breaking news
Suspense thriller story
-
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్!
బ్రిటీష్ లైబ్రరీలో నాకు ‘ఫన్నీ లైఫ్’ అనే పుస్తకం కనిపించింది. అట్టమీది దృశ్యాన్ని బట్టి అది నాన్ ఫిక్షన్ అని, ఓ సర్కస్ బఫూన్ ఆత్మకథని గ్రహించాను. లోపల అక్కడక్కడా చదివితే అది ఇటలీకి చెందిన బీద భర్త, తన సంపన్న భార్యతో పడక పడ్డ అవస్థలు ఉన్నాయి.ఆమె అతన్ని సరిగ్గా నా భార్య నన్ను చూసేట్లుగా చూస్తోందని కూడా కొన్ని పేజీలు చదివాక తెలుసుకున్నాను. పాపం అతను కూడా నాలా టంగ్ క్లీనర్ కొనడానికి కూడా ఆర్థికంగా భార్య మీద ఆధారపడ్డవాడే.ఓ చిన్న అధ్యాయంలో ఆ బఫూన్ భర్త తన భార్యని చంపే పథకం గురించి ఉంది. భార్య మరణిస్తే మొదటగా పోలీసులు అనుమానించేది భర్తనే. కాబట్టి పట్టుబడని విధంగా భార్యని చంపాలని అనుకున్నాడు. ఆ అధ్యాయంలో దాని గురించి వివరంగా రాశాడు. నేను దాన్ని శ్రద్ధగా చదివాను.ఆ బఫూన్ ఓ లైబ్రరీలో ‘యురోపియన్ పాయిజన్స్’ అనే పుస్తకంలో పోస్ట్‌మార్టంలో బయటపడని ఓ విషం గురించి చదివాడు. పద్దెనిమిదో శతాబ్దంలో వెనిస్ నగరానికి చెందిన ఓ ఇటాలియన్ జిప్సీ మంత్రగత్తె ఎవరూ కనుక్కోలేని విషాన్ని కనిపెట్టి, తమ ఊళ్ళోని భర్తలని చంపాలనుకునే భార్యలకి అమ్మేది. వారు దాన్ని వై¯Œ లో కలిపి తమ భర్తలకి ఇచ్చి చంపేవారు. దాని పేరు ‘వెనీషియన్ విషం.’ అలా ఆమె ఆ విషాన్ని నూటముప్ఫై ఏడుమంది ఇల్లాళ్ళకి అమ్మింది! వారిలో వెనిస్ బయటి ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా అది బయటకి రాకపోవడానికి కారణం, తమ భర్తని చంపడానికి తాము ఆవిడ నుంచి విషం కొన్నామని ఎవరు చెప్తారు? ఆ విషం గురించి వారంతా రహస్యంగా ఉంచారు. ఆ మంత్రగత్తె మరణానంతరమే ఇది బయటపడింది. ఆవిడ మనవరాలు తన అమ్మమ్మ రాసుకున్న డైరీలని చదివినప్పుడు అందులో ఈ ఉదంతం, ఏ తారీకున ఎవరికి, ఎంతకి ఆ విషాన్ని అమ్మిందో వివరాలు రాసి ఉన్నాయి.బఫూన్ భర్తకి ఆ వివరాలు దొరకడంతో ఆ విషాన్ని తయారుచేసి తన భార్యని చంపాడు. ఆ విషం తయారీ పద్ధతి గురించి కూడా రాశాడు. తేలు విషం, మండ్రగబ్బ మాంసం, కరక్కాయ, తెల్ల ఉమ్మెత్త మొదలైనవి వాడాలి. నేనా పేజీని ఫొటో తీసుకున్నాను. దాన్ని శుభం దాకా జాగ్రత్తగా చదివాను. డాక్టర్స్ ఆ విషం గురించి పరిశోధన చేసి, అది పోస్ట్‌మార్టంలో కనుక్కోలేమని నిర్ధారించారని ఆ పుస్తకం చివర్లోని ఎపిలాగ్లో రాశారు. భార్య అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు ముందుగా అనుమానించేది భర్తనే అని చెప్పాను కదా. అది చాలా క్రైమ్ నవలల్లో చదివాను. అదే నన్ను ఇంతకాలం ఆపింది. ఇప్పుడు నాకో దారి దొరకడంతో ఆ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి ఆనందంగా బయటకి నడిచాను.∙∙ నేను ఆ వస్తువులన్నీ ఒకే షాప్‌లో, ఒకే రోజు, ఒకే ఊళ్ళో కొనలేదు. ఆ పుస్తకం రాసిన బఫూ¯Œ లా అనేక ఊళ్ళల్లోని అనేక షాపుల్లో కొన్నాను. వాటిని ఇంట్లో మా ఆవిడ చూడని రహస్య ప్రదేశంలో దాచాను. వంటగదిలోని పై షెల్ఫ్‌లో. ఆ షెల్ఫ్‌పై అర నేల నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్నవి తీయాలంటే ఐదడుగుల అంగుళం ఎత్తుండే మా ఆవిడ నా మీదే ఆధారపడుతుంది. మా మధ్య ఎత్తులోని అడుగుకి నేను కాంప్రమైజ్ అవడానికి కారణం ఆమె సంపదే.అన్నీ సేకరించాక నేను ఫొటో తీసుకున్న పేజీలోని రెసిపీ ప్రకారం సరైన పాళ్ళల్లో, సరైన పద్ధతిలో, సరైన విరామాల్లో, సరైన టెంపరేచర్లలో వాటిని కలిపాను. తర్వాత దాన్ని డిలీట్ చేసేశాను. సంక్రాంతి రోజు తను చేసిన స్వీట్ పొంగల్‌లో మా ఆవిడ తినే బౌల్లో దాన్ని కలిపాను. అది తిన్న నలభై ఎనిమిది గంటల్లో మా ఆవిడ మరణించింది. అందులో రాసినట్లుగానే మరణానికి మునుపు వివిధ లక్షణాలని గమనించాను.ఇలాంటి కథల్లో ట్విస్ట్ చివర్లో వస్తుంది. నా కథలోని ట్విస్ట్ మా మరదలే. తన అక్కని నేను చంపి ఉండచ్చని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమెది తేలు స్వభావం అని తెలుసు కాబట్టి ఇ¯Œ స్పెక్టర్ అది చెప్పినప్పుడు నేను పెద్దగా షాక్ అవలేదు.‘‘పరిశోధించండి. ఆమె చెప్పింది తప్పని ఆమెకి దయచేసి ఋజవు చెయ్యండి.’’ కోరాను.వాళ్ళు నా భార్య దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేశారు. నాకేం కాదనే ధీమాలో ఉన్న నాకు వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. పోస్ట్‌మార్టంలో నా భార్య విషప్రయోగంతో మరణించిందని తేలిందని పోలీస్ డాక్టర్ నిర్ధారించాడు! సీసీటీవీ కెమేరాలు పాడుగాను. ఆ విషానికి అవసరమైన పదార్థాలని నేను కొన్నాననే ఋజువులని కూడా సంపాదించారు. నా నేరం ఋజువయ్యాక నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా సెల్ గార్డ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.‘‘నీకు అవసరమైనప్పుడల్లా నన్ను అడిగితే టైం చెప్తాను.’’ నన్ను సెల్‌లోకి పంపాక తాళం వేస్తూ చెప్పాడు.∙∙ ఆ రోజు లైబ్రరీ అవర్‌లో జైల్ లైబ్రరీలో పుస్తకాల కోసం వెదుకుతూంటే నాకు ఆ బఫూన్ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమే నన్ను జైలుకి పంపిందని జైలుకి వచ్చిన అక్కడున్న ఓ ఖైదీకి చెప్పాను. అతను దాన్ని చదవడానికి తీసుకున్నాడు.మర్నాడు లైబ్రరీ అవర్‌లో ఆ ఖైదీ నవ్వుతూ నాకు ఓ పేజీని చూపించాడు. శుభం తర్వాత నేను చదివిన పుస్తకంలో లేని ఓ కొత్త పేజీ కనిపించింది. అది పబ్లిషర్స్ నోట్. అందులో ఇలా ఉంది.హెచ్చరిక: వెనీషియన్ విషాన్ని ఎవరూ ప్రయత్నించకండి. అది కల్పితం కాదు. ఇప్పుడు పోస్టుమార్టంలో ఆ విషాన్ని కనుక్కోగలుగుతున్నారు.బ్రిటీష్ లైబ్రరీలో నేను చదివిన ఆ పుస్తకంలోని ఈ ఆఖరు కాగితాన్ని ఎవరు, ఎందుకు చింపారో నాకు తెలీదు. వాడివల్ల నేను జీవితఖైదు అనుభవిస్తున్నానని ఆ వెధవకి తెలీదు.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి చదవండి: భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ! -
అమ్మా... 'నేను లారీ కింద పడి చనిపోయాను..!'
కొలీన్ హాకిన్ కిచెన్‌లో పనిచేసుకుంటోంది. హాల్లో ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు బ్లేక్ హాకిన్ భయంతో గట్టిగా అరిచాడు. బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న తన అన్నయ్యను ఉద్దేశించి ‘రోడ్డుపై నుంచి పక్కకు రా... బస్సు వచ్చేస్తోంది!’ అంటూ కేకలు వేశాడు.కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి కొలీన్ కు... బ్లేక్ తన ఎడమ చెవిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, నొప్పితో విలవిలలాడుతూ ఏడవడం కనిపించింది.‘ఏమైంది నాన్నా?’ అంటూ బ్లేక్‌ను గుండెలకు హత్తుకుంది. ఒళ్లు వణుకుతుండగా వాడు చెప్పిన మాటలకు కొలీన్ మైండ్ బ్లాక్ అయింది ‘అమ్మా! నన్ను ఒక పెద్ద లారీ ఢీకొట్టింది. నేను ఆ భారీ చక్రాల కింద పడిపోయాను!’ అని చెప్పాడు. కొలీన్ బయటకు పరుగెత్తి చూసింది.కానీ అక్కడ ఎలాంటి లారీ లేదు. మొదట ఆ చిన్నారి ఏదో కార్టూన్ చూసి ఊహించుకుని చెప్తున్నాడని అనుకుంది. కానీ, బ్లేక్ ఆ ప్రమాదం గురించి చెప్తున్నప్పుడు తన ముఖంలో కనిపించిన భయం ఆమెను ఆలోచనలో పడేసింది. కొలీన్ ఆ చిన్నారి కళ్లల్లోకి చూస్తూ, ‘నువ్వు చనిపోయావా బ్లేక్?’ అని అడిగింది. ఆ బాలుడు ఏమాత్రం తడబడకుండా, ‘అవును’ అని బదులిచ్చాడు!ఆ ఒక్క సంఘటనతో బ్లేక్ జీవితం తలకిందులైంది. ఎప్పుడూ ఇల్లంతా పరుగెడుతూ, నవ్వుతూ ఉండే ఆ చిన్నారి... ఒక్కసారిగా తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు. శూన్యంలోకి చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చునేవాడు. ప్రతిరోజూ తన ఎడమ వైపు ఉన్న చెయ్యి, కాలు లేదా కన్ను విపరీతంగా నొప్పి పెడుతున్నాయంటూ ఏడ్చేవాడు. వైద్య పరిభాషలో దీనిని ‘ఫాంటమ్ పెయిన్’ అంటారు. అంటే ప్రస్తుతం ఎలాంటి దెబ్బ తగలకున్నా, గతంలో అనుభవించిన తీవ్రమైన శారీరక నొప్పులు మెదడుకు గుర్తుండిపోయి మళ్లీ బాధించడం!ఆ భయంకరమైన నరకాన్ని మాటల్లో చెప్పలేక, బ్లేక్ తెల్ల కాగితాలపై పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ, తల్లి దగ్గరకు తెచ్చి, ‘అమ్మా... చూడు, ఇవే నా ఒంటిపై ఉన్న గాయాలు’ అని చూపిస్తూ ఏడ్చేవాడు. బ్లేక్ మానసిక స్థితిని చూసి తట్టుకోలేక, కొలీన్ పునర్జన్మలపై పరిశోధనలు చేసే ప్రముఖ థెరపిస్ట్ క్యారల్ బోమన్‌ను సంప్రదించింది.ఇలాంటి పరిస్థితుల్లోనే, ఆ కుటుంబం క్రిస్మస్ కోసం అమెరికా నుంచి లండన్ వెళ్లింది. అక్కడ రద్దీగా ఉన్న ఒక రోడ్డు పక్కన బ్లేక్ చిన్న పిల్లల స్ట్రాలర్లో కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా ఓ లారీ తమ వైపు వేగంగా రావడం చూశాడు. వెంటనే స్ట్రాలర్ లోంచి బయటకు దూకి, నేరుగా దూసుకొస్తున్న ఆ లారీ ముందుకు పరుగెత్తాడు. చుట్టుపక్కల వాళ్లంతా గట్టిగా కేకలు వేశారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న బ్లేక్ తండ్రి క్షణాల వ్యవధిలో బ్లేక్‌ను వెనక్కి లాగాడు. గత జన్మలో లారీ కింద పడి చనిపోయిన ఆ భయంకరమైన సంఘటనను బ్లేక్ ఈ జన్మలో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి కొలీన్ భయంతో వణికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న క్యారల్ బోమన్... కొలీన్కు ఒక ఉపాయం చెప్పింది.క్యారల్ చెప్పినట్లే ఆ రాత్రి కొలీన్.. బ్లేక్ మంచం దగ్గరకు వెళ్లి, తన తలపై ప్రేమగా నిమురుతూ, ‘కన్నా.. నువ్వు గతంలో లారీ కింద పడి చనిపోయావు కదా, అది నిజమే. కానీ నా బంగారు కొండా... అది నీ గత జన్మ. అప్పుడు నీ శరీరం వేరు, నిన్ను కన్న తల్లి వేరు. ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టావు. ఇది నీ కొత్త జీవితం. ఇక్కడ నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఆ పాత లారీ నిన్ను ఏమీ చేయలేదు...’ అని చెప్పింది.ఆశ్చర్యం! ఆ మాటలు వినగానే ఆ మూడేళ్ల చిన్నారి ముఖంలో తెలియని ఒక ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజు ఉదయం నుంచే బ్లేక్ ఆ పాత జ్ఞాపకాలను, ఆ భయాన్ని పూర్తిగా మరచిపోయాడు. తన శరీరంలో ఎడమవైపు వస్తున్న ఆ ‘ఫాంటమ్ పెయిన్స్’ కూడా మాయమయ్యాయి! మళ్లీ ఎప్పటిలాగే నవ్వుతూ, ఆడుకుంటూ సాధారణ స్థితికి వచ్చాడు.సైన్స్ పరంగా పునర్జన్మలను నిరూపించడానికి లేదా పూర్తిగా తోసిపుచ్చడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ బ్లేక్ హాకిన్ అనుభవం, తన మెదడులో దాగున్న కాలం దాటిన జ్ఞాపకాలు మాత్రం ప్రకృతి మానవాళికి వదిలేసిన అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి!- సత్యకిషోర్ -
నిక్ స్కుబిష్..! అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి?
అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి మరణించింది. తన వెంటే ఉన్న మూడేళ్ల కొడుకు కొనప్రాణాలతో మిగిలాడు. మరణించిన తర్వాత కూడా ఆ తల్లి–కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి, ఆ కొడుకు ప్రాణాలు నిలిచాయి. పెరిగి పెద్దవాడైన కొడుకు మనసులో ఆ జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి.1994 జూన్ 11 రాత్రి, సమయం పదకొండు దాటింది. కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా పర్వతశిఖరాల పక్కనే ఉన్న ‘హైవే నంబర్ 50’ వైపు ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారుని డెబోరా హోయ్ట్ అనే 35 ఏళ్ల మహిళ నడుపుతోంది. బాగా చీకటిపడటంతో ఆమెకు నిద్ర రాకుండా ఉండటానికి పాటల కచేరీ మొదలుపెట్టాడు పక్క సీట్లో కూర్చున్న ఆమె భర్త డేవిడ్. దాంతో డెబోరా కూడా డేవిడ్‌తో కలసి గొంతు కలిపింది. ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై భీకరమైన చలిలో పొగమంచును చీల్చుకుంటూ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి.ఉన్నట్టుండి డెబోరా చూపు రోడ్డు తిన్నగా కాకుండా రోడ్డు పక్కకు మళ్లింది. ఒంటి మీద నూలుపోగు లేని ఒక అందమైన అమ్మాయి వెనక్కి తిరిగి, వయ్యారంగా నేలపై పడుకుని ఉంది. ఆమె అచ్చం పాలరాతి బొమ్మలా ఉంది. రెండు చేతులూ పైకి పెట్టుకుని, మోకాళ్లు కాస్త ముడుచుకుని హొయలు పోతున్నట్లే కనిపిస్తోంది. అయితే అది బొమ్మా? మనిషా? ప్రాణం ఉందా? లేదా? అర్థం కాలేదు డెబోరాకు. వెంటనే భర్తకు ఆ దృశ్యాన్ని చూపిస్తూ కారు స్లో చేసింది. అది చూసిన డేవిడ్ ‘హేయ్ ఆపొద్దు! పోనీ పోనీ!’ అని అరిచేశాడు కంగారుగా. దాంతో డెబోరా కారు గేర్ మార్చింది. అతడి భయమేంటంటే, అలా అందమైన అమ్మాయిలను రోడ్లపై పడుకోబెట్టి, దొంగలు కాపుగాసి ఉండవచ్చు. లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండవచ్చు.‘అర్ధరాత్రి అలా ఎక్కడపడితే అక్కడ కారు ఆపడం ప్రమాదమని నీకు తెలియదా?’ అని తిట్టాడు డేవిడ్. అది నిజమే అనిపించింది డెబోరాకి. దాంతో పోలిస్ స్టేష¯Œ కి వెళ్లి రిచ్ స్ట్రాసర్ అనే డిప్యూటీ అధికారికి విషయం చెప్పారు. ‘పదండి ఎక్కడో చూపించండి’ అన్నాడు స్ట్రాసర్. దాంతో డెబోరా కారు యూటర్న్ తీసుకుంది. తీరా ఆ అమ్మాయి కనిపించిన చోట రెండు లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. నిజానికి ‘ఆ అమ్మాయి కనిపించింది సరిగ్గా ఇక్కడే’ అని ఆ దంపతులిద్దరూ గుర్తించలేకపోయారు. సరైన ల్యాండ్ మార్క్ లేకపోవడంతో పాటు కంగారుగా అక్కడి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ గందరగోళం చెందారు. అయితే ఆ చోటికి వెళ్లగానే, రిచ్ స్ట్రాసర్ మదిలో ఓ తల్లికొడుకుల మిస్సింగ్ కేసు మెదిలింది.సరిగ్గా ఐదు రోజుల కిందట క్రిస్టీన్ స్కుబిష్ అనే 23 ఏళ్ల అమ్మాయి తన మూడేళ్ల కొడుకు నిక్‌తో కలసి కారులో ఇదే దారి గుండా వెళ్లిందట! ఆ తర్వాత వాళ్లు ఇంటికి రాలేదు. ఆ మిస్సింగ్ కేస్ మా దగ్గరకొచ్చింది. మీరు ఒకసారి రేపు ఉదయాన్నే రండి. పగటిపూటైతే మనకు ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా’ అన్నాడు డెబోరాతో స్ట్రాసర్.మరునాడు ఉదయాన్నే స్ట్రాసర్ను కలసిన డెబోరా రాత్రి తమ ప్రయాణాన్ని, నగ్నంగా కనిపించిన అమ్మాయి దృశ్యాన్నీ ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా గుర్తు చేసుకుని, ‘బులియన్ బెండ్‘ అనే ప్రమాదకరమైన చోటును చూపిస్తూ ‘ఇక్కడే సార్! రాత్రి నేను చూసింది ఇక్కడే!’ అంది బలంగా. అక్కడే లోయవైపు కారు టైర్ల గుర్తులు ఆనవాళ్లుగా కనిపించాయి స్ట్రాసర్కి. కొద్ది దూరంలో ఒక చిన్న çషూ రక్తం మరకలతో కనిపించింది. వెంటనే వెతుకులాట మొదలుపెట్టించాడు. అదే లోయలో కాసేపటికి క్రిస్టీన్ కారు కనిపించింది. ఆ పక్కనే ఆమె మృతదేహం కనిపించింది. కాస్త దూరంలో బాబు పడి ఉన్నాడు. పల్స్ కొట్టుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.నిజానికి జూన్ 6 తర్వాత రోడ్డు మీదకు కొండచరియలు విగిరిపడటంతో సుమారు రెండు రోజుల పాటు అటుగా రాకపోకలు కూడా ఆగిపోయాయి. అంటే జూన్ 6న నిక్, క్రిస్టీన్ వెళ్తున్న కారు మీద అవి పడి, ఆ ధాటికి కారు లోయలో పడిపోయి ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే క్రిస్టీన్ చనిపోయిందని పోస్ట్ మార్టమ్‌లో తేలింది. మరి చిన్న బాబు పగలు భీకరమైన వేడిని, రాత్రి వణికించే చలిని తట్టుకుని, సుమారు ఆరు రోజులు ఎలా ప్రాణాలతో ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి డెబోరా కన్ను ఆ నగ్నంగా కనిపించే అమ్మాయి మీద పడకుండా ఉండి ఉంటే, నిక్ ఎవరికీ కనిపించేవాడే కాదు.ప్రమాదంలో క్రిస్టీన్ చనిపోయాక ఆత్మగా మారి, లోయలో పడిన తన బిడ్డను బతికించు కోవడానికే దారిన పోయేవారికి నగ్నంగా కనిపించి ఉంటుందని డెబోరా నమ్మింది. ఆ వార్త బయటికి రాగానే, అటుగా వెళ్లిన చాలామంది ప్రయాణికులు పోలీసులను కలిశారు. జూన్ 8 , 11 మధ్యలో తమకి కూడా ఆ నగ్నంగా ఉన్న అమ్మాయి కనిపించిందని, భయపడి ఆగలేదని చెప్పారు. ఇక బాబు స్పృహలోకి వచ్చిన తర్వాత, తన చుట్టూ కమ్మిన ఓ ప్రకాశవంతమైన కాంతి గురించి అస్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో క్రిస్టీన్ తన బిడ్డను తానే ఆత్మ రూపంలో కాపాడుకుందని నమ్మారు. బాబు పెద్దవాడయ్యాక, ఆ రాత్రులను తలచుకుని చాలా ఇంటర్వ్యూలిచ్చాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు, చాలా ఎత్తు నుంచి కారు పల్టీలు కొట్టింది. నాకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కానీ ప్రతి క్షణం మా అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది, నాకసలు భయమేయలేదు’ అని ఇప్పటికీ చెబుతుంటాడు నిక్.అంత చిన్న బాబు అన్ని దెబ్బలతో, అలాంటి వాతావరణంలో, అడవిలాంటి ప్రాంతంలో అన్ని రోజులు బతకడం కష్టమని డాక్టర్లు సైతం తేల్చేశారు. ఇదిలా ఉంటే, క్రిస్టీన్ తల్లికి ఈ ప్రమాదం జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి వరుసగా పీడకలలు వచ్చేవట! ఆ కలల్లో పెద్ద లోయ, కారు పల్టీలు కొట్టడం, మైలు రాయి 16 ఎక్కువగా కనిపించేవట. అయితే యాక్సిడెంట్ అయిన చోట 16 నంబర్ మైలు రాయి నిజంగానే ఉంది. దాంతో మనసులను మెలిపెట్టే ఈ కథలోని ప్రతి సన్నివేశం మిస్టరీనేగా మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఎమోషనల్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా ‘ది కానిస్టేబుల్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘బలగం’ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహూర్తపు సన్నివేశానికి బి. నిఖితా జగదీష్ కెమెరా స్విచ్చాన్ చేయగా బీజే రిథిక క్లాప్ కొట్టారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎమోషనల్ కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నాకు బాగా నచ్చాయి’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్, ‘బలగం’ జగదీష్. దువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు పధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సుభాష్ ఆనంద్, కెమెరా: హజరత్ షేక్ (వలి). -
అధర్వతో ఇద్దరు ముద్దుగుమ్మల రొమాన్స్
ఈ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. అది కమర్షియల్ చిత్రం అయినా క్లాసికల్ చిత్రం అయినా, హారర్ చిత్రం అయినా, టైమ్ మిషన్ చిత్రం అయినా కావచ్చు. ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తో సరిపుచ్చుకుంటూ వచ్చిన యువ నటుడు అధర్వ తాజాగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుండడం విశేషం. దివంగత సీనియర్ నటుడు మురళి వారసుడిగా బానాకాత్తాడి చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయిన అధర్వకు ఆ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వకపోయినా వరుసగా అవకాశాలు రాబట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో బాలా దర్శకత్వంలో నటించిన పరదేశీ చిత్రం నటుడిగా అధర్వకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాస్త వెనకబడినా ఇటీ వల ఈటీ, కణిదన్ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం రుక్మిణి వండి వరుదు చిత్రాన్ని పూర్తి చేసిన అధర్వ తాజాగా చాలా మంది కథానాయకుల మాదిరిగానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చమ బోద ఆగదా అనే చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇద్దరు నాయికలు ఉండే ఇందులో ప్రముక నటీమణుల్ని నటింపజేయాలని మొదట భావించినా, బడ్జెట్ ఎగిరి కూర్చోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉత్తరాది భామలు అనైక, మిష్టిలను ఎంపిక చేశారు. వీరిలో అనైక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం సత్య-2 ద్వారా పరిచయం అయ్యిందన్నది గమనార్హం. తమిళంలోనూ వసంతబాలన్ దర్శకత్వం వహించిన కావయతలైవన్ చిత్రంలో నటించింది.ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండా పోయిన అనైక ఇప్పుడు అధర్వ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందన్న మాట. మరో హీరోయిన్ మిష్టి హిందీలో సుభాష్‌ఘాయ్ దర్శకత్వం వహించిన కాంచీ చిత్రం ద్వారా పరిచయమైంది.అయితే తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం అవుతుంది. ఇకపోతే అధర్వ తొలి చిత్రం బానాకాత్తాడి చిత్రానికి దర్శకత్వం వహించిన బద్రి ఈ చమ బోద ఆగదా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో అధర్వకు జంటగా మిష్టి నటిస్తుండగా ఎవరూ నటించడానికి సాహసించని ఒక బోల్డ్ పాత్రలో అనైక నటిస్తోందని తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదన్నారు.అయితే ఇద్దరు హీరోయిన్లకు చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.


