నిక్‌ స్కుబిష్‌..! అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి? | A Mystery Thriller Story By Nick Skubish And Deborah Hoyt | Sakshi
Sakshi News home page

నిక్‌ స్కుబిష్‌..! అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి?

Aug 11 2024 1:19 AM | Updated on Aug 11 2024 1:19 AM

A Mystery Thriller Story By Nick Skubish And Deborah Hoyt

అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి మరణించింది. తన వెంటే ఉన్న మూడేళ్ల కొడుకు కొనప్రాణాలతో మిగిలాడు. మరణించిన తర్వాత కూడా ఆ తల్లి–కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి, ఆ కొడుకు ప్రాణాలు నిలిచాయి. పెరిగి పెద్దవాడైన కొడుకు మనసులో ఆ జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి.

1994 జూన్‌ 11 రాత్రి, సమయం పదకొండు దాటింది. కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా పర్వతశిఖరాల పక్కనే ఉన్న ‘హైవే నంబర్‌ 50’ వైపు ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారుని డెబోరా హోయ్ట్‌ అనే 35 ఏళ్ల మహిళ నడుపుతోంది. బాగా చీకటిపడటంతో ఆమెకు నిద్ర రాకుండా ఉండటానికి పాటల కచేరీ మొదలుపెట్టాడు పక్క సీట్‌లో కూర్చున్న ఆమె భర్త డేవిడ్‌. దాంతో డెబోరా కూడా డేవిడ్‌తో కలసి గొంతు కలిపింది. ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై భీకరమైన చలిలో పొగమంచును చీల్చుకుంటూ స్ట్రీట్‌ లైట్స్‌ వెలుగుతూనే ఉన్నాయి.

ఉన్నట్టుండి డెబోరా చూపు రోడ్డు తిన్నగా కాకుండా రోడ్డు పక్కకు మళ్లింది. ఒంటి మీద నూలుపోగు లేని ఒక అందమైన అమ్మాయి వెనక్కి తిరిగి, వయ్యారంగా నేలపై పడుకుని ఉంది. ఆమె అచ్చం పాలరాతి బొమ్మలా ఉంది. రెండు చేతులూ పైకి పెట్టుకుని, మోకాళ్లు కాస్త ముడుచుకుని హొయలు పోతున్నట్లే కనిపిస్తోంది. అయితే అది బొమ్మా? మనిషా? ప్రాణం ఉందా? లేదా? అర్థం కాలేదు డెబోరాకు. వెంటనే భర్తకు ఆ దృశ్యాన్ని చూపిస్తూ కారు స్లో చేసింది. అది చూసిన డేవిడ్‌ ‘హేయ్‌ ఆపొద్దు! పోనీ పోనీ!’ అని అరిచేశాడు కంగారుగా. దాంతో డెబోరా కారు గేర్‌ మార్చింది. అతడి భయమేంటంటే, అలా అందమైన అమ్మాయిలను రోడ్లపై పడుకోబెట్టి, దొంగలు కాపుగాసి ఉండవచ్చు. లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండవచ్చు.

‘అర్ధరాత్రి అలా ఎక్కడపడితే అక్కడ కారు ఆపడం ప్రమాదమని నీకు తెలియదా?’ అని తిట్టాడు డేవిడ్‌. అది నిజమే అనిపించింది డెబోరాకి. దాంతో పోలిస్‌ స్టేష¯Œ కి వెళ్లి రిచ్‌ స్ట్రాసర్‌ అనే డిప్యూటీ అధికారికి విషయం చెప్పారు. ‘పదండి ఎక్కడో చూపించండి’ అన్నాడు స్ట్రాసర్‌. దాంతో డెబోరా కారు యూటర్న్‌ తీసుకుంది. తీరా ఆ అమ్మాయి కనిపించిన చోట రెండు లగ్జరీ కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. నిజానికి ‘ఆ అమ్మాయి కనిపించింది సరిగ్గా ఇక్కడే’ అని ఆ దంపతులిద్దరూ గుర్తించలేకపోయారు. సరైన ల్యాండ్‌ మార్క్‌ లేకపోవడంతో పాటు కంగారుగా అక్కడి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ గందరగోళం చెందారు. అయితే ఆ చోటికి వెళ్లగానే, రిచ్‌ స్ట్రాసర్‌ మదిలో ఓ తల్లికొడుకుల మిస్సింగ్‌ కేసు మెదిలింది.

సరిగ్గా ఐదు రోజుల కిందట క్రిస్టీన్‌ స్కుబిష్‌ అనే 23 ఏళ్ల అమ్మాయి తన మూడేళ్ల కొడుకు నిక్‌తో కలసి కారులో ఇదే దారి గుండా వెళ్లిందట! ఆ తర్వాత వాళ్లు ఇంటికి రాలేదు. ఆ మిస్సింగ్‌ కేస్‌ మా దగ్గరకొచ్చింది. మీరు ఒకసారి రేపు ఉదయాన్నే రండి. పగటిపూటైతే మనకు ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా’ అన్నాడు డెబోరాతో స్ట్రాసర్‌.

మరునాడు ఉదయాన్నే స్ట్రాసర్‌ను కలసిన డెబోరా రాత్రి తమ ప్రయాణాన్ని, నగ్నంగా కనిపించిన అమ్మాయి దృశ్యాన్నీ ఇలా ప్రతి విషయాన్నీ  క్షుణ్ణంగా గుర్తు చేసుకుని, ‘బులియన్‌ బెండ్‌‘ అనే ప్రమాదకరమైన చోటును చూపిస్తూ ‘ఇక్కడే సార్‌! రాత్రి నేను చూసింది ఇక్కడే!’ అంది బలంగా. అక్కడే లోయవైపు కారు టైర్ల గుర్తులు ఆనవాళ్లుగా కనిపించాయి స్ట్రాసర్‌కి. కొద్ది దూరంలో ఒక చిన్న çషూ రక్తం మరకలతో  కనిపించింది. వెంటనే వెతుకులాట మొదలుపెట్టించాడు. అదే లోయలో కాసేపటికి క్రిస్టీన్‌ కారు కనిపించింది. ఆ పక్కనే ఆమె మృతదేహం కనిపించింది. కాస్త దూరంలో బాబు పడి ఉన్నాడు. పల్స్‌ కొట్టుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

నిజానికి జూన్‌ 6 తర్వాత రోడ్డు మీదకు కొండచరియలు విగిరిపడటంతో సుమారు రెండు రోజుల పాటు అటుగా రాకపోకలు కూడా ఆగిపోయాయి. అంటే జూన్‌ 6న నిక్, క్రిస్టీన్‌ వెళ్తున్న కారు మీద అవి పడి, ఆ ధాటికి కారు లోయలో పడిపోయి ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే యాక్సిడెంట్‌ అయిన వెంటనే క్రిస్టీన్‌ చనిపోయిందని పోస్ట్‌ మార్టమ్‌లో తేలింది. మరి చిన్న బాబు పగలు భీకరమైన వేడిని, రాత్రి వణికించే చలిని తట్టుకుని, సుమారు ఆరు రోజులు ఎలా ప్రాణాలతో ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి డెబోరా కన్ను ఆ నగ్నంగా కనిపించే అమ్మాయి మీద పడకుండా ఉండి ఉంటే, నిక్‌ ఎవరికీ కనిపించేవాడే కాదు.

ప్రమాదంలో క్రిస్టీన్‌ చనిపోయాక ఆత్మగా మారి, లోయలో పడిన తన బిడ్డను బతికించు కోవడానికే దారిన పోయేవారికి నగ్నంగా కనిపించి ఉంటుందని డెబోరా నమ్మింది. ఆ వార్త బయటికి రాగానే, అటుగా వెళ్లిన చాలామంది ప్రయాణికులు పోలీసులను కలిశారు. జూన్‌ 8 , 11 మధ్యలో తమకి కూడా ఆ నగ్నంగా ఉన్న అమ్మాయి కనిపించిందని, భయపడి ఆగలేదని చెప్పారు. ఇక బాబు స్పృహలోకి వచ్చిన తర్వాత, తన చుట్టూ కమ్మిన ఓ ప్రకాశవంతమైన కాంతి గురించి అస్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో క్రిస్టీన్‌ తన బిడ్డను తానే ఆత్మ రూపంలో కాపాడుకుందని నమ్మారు. బాబు పెద్దవాడయ్యాక, ఆ రాత్రులను తలచుకుని చాలా ఇంటర్వ్యూలిచ్చాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు, చాలా ఎత్తు నుంచి కారు పల్టీలు కొట్టింది. నాకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కానీ ప్రతి క్షణం మా అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది, నాకసలు భయమేయలేదు’ అని ఇప్పటికీ చెబుతుంటాడు నిక్‌.

అంత చిన్న బాబు అన్ని దెబ్బలతో, అలాంటి వాతావరణంలో, అడవిలాంటి ప్రాంతంలో అన్ని రోజులు బతకడం కష్టమని డాక్టర్లు సైతం తేల్చేశారు. ఇదిలా ఉంటే, క్రిస్టీన్‌ తల్లికి ఈ ప్రమాదం జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి వరుసగా పీడకలలు వచ్చేవట! ఆ కలల్లో పెద్ద లోయ, కారు పల్టీలు కొట్టడం, మైలు రాయి 16 ఎక్కువగా కనిపించేవట. అయితే యాక్సిడెంట్‌ అయిన చోట 16 నంబర్‌ మైలు రాయి నిజంగానే ఉంది. దాంతో మనసులను మెలిపెట్టే ఈ కథలోని ప్రతి సన్నివేశం మిస్టరీనేగా మిగిలిపోయింది. – సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement