కిడ్నీలపై దాడి చేసే తోడేలు వ్యాధి | Lupus is an autoimmune disease that makes your immune system damage organs | Sakshi
Sakshi News home page

కిడ్నీలపై దాడి చేసే తోడేలు వ్యాధి

Aug 30 2026 5:10 AM | Updated on Aug 30 2026 5:10 AM

Lupus is an autoimmune disease that makes your immune system damage organs

లూపస్‌ నెఫ్రైటిస్‌

తన సొంత కణాలను తానే దెబ్బతీసే ఆటోఇమ్యూన్‌ వ్యాధుల్లో లూపస్‌ అనేది కూడా ఒకటి. నిజానికి లాటిన్‌ భాషలో లూపస్‌ అంటే తోడేలు అని అర్థం. ఈ వ్యాధి 
వచ్చిన వాళ్లలో ముక్కు చుట్టూ సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే ర్యాష్‌ వల్ల ముఖం తోడేలులా కనిపించడం ఒక అంశమైతే... చాలా క్రూరంగా తన ఎరను వేటాడి ఆకలిగా తినేసే జంతువుల్లో తోడేలు ఒకటి. ఈ రెండు కారణాలతో ఈ జబ్బుకు ‘లూపస్‌’ అని పేరొచ్చింది.

 సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌ అనే జబ్బు పేరుకు సంక్షిప్త రూపమే ఈ ‘లూపస్‌’. ముందుగా చెప్పినట్టుగా... ఈ జబ్బు తన సొంత కణాలను దెబ్బతీసే క్రమంలో కీళ్లూ, చర్మం ఇతరత్రా అవయవాల లాగానే  మూత్రపిండాల (కిడ్నీల) పైనా తన దుష్ప్రభావం చూపవచ్చు. అదెలా జరుగుతుంది, ఆ జబ్బును ఏమంటారు, వాటి లక్షణాలూ, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం.  

లూపస్‌ కారణంగా కిడ్నీపై దుష్ప్రభావం పడి అవి దెబ్బతినే కండిషన్‌కు ‘లూపస్‌ నెఫ్రైటిస్‌’ అని పేరు. తొలిదశలోనే గుర్తించకపోతే ‘లూపస్‌ నెఫ్రైటిస్‌’... మూత్రపిండాల (కిడ్నీల) వైఫల్యానికి దారితీసే ముప్పు ఉంటుంది. లూపస్‌ కారణంగా కిడ్నీల్లో వాపు, వడపోత (ఫిల్టరింగ్‌) వ్యవస్థ దెబ్బతినడాన్ని లూపస్‌ నెఫ్రైటిస్‌ అంటారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది... దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (క్రానిక్‌ కిడ్నీ డిజీస్‌ –సీకేడీ) మొదలుకొని... చివరకు కిడ్నీ వైఫల్యానికి (కిడ్నీ ఫెయిల్యూర్‌కు) దారితీసే ప్రమాదం ఉంది.

కిడ్నీని ఎలా దెబ్బతీస్తుందంటే...
తొలుత చెప్పుకున్నట్లుగానే... ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో...  తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్ధ అనేది... తన సొంత కణాలనూ, కణజాలాన్ని పరాయివి భావించి... వాటిని దెబ్బతీసినట్టే... లూపస్‌ అనే ఆటోఇమ్యూన్‌ వ్యాధిలోనూ అదే జరుగుతుంది. లూపస్‌ వ్యాధిగ్రస్తుల్లోని ఇమ్యూన్‌ వ్యవస్థ తాను ఉత్పత్తి చేసే యాంటీబాడీస్, ఇమ్యూన్‌ కాంప్లెక్స్‌లన్నవి కిడ్నీలోని అత్యంత సూక్ష్మమైన, సంక్లిష్టమైన వడపోత కేంద్రాలైన గ్లోమెరూలైపై దాడి చేసి, వాటిని దెబ్బతీస్తాయి. అలా గ్లోమెరూలై దెబ్బతినడంతో కిడ్నీలు తమ ‘వడపోత’ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కిడ్నీ పనితీరు క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా క్రమక్రమంగా తొలుత దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మొదలుకొని, చివరకు కిడ్నీ ఫెయిల్యూర్‌కు అది దారితీయవచ్చు. 

ఇవీ లక్షణాలు... 
మన దేహంలో కాలేయం, కిడ్నీ వంటి అవయవాలకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. దాదాపు 90 శాతం చెడిపోయేవరకూ అవి తమ జీవక్రియలను చాలా సమర్థంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ అంశమే లక్షణాలను చాలా ఆలస్యంగా బయటపడేలా చేస్తుంది. అందుకే లూపస్‌ నెఫ్రైటిస్‌ మొదటి దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. అయితే లూపస్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం కీలకం. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్ , రక్తం కనిపించి వ్యాధి బయటపడే అవకాశాలెక్కువ. సాధారణంగా లూపస్‌ నెఫ్రైటిస్‌లో కనిపించే లక్షణాలివి... 
→ మూత్రంలో నురుగు లేదా ఎక్కువగా బుడగలు రావడం
→ మూత్రంలో రక్తం కనిపించడం లేదా మూత్రం గోధుమరంగులోకి మారడం. 
→ కాళ్లు, పాదాలు, ముఖం లేదా కళ్ల చుట్టూ వాపు. 
→ అకస్మాత్తుగా బరువు పెరగడం. 
→ మూత్రం పరిమాణం తగ్గడం. 
→ అధిక రక్తపోటు 
→ తీవ్రమైన అలసట... 
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా  వైద్యులను సంప్రదించాలి.

నిర్ధారణ ఇలా... 
లూపస్‌ నెఫ్రైటిస్‌ను గుర్తించడానికి బాధితుల లక్షణాలు, వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వైద్యులు మరికొన్ని పరీక్షలనూ సూచిస్తారు. ఉదాహరణకు మూత్ర పరీక్ష ద్వారా ప్రోటీన్ , రక్తం వంటివి గుర్తిస్తారు. మరికొన్నిæ రక్తపరీక్షల ద్వారా కిడ్నీ పనితీరుతోపాటు లూపస్‌కు సంబంధించిన కొన్ని ఇమ్యూన్  సూచికలను పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి కిడ్నీ బయాప్సీ చేసి వ్యాధి ఏ స్థాయిలో ఉందో, కిడ్నీకి ఏ మేరకు ఏ రకం నష్టం జరిగిందో నిర్ధారణ చేస్తారు. 

పూర్తి నివారణ సాధ్యమేనా? 
లూపస్‌ అనేది ఆటో ఇమ్యూన్‌ వ్యాధి కారణంతో దీని నివారణ పూర్తిగా సాధ్యం కాదు. అంతేకాదు... చికిత్సతో ఇది పూర్తిగా తగ్గుతుందని చెప్పడానికీ లేదు. అయితే వ్యాధిని నియంత్రణలో ఉంచడం ద్వారా కిడ్నీపై పడే దుష్ప్రభావాన్నీ, కిడ్నీకి జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యమే. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, మెడికల్‌షాపు నుంచి తామే స్వయంగా తీసుకునే మందుల్ని (ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్‌ను) తీసుకోకపోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వంటి మంచి జీవనశైలి (లైఫ్‌స్టైల్‌) పాటించడం, అవసరమైన ఫాలోఅప్‌ పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలతో దీన్ని అదుపులో పెట్టడం చాలావరకు సాధ్యమే. 

చివరగా... లూపస్‌ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందువల్ల పైకి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ పనితీరు, మూత్రంలో ప్రోటీన్  పోవడం వంటి వాటిని చూసుకుంటూ ఉండాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం లూపస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లూపస్‌ నెఫ్రైౖ టిస్‌ నిర్ధారణ అయితే మాత్రం ఈ తరహా పరీక్షలూ, పర్యవేక్షణ మరింత తరచూ అవసరం కావచ్చు. మరీ ముఖ్యంగా లూపస్‌ ఉన్న బాధితుల్లో... మూత్రంలో నురుగు, రక్తం, దేహంలో వాపు లేదా రక్తపోటు పెరగడం వంటివి కనిపిస్తే వెంటనే నెఫ్రాలజిస్ట్‌ లేదా రుమటాలజిస్ట్‌ను సంప్రదించడం అవసరం. ఈ వ్యాధిలో సమస్యను ఎంత త్వరగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే... కిడ్నీపై దుష్ప్రభావాన్ని అంతగా తగ్గించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

చికిత్స

ఈ వ్యాధికి చికిత్స అన్నది వ్యాధి తీవ్రత, కిడ్నీ బయాప్సీ ఫలితాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులు లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ తాలూకు ‘అతి చురుకుదనా’న్ని తగ్గించేందుకు ఇమ్యూనోసప్రెసివ్‌ మందులు, స్టెరాయిడ్లు వాడటం వంటి చికిత్స ప్రక్రియలను వైద్యులు అనుసరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైకోఫెనోలేట్, సైక్లోఫాస్ఫమైడ్, బయోలాజిక్స్‌ లేదా ఈవ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే ఇతరత్రా మందులనూ డాక్టర్లు సూచించవచ్చు. లూపస్‌ చికిత్సలో ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ ’ను కూడా ఓ ముఖ్యమైన మందుగా చెప్పవచ్చు. 

అధిక రక్తపోటు, మూత్రంలో అధిక ప్రోటీన్  వంటి సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన మందుల్నీ ఇవ్వవచ్చు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని వైఫల్యానికి చేరితే డయాలసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి చికిత్స అవసరం కావచ్చు.

డాక్టర్‌ సీరపాణి గోపాలుని సీనియర్‌ కన్సల్టెంట్‌ 
నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement