నేపాల్‌: సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు సమాధి? | Nepal Flash Floods, Over 573 Workers Trapped In Hydropower Tunnels As Rescue Operations Intensify, Check Details Inside | Sakshi
Sakshi News home page

నేపాల్‌: సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు సమాధి?

Aug 30 2026 7:28 AM | Updated on Aug 30 2026 12:14 PM

Nepal Flash Floods Over 570 Hydropower Workers Trapped Search Ops Underway

ఖాట్మండు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే-భోటే కోశి-త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. 11 ప్రాజెక్టు ప్రాంతాల పరిధిలో తొలుత 934 మంది కార్మికులు గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించగా, వారిలో 361 మందిని సురక్షితంగా రక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నమోదుకాని కార్మికులు కూడా ఉండటంతో గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

చిక్కుకుపోయిన వారిలో భారతీయులతో పాటు నేపాల్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ దేశాల పౌరులు ఉన్నారు. ప్రధానంగా నాలుగు ప్రాజెక్టుల్లోనే అత్యధిక మంది కార్మికులు చిక్కుకున్నారు. అప్పర్ త్రిశూలి-1 (322 మంది), అప్పర్ త్రిశూలి-3బి (122 మంది), అప్పర్ త్రిశూలి-3ఎ (43 మంది), రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు (44 మంది) వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. సొరంగాల వద్ద 10 నుంచి 12 అడుగుల మేర బురద, శిథిలాలు పేరుకుపోయి మార్గాలు మూసుకుపోయాయి.

సహాయక చర్యల నిమిత్తం నేపాల్ ఆర్మీ 15 హెలికాప్టర్లు, వందలాది మంది రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది. మరోవైపు భారత్ కూడా సాంకేతిక, వైద్య, టన్నెల్ నిపుణులతో కూడిన బృందాలను పంపించింది. సీ-130జే హెర్క్యులస్ విమానం ద్వారా సైనిక టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఫోరెన్సిక్ విభాగాలను తరలిస్తోంది. ఈ వరద విపత్తులో ఇప్పటివరకు 675 మంది మృతి చెందగా, నేపాల్, టిబెట్ వ్యాప్తంగా దాదాపు 3,000 మంది ఆచూకీ గల్లంతైంది.

ఇది కూడా చదవండి: ఏమిటీ రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement