ఇన్‌స్పైరింగ్ స్టోరీ
– ఎనిమిది వందల కోట్ల స్పేస్ టెక్ కంపెనీ అధిపతి‘
అనగనగా ఒక ట్రాక్టర్ డ్రైవర్ కొడుకు. అతడు కాలేజీలో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ చేసే స్పేస్ టెక్ కంపెనీకి అధిపతి’... ఇది వినగానే... ‘ఏ సినిమా కథ ఇది?’ అని అడుగుతారు చాలామంది. ఇది సినిమా కథ కాదు. తమిళనాడుకు చెందిన ఆనంద్ మేఘలింగం కథ. ఎంతోమందికి స్ఫూర్తినిస్తోన్న నిజ జీవిత కథ...
ఆనంద్ చదువు నల్లేరు మీద నడక కాదు. ఎన్నో కష్టాలు ఎదురొచ్చాయి. ఇక కాలేజీ జీవితమైతే మరింత కష్టంగా సాగింది. ఇంజినీరింగ్‌లో మొదటి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ ఫెయిలయ్యాడు!
ఆ తరువాత ఒక ప్రైవేట్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. ఆ సబ్జెక్ట్ అతడి జీవిత గమనాన్ని మార్చింది. ఏరోనాటికల్‌కు సంబంధించి ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో ఆనంద్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
‘నా భవిష్యత్ ఏరోస్పేస్ రంగం’ అని గట్టిగా అనుకున్నాడు ఆనంద్. ఆ తరువాత కాలంలో ‘స్పేస్‌జోన్ ఇండియా’ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు, పునర్వినియోగ రాకెట్ సాంకేతికతపై పనిచేసే స్టార్టప్ ఇది.
నాన్నకు ప్రేమతో...
తండ్రిని తన కంపెనీకి కో–ఫౌండర్‌ను చేసి, అతనికి 50 శాతం వాటా ఇచ్చాడు ఆనంద్.‘భారతదేశపు మొట్ట మొదటి హైబ్రీడ్ రాకెట్ డైరెక్టర్’గా తనను తాను సగర్వంగా పరిచయం చేసుకునే ఆనంద్ మేఘలింగం గతంలోకి వెళితే...సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి ట్రాక్టర్ నడిపేవాడు.
కొడుకు బాగా చదివి పెద్ద స్థాయికి వెళ్లాలని అందరు తండ్రులలాగే అతడు కూడా ఆశించాడు. కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరడం వల్ల తన భవిష్యత్ బాగుంటుందని ఆనంద్ ఆశించాడు. కాని తరువాత రోజుల్లో అతడికి ఆ సబ్జెక్ట్ ఆసక్తిగా అనిపించలేదు. ఆసక్తి లేకపోవడం వల్ల సబ్జెక్ట్ బొత్తిగా అర్థం కాలేదు.పరీక్షలలో సున్నాలు హాయ్ చెప్పడం మొదలు పెట్టాయి. ఆనంద్ చదువుకు తాత్కాలికంగా గుడ్‌బై చె΄్పాడు. అలా అని నిరాశపడుతూ కూర్చోలేదు.
నెక్ట్స్ ఏమిటి!
‘ఇప్పుడు నేను ఏం చేయాలి?’ లోతుగా ఆలోచించాడు ఆనంద్. ‘ఆసక్తి ఉంటే ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా చాలా సులువుగా అర్థమవుతుంది’ అనే మాట అతడికి గుర్తుకు వచ్చింది. ఆనంద్‌కు విమానయానం, అంతరిక్ష విషయాలు అంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నాడు. ‘భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకొని గోల్డ్‌మెడలిస్ట్ అయ్యాడు.
తొలి అడుగు... రూమీ–1
మన అంతరిక్ష రంగంలోకి ఇప్పుడిప్పుడే ప్రైవేట్ కంపెనీల అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో తన ‘స్పేస్‌జోన్ ఇండియా’ స్టార్టప్‌తో ఆ రంగంలోకి అడుగు పెట్టాడు ఆనంద్. ‘రూమీ–1’ పేరుతో తొలి ప్రాజెక్ట్ మొదలైంది. పరిమిత నిధులు, సాంకేతిక సమస్యల వల్ల ప్రాజెక్ట్ మొదట్లో నత్తనడక నడిచింది. ఎన్నో అడ్డంకులను దాటుకొని తమిళనాడులోని తిరువిదన్‌దైలో ప్రయోగం జరిగింది. ఇగ్నిషన్ బటన్ నొక్కిన తరువాత నాలుగు సెకన్‌ల పాటు అత్యంత ఉత్కంఠతతో వేచి చూశాడు ఆనంద్.
‘నా జీవితంలో ఆ నాలుగు సెకన్‌లు నాలుగు యుగాలతో సమానం. అవి అత్యంత సుదీర్ఘమైన క్షణాలు!’ అని ఆనాటి ఉద్విగ్న స్థితిని గుర్తు చేసుకుంటాడు ఆనంద్. తన కలలను మోసుకెళుతున్నట్లుగా ‘రూమీ–1’ మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మూడు క్యూబ్‌శాట్‌లు, 50 పికో ఉపగ్రహాలను మోసుకెళ్తూ అంతరిక్షంలోకి ప్రవేశించి ఆనంద్ కలలను నిజం చేసింది. ఆనంద్‌కు ఇది ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ! అతని అలుపెరుగని ప్రయాణానికి లభించిన అతి పెద్ద బహుమానం!
‘మా లక్ష్యం కేవలం రాకెట్లను ప్రయోగించడం మాత్రమే కాదు. బలమైన, సురక్షితమైన సాంకేతికతను నిర్మించే సత్తా మన దేశానికి ఉందని నిరూపించడమే మాఅసలైన లక్ష్యం’ అంటున్నాడు ఆనంద్ మేఘలింగం.
భవిష్యత్ లక్ష్యం
చేదు అనుభవాలు, ఎదురు దెబ్బలు అనేవి ఆనంద్‌కు స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎదురయ్యాయి. ఏరోస్పేస్ పరిశోధనలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో యూఎస్ విసా కోసం అతడు చేసుకున్న దరఖాస్తు తిరస్కారానికి గురైంది. అలా అని నిరాశపడలేదు. ఆగిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 23 మందిలో ఆనంద్ ఒకరు.
నాసా నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్తలు, ఏరోస్పేస్ నిపుణులు, సైనిక అధికారులు, స్పేస్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. దీని ద్వారా ఏరోస్పేస్ సాంకేతికతకు సంబంధించిన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. ‘అంతరిక్షానికి సంబంధించి అమెరికా ఉపయోగిస్తున్న సాంకేతికత అసాధారణమైనది’ అంటాడు ఆనంద్. తన ‘స్పేస్‌జోన్ ఇండియా’ ద్వారా అలాంటి అరుదైన సాంకేతికతను సృష్టించాలని కలలు కంటున్నాడు ఆనంద్. ‘కలలు విజయానికి తొలి మెట్టు’ అనే అబ్దుల్ కలామ్ మాట మనకు తెలిసిందే కదా!


