణ భారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే. కాని మానిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. విపక్షంగా బీఆర్‌ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ 28720 కోట్ల బకాయిపడ్డారని విమర్శిస్తున్నారు. వీటిపై తగురీతిలో జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలనవల్ల కలిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.
కేసీఆర్ పాలన, తన పాలనపై చర్చకు సిద్దమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాలలో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభలలో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఉంటున్నాయి. తాను గుంపుమేస్త్రీనని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని, ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంతవరకు బాగానే ఉంటుంది కాని, గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే ఏదో మేకలు, గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్ల్రీ అని ఎద్దేవ చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రీ అని చెప్పుకున్నా, ఆ పదం అంత బాగున్నట్లు అనిపించదు.
మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలు చెప్పనని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని రేవంత్ ప్రకటించారు. నిజంగా అలా చేయగలిగితే ఆయనను అభినందించవచ్చు. రేవంత్‌తో సహ రాజకీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారా? లేదా? అన్నది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమేమి చెప్పింది. వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్య సంధుడనని రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కాని తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అన్నది చర్చనీయాంశం.
ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరు. తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో దైర్యంగా ప్రశ్నించగలిగ ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ మరీ ఘోరంగా పోలీసులను ప్రజలపై, ప్రశ్నంచేవారిపై ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కాని అబద్దాలు చెప్పను అన్న స్టేట్ మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాద్యమైనంతవరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్‌కు మరోసారి అభినందనలు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


